అశ్వారావుపేట, సెప్టెంబర్ 12: ఇప్పటి వరకు ఇతర రాష్ర్టాలను వణికిస్తున్న లంపి స్కిన్ డిసీజ్ (ముద్ద చర్మ వ్యాధి) ఇప్పుడు తెలుగు రాష్ర్టాలనూ భయపెడుతోంది. దీంతో అప్రమత్తమైన పశు వైద్య శాఖ అధికారులు ఇతర రాష్ర్టాల నుంచి పశువుల రవాణాను నిలిపివేశారు. ఇందుకోసం భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా నాలుగు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. వైరస్ పట్ల పశువుల యజమానులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. సకాలంలో చికిత్స అందించకుంటే పశువులకు ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.
ఇలా గుర్తించారు..
పశువులకు ప్రాణాంతకమైన లంపి స్కిన్ డిసీజ్ వైరస్‌ను మొదటిసారిగా 1929లో ఆఫ్రికా దేశంలోని జాంబియాలో గుర్తించారు. ఇది క్రమేపీ ఆఫ్రికా, ఆసియా, యూరప్ దేశాలతోపాటు భారతదేశంలోని రాజస్తాన్, గుజరాత్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ర్టాలకూ వ్యాపించింది. తాజా లెక్కల ప్రకారం రాజస్తాన్‌లోనే 4.2 లక్షల పశువులు ఈ వైరస్ బారిన పడ్డాయి. సుమారు 18 వేలకు పైగా పశువులు మృతి చెందాయి. అందుకే వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ ఈ వైరస్‌ను ట్రాన్స్‌బౌండరీ (ఒక దేశం నుంచి మరో దేశం ప్రబలడం), నోటిఫయబుల్ డిసీజ్ (వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే ప్రభుత్వానికి లేదా అధికారులకు తెలియజేయడం)గా గుర్తించింది. ఈ వ్యాధి ప్రధానంగా దూడలు, పాలు ఇచ్చే ఆవులు, గేదెలకు సోకుతుంది. ఈ వైరస్ పశువుల నుంచి మనుషులకు సోకదు.
తెలుగు రాష్ర్టాలకు వ్యాప్తి..
లంపి స్కిన్ డిసీజ్ వైరస్ తాజాగా తెలుగు రాష్ర్టాలకు వ్యాప్తి చెందుతోంది. అప్రమత్తమైన తెలంగాణ రాష్ట్ర పశు వైద్యాధికారులు ఇతర రాష్ర్టాల నుంచి తెలంగాణలోకి పశువులు రాకుండా నిలువరించేందుకు చర్యలు చేపట్టారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పశువుల రవాణాకు చెక్ పెడుతూ ప్రత్యేకంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. భద్రాద్రి జిల్లాలో నాలుగు చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
వ్యాధి వ్యాప్తి ఇలా..
ఈ వైరస్ దోమలు, ఈగలుల ద్వారా పశువులకు సంక్రమించే అంటువ్యాధి. ఇది క్యాప్రిపాక్స్ జాతికి చెందిన లంపి స్కిన్ డిసీజ్ వల్ల కలుగుతుంది. ఈ వ్యాధి ఇప్పటికే ఆ వ్యాధి బారిన పడిన పశువుల లాలాజలం, ముక్కు, కంటి నుంచి కారే ద్రవాలు, కలుషితమైన నీరు, ఆహారం, వ్యాక్సినేషన్‌కు ఉపయోగించే సిరంజ్‌లు, వీర్యం వల్ల ఇతర పశువులకు సంక్రమిస్తుంది.
వ్యాధి లక్షణాలు..
ఈ వైరస్ సోకిన పశువుల్లో జ్వరం (41 డిగ్రీల సెంటీ గ్రేడ్ లేదా 105 డిగ్రీల ఫారిన్ హీట్) రావడం, పాల దిగుబడి తగ్గడం, పశువుకు ఆకలి లేకపోవడం, నిస్తేజంగా కూర్చుండిపోవడం, ముక్కు లేదా కళ్లల్లో ఓగిదం, నోట్లో నుంచి సొల్లు కారడం, ఉపరితల శోషరన గ్రంథులు వాయడం, వ్యాధి సోకిన 48 గంటల్లోగా శరీరంపై బొబ్బలు లేదా దద్దుర్లు మొదలు కావడం. అవి బొడిపెలు లేదా గడ్డలు (2-5 సెం.మీ)లగా పెరిగి తల, మెడ, పొదుగు, జననేంద్రియాలపై కన్పించడం. ఈ గడ్డలను తాకినప్పుడు పశువులకు నొప్పి కలుగుతుంది. పెద్ద గడ్డలు గుండ్రంగా, గట్టిగా చర్మం కింద ఉబ్బి ఉంటాయి. ఈ గడ్డలు పగిలి అల్సర్లుగా మారి ఆ ప్రదేశంలోని చర్మం చనిపోయి ఊడిపోతుంది. గడ్డలు పగిలినప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోనట్లయితే ఈ పుండ్లలో మాగట్స్ వచ్చే ప్రమాదం ఉంది. ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే దగ్గర్లోని పశు వైద్యాధికారికి సమాచారం అందించాలి.
జిల్లాలో చెక్‌పోస్టులు ఇవే…
భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట బోర్డర్ చెక్‌పోస్టుతోపాటు దమ్మపేట మండలం మందలపల్లి క్రాస్ రోడ్డు, చర్ల మండలం ఉంజుపల్లి, దుమ్ముగూడెం మండలం మారాయిగూడెం గ్రామాల్లో ప్రత్యేకంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిఘా ఉంచారు.
అప్రమత్తంగా ఉన్నాం..
లంపి స్కిన్ డిసీజ్ జిల్లాలోకి ప్రవేశించకుండా ముందస్తు చర్యలు తీసుకున్నాం. పశు యజమానులు లంపి స్కిన్ వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. పశువుల్లో ఏమైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గర్లోని పశు వైద్యుల దృష్టికి తీసుకురావాలి. సకాలంలో చికిత్స అందిస్తే వైరస్‌ను నియంత్రించొచ్చు. నిర్లక్ష్యం చేస్తే పశువుల చనిపోయే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి.
– డాక్టర్ ఎం.స్వప్న, పశు వైద్యాధికారి, అశ్వారావుపేట