తిరుమలాయపాలెం, అక్టోబర్ 6: నాడు నెర్రెలు వారిన చెరువులు.. ఎండిపోయిన బావులు.. పిచ్చి మొక్కలతో పంట కాలువలు.. వాడిపోయిన పంట లు.. రైతుకు కన్నీరు.. చేపల వేటకు ఆస్కారం లేక మత్స్యకారుల పస్తులు.. ఇదీ ఉమ్మడి పాలనలో పాలేరు నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులు. వర్షాధారంగా పంటలను నమ్ముకునే రైతులు వ్యవసాయం చేసేవారు. కానీ స్వరాష్ట్రం వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. సీఎం కేసీఆర్ తనదైన విజన్‌తో నీటి వనరులను ఒడిసిపట్టారు. దీనిలో భాగంగా తిరుమలాయపాలెంలోని ఇస్లావత్ తండాలో ఏర్పాటైన భక్తరామదాసు ఎత్తిపోతల పథకంతో కరువు నేలపై కృష్ణా జలాలు పారుతున్నాయి. చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. పంట పొలాలు సస్యశ్యామలమయ్యాయి.. మత్స్యకారులకు తిరిగి మంచి రోజులు వచ్చాయి. తిరిగి చేపల వేట ప్రారంభమైంది. ఉపాధి దొరికింది.
మత్స్యకారులకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. చేపలు విక్రయించుకునేందుకు వారికి రాయితీపై ద్విచక్రవాహనాలు, వ్యాన్లను అందించింది. చెరువుల్లో చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నది. వందశాతం రాయితీతో చేపపిల్లలను పంపిణీ చేస్తున్నది. దీనిలో భాగంగా ఈ ఏడాది తిరుమలాయపాలెం మండలవ్యాప్తంగా ఉన్న 57 చెరువుల్లో 8.37 లక్షల చేప పిల్లలను వదిలింది. ఐదేళ్ల నుంచి మత్స్యకారులు చేపల వేట ద్వారా ఉపాధి పొందుతున్నారు. తమ పిల్లలను చదివించుకుంటున్నారు. కుటుంబాలను పోషించుకుంటున్నారు.
ఉమ్మడి పాలకులు మత్స్యకారుల సంక్షేమాన్ని పట్టించుకోలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ వందశాతం రాయితీపై చేపపిల్లలు పంపిణీ చేస్తున్నారు. రాయితీపై వాహనాలు అందజేస్తున్నారు. మత్స్యకారులు ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకొస్తున్న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
– బాషబోయిన వీరన్న, మత్స్యకారుడు, జల్లేపల్లి
మత్స్యకారుల బాగోగులను పట్టించుకున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన మత్స్యకారుల ఆత్మబంధువుగా నిలిచి అనేక రాయితీలు అమలుచేస్తున్నారు. మాకు బీమా పథకం అమలు చేయాలని కోరుకుంటున్నాం. సీఎం కేసీఆర్‌కు మత్సకారులంతా రుణపడి ఉంటారు.
– యనగందుల సత్యం, మత్య్సకారుడు, పిండిప్రోలు