ఖమ్మం, సెప్టెంబర్ 13 : ఆంధ్రప్రదేశ్‌లో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలానికి ప్రమాదం పొంచి ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మంగళవారం అసెంబ్లీలో గళమెత్తారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర జలసంఘం, గోదావరి నది యజమాన్య బోర్డు సరైన అధ్యయనం చేసి పోలవరం బ్యాక్‌వాటర్ నష్టాలపై అంచనా వేయాలని కోరారు. భద్రాచలం చుట్టూ ఉన్న ఐదు గ్రామాలను తెలంగాణకు తిరిగి ఇవ్వాలని మరోసారి డిమాండ్ చేశారు. నిత్యం శ్రీరాముడి జపం చేసే బీజేపీ నాయకులు భద్రాద్రి రామయ్యకు ముంపు వాటిల్లే ప్రమాదం ఉన్నా ఎందుకు పట్టించుకోవడం లేదని మంత్రి పువ్వాడ ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్ దేవుడు..
ఇటీవల వరదలకు భద్రాచలం ప్రజలు నిరాశ్రయులైతే సీఎం కేసీఆర్ శ్రీరాముడిలా వచ్చి రక్షించారని గుర్తుచేశారు. తక్షణం సాయం కింద కుటుంబానికి రూ.10 వేలు అందించిన గొప్ప మనస్సున్న నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు.