కూసుమంచి రూరల్, అక్టోబర్ 6: దేవీ నవరాత్రి ఉత్సవాల ముగియడంతో దుర్గాదేవి అమ్మవారి విగ్రహాలను గురువారం వైభవంగా ఊరేగించి, సమీపంలోని జలాశయాల్లో నిమజ్జనం చేశారు. మండల పరిధిలోని గట్టుసింగారం, నర్సింహులగూడెం, నేలపట్ల, చేగొమ్మ, కిష్టాపురం, పెరికసింగారం తదితర గ్రామాల్లోని ఉత్సవ కమిటీలు ఉదయం ప్రత్యేక పూజల అనంతరం ట్రాక్టర్లపై విగ్రహాలను ఉంచి, మేళతాళాలతో ఊరేగించారు. ఆయా గ్రామాల్లో జరిగిన నిమజ్జన కార్యక్రమాల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఉత్సవ కమిటీల బాధ్యులు పాల్గొన్నారు.
తిరుమలాయపాలెం, అక్టోబర్ 6: మండలంలోని పలు గ్రామాల్లో గురువారం అమ్మవారి విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని ప్రజలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని తిరుమలాయపాలెం, పిండిప్రోలు, బీరోలు, బచ్చోడు, కాకరవాయి, పాతర్లపాడు, తిప్పారెడ్డిగూడెం హస్నాబాద్, సుబ్లేడు, మహ్మదాపురం గ్రామాల్లో అమ్మవారి విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు.
కూసుమంచి, అక్టోంబర్ 6: మండలంలోని పలు గ్రామాల్లో దుర్గాదేవి అమ్మవారి ఊరేగింపు, నిమజ్జనోత్సవం ఆనందోత్సాహాల మధ్య జరిగింది. భక్తులు ఊరేగింపులో పాల్గొని డ్యాన్స్‌లు వేశారు. నవరాత్రులు పూజలు అందుకున్న అమ్మవారు వివిధ అలంకారాల చీరెలను వేలంలో భక్తులు దక్కించుకున్నారు. రామాలయంలోని విగ్రహం వద్ద ఉన్న 11 కేజీల లడ్డూను లక్కీ డ్రా ద్వారా మొక్కపల్లి రాజ్యలక్ష్మి పొందారు ఆమెకు సర్పంచ్ చెన్నా మోహన్, ఎంపీటీసీ లడ్డూను అందజేశారు. కూసుమంచి శివాలయం వీధిలోని అమ్మవారి వద్ద భక్తులు అమ్మవారిని అలంకారం చేసి ట్రాక్టర్‌పై ఊరేగించారు. గౌడ వీధిలోని అమ్మవారి వద్ద చీరెలను సుమారు రూ.50 వేల వరకు భక్తులు కైవసం చేసున్నారు. అమ్మవారి విగ్రహాలను కూసుమంచిలోని గంగదేవి చెరువులో నిమజ్జనం చేశారు.
చింతకాని, అక్టోబర్ 6: మండల పరిధిలో 26 గ్రామాల్లోని కూడళ్ళలో దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాలను గురువారం గ్రామాల్లో ఊరేగింపు అట్టహాసంగా నిర్వహించి నిమజ్జనం నిర్వహించారు. నిమజ్జనం కార్యక్రమం ప్రశాంతంగా జరగడానికి వైరా సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేశ్ ఆధ్వర్యంలో గ్రామాల్లో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. నిమజ్జనం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశారు. ఆయా గ్రామాల్లో కొనసాగిన శోభాయాత్ర కార్యక్రమాల్లో ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామపెద్దలు, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.
బోనకల్లు, అక్టోబర్ 6: దసరా పండుగ పురస్కరించుకొని మండలంలోని బోనకల్లు, రావినూతల, గోవిందాపురం గ్రామాల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహాల వద్ద పూజలు నిర్వహించారు. నవరాత్రులు పూజలు అందుకున్న అమ్మవారిని గురువారం ప్రత్యేక వాహనాల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం విగ్రహాలను నిమజ్జనానికి తరలించారు.
కూసుమంచి రూరల్, అక్టోబర్ 5: దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండల పరిధిలోని కనకదుర్గ మండపాల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. .