అశ్వారావుపేట, అక్టోబర్ 9: సమష్టిగా పనిచేస్తూ ఆయిల్‌పాం రైతుల సమస్యలను పరిష్కరిస్తామని తెలంగాణ పామాయిల్ ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన అధ్యక్ష, కార్యదర్శులు ఆలపాటి రామచంద్రప్రసాద్, కోటగిరి సీతారామస్వామి అన్నారు. అశ్వారావుపేటలోని గిరిజన భవన్లో ఆదివారం నిర్వహించిన ఎన్నికలో వారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఆయిల్‌పాం ఫ్యాక్టరీల్లో సామర్థ్యం పెంపు, గెలల దిగుమతిలో ఎదురవుతున్న సమస్యలను తక్షణం పరిష్కరించుకోవాల్సి ఉందన్నారు. నూతన కమిటీ సభ్యులకు రైతులందరూ సహకరించాలన్నారు. ఆయిల్‌ఫెడ్ ద్వారా రైతులు మెరుగైన సేవలు పొందేలా కృషి చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఆయిల్ పాం విస్తరణకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏడు ఉమ్మడి జిల్లాల్లో ఆయిల్ పాం సాగవుతుందన్నారు. నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న రైతులకు కృతజ్ఙతలు తెలిపారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల కన్వీనర్ జూపల్లి రమేశ్, సీనియర్ రైతు నాయకులు డీకేఎం మహిపాల్ పాల్గొన్నారు.
నూతన కమిటీ ఇదే..
తెలంగాణ పామాయిల్ ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ అధ్యక్షుడిగా దమ్మపేట మండలానికి చెందిన ఆలపాటి రామచంద్రప్రసాద్, కార్యదర్శిగా అశ్వారావుపేట మండలానికి చెందిన కోటగిరి సీతారామస్వామి, కోశాధికారిగా ఖమ్మం జిల్లా వేంసూరు మండలానికి చెందిన బండి గురువారెడ్డి, ఉపాధ్యక్షుడిగా మెదక్ జిల్లాకు చెందిన యడ్ల సోమిరెడ్డి, సహాయ కార్యదర్శిగా వరంగల్ జిల్లాకు చెందిన టి.అంజయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఖమ్మం జిల్లా ముదిగొండకు చెందిన సామినేని హరిప్రసాద్, డైరెక్టర్లుగా కాసాని చంద్రమోహన్, అంకత మహేశ్వరరావు, కొయ్యల అచ్యుతరావు, యుగంధర్, గంగిరెడ్డి సుందర్‌రెడ్డి, వేంపాటి లక్ష్మీనారాయణ, మల్లిరెడ్డి పూర్ణ చంద్రారెడ్డి, వెన్నపురెడ్డి బాపురెడ్డి, దడివి నవీన్, ముత్తారెడ్డి ఎన్నికయ్యారు.
మాజీ మంత్రి తుమ్మల శుభాకాంక్షలు
కమిటీ సభ్యులు దమ్మపేట మండలంలోని గండుగులపల్లిలోని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వగృహంలో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ మంత్రి నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయిల్‌పాం రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కమిటీకి ఎల్లప్పుడూ తన సహాయ సహకారాలు ఉంటాయన్నారు.