ఖమ్మం వ్యవసాయం, అక్టోబర్ 7: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు ఏటికేడూ పంటల దిగుమతులు పెరుగుతుండడంతో అందుకు అనుగుణంగా అధికారులు, పాలకవర్గ బాధ్యులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి, మిర్చి, అపరాల పంటల క్రయవిక్రయాలకు వేర్వేరు యార్డులు అందుబాటులో ఉన్నాయి.
అయితే సదరు యార్డుల్లో పురాతన భవనాలు ఉండడంతో యార్డు విస్తీర్ణం పెంపు సాధ్యం కాని పరిస్థితి. కొద్ది నెలల క్రితం వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్.. ‘మార్కెట్ యార్డుల విస్తీర్ణం పెంపు సాధ్యాసాధ్యాలు – మార్కెట్ కమిటీ ఆధునీకరణ’పై క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. అనంతరం సుమారు గంటపాటు మార్కెట్ కార్యాలయంలో సంబంధిత మార్కెటింగ్ శాఖ డీఈ, ఏఈలు, ఏఎంసీ చైర్పర్సన్, సెక్రటరీలతో సమీక్షించారు.
అనంతరం కొద్ది రోజులకే యార్డులో ఉన్న పురాతన మార్కెట్ కమిటీ కార్యాలయం, దడవాయి సంఘం కార్యాలయం, ఇతర మరో మూడు పాత భవనాల తొలగింపునకు సర్కార్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అదేవిధంగా మూడు ప్రధాన యార్డులు, పరిసర ప్రాంతాల వీధులు, ఆర్చీలు, హోల్‌సేల్ కూరగాయల మార్కెట్ ప్రధాన ద్వారాల ఆధునీకరణ పనులకు గాను రూ.10 కోట్ల నిధులను ప్రకటించింది.
దీంతో దశాబ్దాల తరువాత మార్కెట్‌కు నూతన ఒరవడి రాబోతుంది. అందులో భాగంగా చైర్పర్సన్, సెక్రటరీలు యుద్ధప్రాతిపదికన పురాతన భవనాల తొలగింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే తొలగింపు పనులు పూర్తి కావస్తున్న తరణంలో తద్వారా చేపట్టే నిర్మాణ పనులపై సంబంధిత అధికారులు దృష్టి కేంద్రీకరించారు. ఈ వానకాలం మిర్చి పంట మార్కెట్ యార్డుకు వచ్చే సమయంలోపు యార్డులో సీసీ నిర్మాణం, ఇతర మౌలిక వసతుల కల్పన పనులు పూర్తయ్యేలా కార్యాచరణ సిద్ధం చేశారు.
కొత్త పంటల రాక ప్రారంభం..
ఈ సంవత్సరం వానకాలం సీజన్లో సాగు చేసిన పంటలు ఇప్పుడిప్పుడే రైతుల చేతికి వస్తున్నాయి. పెసర పంటను పూర్తిస్థాయిలో మార్కెట్‌కు తెస్తున్నారు. జిల్లాలో ఈ సంవత్సరం ప్రధానంగా పత్తి పంట 2.20 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. మిర్చి పంట మరో 60 వేల ఎకరాల్లో సాగవుతోంది. అయితే ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు ఖమ్మంతోపాటు పొరుగు జిల్లాల నుంచి రైతులు పంటను తెస్తుంటారు. ఇప్పటికే ఆయా జిల్లాల నుంచి సాగు, దిగుబడి వివరాల అంచనాలను తెప్పించుకున్న మార్కెట్ కమిటీ.. అందుకు తగ్గట్టుగా చర్యలు చేపట్టింది. భారత పత్తి సంస్థ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన పక్షంలో అందుకు అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులు ప్రాథమికంగా సమీక్షించారు.
రైతులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు..
పంటను మార్కెట్‌కు తీసుకొచ్చే రైతులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకుంటున్నాం. పురాతన భవనాల తొలగింపు చేపట్టాం. మంత్రి అజయ్‌కుమార్ సహకారంతో కొద్ది రోజుల్లోనే మార్కెట్ ఆధునీకరణ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ సంవత్సరం ఖమ్మం మార్కెట్‌ను రాష్టంలోనే అగ్రగామిగా నిలపాలన్న ధ్యేయంతో పనిచేస్తున్నాం.
-డౌలే లక్ష్మీప్రసన్న, చైర్పర్సన్, ఖమ్మం ఏఎంసీ