ఒకప్పుడు గురుకులాలు అంటే శిథిల భవనాల్లో వసతి.. ముతక బియ్యం.. ఉడికీ ఉడకని అన్నం.. నీళ్ల చారు.. అర్హత లేని ఉపాధ్యాయుల బోధన.. నాణ్యత లేని విద్యా ప్రమాణాలు.. చదువుల్లో వెనుకబాటు.. విద్యార్థుల భవిష్యత్తుకు గ్రహపాటు.. కానీ స్వరాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ విజన్‌తో గురుకులాలు బలోపేతమయ్యాయి. దీనిలో భాగంగానే పాల్వంచలోని గురుకులం ప్రత్యేకతను సంతరించుకున్నది. పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ర్యాంకులు సాధిస్తున్నది. కార్పొరేట్‌కు దీటుగా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నది. పాఠశాల స్థాయి నుంచే పిల్లలకు ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, నీట్‌కు నిపుణులతో శిక్షణ ఇస్తున్నది. క్రీడల్లోనూ శిక్షణ ఇస్తుండడంతో గురుకులానికి చెందిన క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడల్లో రాణిస్తున్నారు. పథకాలు సాధించి జిల్లాఖ్యాతిని ఇనుమడింపజేస్తున్నారు. ఈ విజయాలపై ‘నమస్తే’ ప్రత్యేక కథనం.
కొత్తగూడెం ఎడ్యుకేషన్, అక్టోబర్ 14: కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ర్యాంకులు, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో క్రీడా పతకాలు.. ఆటలైనా, పాటలైనా.. అన్నింటిలో ది బెస్ట్ భద్రాద్రి జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకులాలు. పేద, వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు నాణ్యమైన విద్య అందించే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాలను బలోపేతం చేసింది. అవసరమైన చోట కొన్ని కొత్తగా ఏర్పాటు చేసింది. జిల్లాలోని తొమ్మిది గురుకులాల్లో ప్రస్తుతం 5,680 మంది విద్యనభ్యసిస్తున్నారు. గురుకులాల్లో చదువుతున్న ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం ఏడాదికి సుమారు రూ.1.30 లక్షలు వెచ్చిస్తూ బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నది. పాల్వంచలోని గురుకులంలో ప్రత్యేకంగా డిగ్రీ కోర్సు నడుస్తున్నది. ఈ గురుకులంలో చదువుతున్న విద్యార్థులు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉన్నారు.
ఎస్సీ గురుకులాల్లో ఐఐటీ, నీట్‌తో పాటు క్రీడల్లోనూ యాజమాన్యాలు తర్ఫీదునిస్తున్నాయి. విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లోనూ రాణిస్తున్నారు. ఇప్పటివరకు పాల్వంచ ఎస్సీ గురుకులంలో చదివిన 48 మంది విద్యార్థులు డాక్టర్లుగా ఎదిగారు. మరో 20 మంది దేశంలోని ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీల్లో వైద్యవిద్యను అభ్యసిస్తున్నారు. కొందరు సబ్‌మైరైన్ ఇంజిరింగ్ కోర్సుల్లో సీటు సాధించారు. దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన స్కాలర్స్టిక్ అసిస్టెంట్ టెస్ట్(ఎస్ఏటీ)కి ఎంపికవుతున్నారు. ఎస్ఏటీలో మొత్తం 40 సీట్లు ఉండగా గురుకులానికి చెందిన ఎస్.వంశీ, జి.క్రాంతినాయక్, కె.అఖిల్, కె.సిద్దు, డి.సిద్దార్థ అలెగ్జాండర్, కె.సుజయ్ నితిన్ ఎంపికయ్యారు. వీరు నవంబర్‌లో జరిగే ఫైనల్ పరీక్షల్లో నెగ్గితే ప్రభుత్వమే వారిని విదేశాల్లో చదివించనున్నది. కురుక్షేత్రలోని రీజినల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్(ఆర్ఐఈ) ఐదేళ్ల కోర్సుకు దక్షిణ భారతం నుంచి ఐదుగురు విద్యార్థులకు అవకాశం ఉన్నది. ఈ గురుకులానికి చెందిన హోపూరి రాజేశ్ సీటు సాధించాడు.
గురుకుల యాజమాన్యం ఉత్తమ బోధనతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నది. గురుకులానికి చెందిన ఎంతోమంది క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధిస్తున్నారు. జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్నారు. ఇటీవల మెదక్‌లో 10 కిలోమీటర్ల వాకింగ్ ఈవెంట్లో ఇంటర్మీడియట్ విద్యార్థి భాస్కర్‌నాయక్ మెడల్, నల్గొండలో జరిగిన యూత్ మీట్లో సిల్వర్ మెడల్ సాధించాడు. గురుకులాల స్పోర్ట్స్ మీట్లో అండర్-17, అండర్-19 ఫుట్‌బాల్ పోటీల్లో పలువురు బంగారు పతకాలు సాధించారు. క్యారమ్స్, చెస్, కబడ్డీ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచారు.
గురుకులంలో ఉదయం 5.30 నుంచే యాజమాన్యం విద్యార్థులకు స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నది. ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, నీట్ సిద్ధం చేసేందుకు అదనపు తరగతులు చేపడుతున్నది. ఆధునాతన కంప్యూటర్ ల్యాబ్‌లో కంప్యూటర్ కోర్సు ఇస్తున్నది. పక్కాగా ఫుడ్ మెనూ అమలు చేస్తున్నది. ప్రతిరోజూ సన్న బియ్యంతో భోజనం, ప్రతిరోజూ గుడ్డు లేదా అరటిపండు అందిస్తున్నది. వారానికి ఒకసారి మాంసాహారం అందజేస్తున్నది.
స్వరాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలను బలోపేతం చేసింది. గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నది. పాల్వంచ గురుకులం సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా నిలుస్తున్నది. ఈ గురకులంలో చేరేందుకు ఏటా పోటీ నడుస్తున్నది. ఇక్కడ చదివిన ఎంతోమంది విద్యార్థులు ప్రయోజకులయ్యారు.
-కె.వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్, పాల్వంచ గురుకులం
నేను చిన్నతనం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నాను. పాల్వంచ గురుకులంలో ఇంటర్మీడియట్ చదివా. ఇక్కడ చదివి కోచింగ్ తీసుకొని ఎంబీబీఎస్ చదివాను. వైద్యుడినయ్యాను. గురుకులంలో నాణ్యమైన విద్య అందించడంతోనే నేను భవిష్యత్తుకు పునాది వేసుకున్నాను. వైద్యుడిగా ఎంతోమందికి నిరుపేదలకు సేవలందిస్తున్నాను.
– బాబురావు, వైద్యుడు, కొత్తగూడెం