ఉమ్మడి జిల్లా బీ(టీ)ఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు అధిష్ఠానం ప్రచార బాధ్యతలు అప్పగించింది. అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, తాతా మధుసూదన్ మునుగోడు నియోజవర్గంలో పలు గ్రామాలకు ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. శుక్రవారం నుంచి వీరు కదనరంగంలోకి దూకారు. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలుపే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.
ఖమ్మం, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మునుగోడు ఎమ్మెల్యే కోమటి రాజగోపాల్‌రెడ్డి తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో రాజకీయ పార్టీల హడావుడి మొదలైంది. టీఆర్ఎస్ అధిష్ఠానం శుక్రవారం పార్టీ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని ప్రకటించింది. ఆయన్ను గెలిపించేందుకు అధిష్ఠానం పలువురు ప్రజాప్రతినిధులను గ్రామాలకు ఎన్నికల ఇన్చార్జులుగా నియమించింది.
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మునుగోడు మండల పరిధిలోని కొరిటికల్, దుమ్మకాలువ, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఇదే మండలంలోని కొంపెల్లి, కల్వకుంట్ల, సత్తుపల్లి శాసనసభ్యుడు సండ్ర వెంకటవీరయ్య చౌటుప్పల్ మండల పరిధిలోని పెద్దకొండూరు, మసిడిగూడెం, గారమాల, పాలేరు శాసనసభ్యుడు కందాళ ఉపేందర్‌రెడ్డి చెండూరు మండలంలోని గుండ్రాంపల్లి, చామళ్లపల్లి, బొకువారిగూడెం, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మునుగోడు మండలంలోని పడివలె, పోతులారం ఇన్చార్జులుగా వ్యవహరించనున్నారు. వీరంతా ఎన్నికల ప్రచారంలో క్రియాశీలకంగా వ్యవహరించనున్నారు. 25 రోజుల పాటు కార్యకర్తలు, ముఖ్యనేతలను సమన్వయం చేసుకుంటూ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయనున్నారు. శనివారం ఉదయం వీరంతా తమకు కేటాయించిన గ్రామాలకు చేరుకోనున్నారు.