రామవరం, సెప్టెంబర్ 10 : వెంకటేశ్‌ఖని ఓపెన్‌కాస్ట్‌కు స్టేజి-1 క్లియరెన్స్ వచ్చిందని, జనవరిలో ఓబీ పనులు, ఫిబ్రవరి నుంచి ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశం ఉందని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ జక్కం రమేశ్ అన్నారు. శనివారం ఏరియా జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీకే వోసీకి ఇచ్చిన 10లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంలో సుమారు 5లక్షల టన్నుల ఉత్పత్తి చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఓసీ విస్తరణలో భాగంగా ఎస్ఆర్టీ, మాయబజార్, వనమానగర్ ప్రాంతాలను తరలించాల్సి ఉందని ఈ విషయం కలెక్టర్, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లామన్నారు. సత్తుపల్లిలో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం 352 క్వార్టర్లను నిర్మించి కార్మికులకు అలాట్ చేశామన్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి రక్షణ వారోత్సవాలను చేపడుతున్నామని తెలిపారు. కోయగూడెం ఓసీ నుంచి ఆర్‌సీహెచ్‌పీకి రోజుకు 40 లారీల ద్వారా 4వేల టన్నుల బొగ్గు రవాణా జరుగుతున్నదని, సత్తుపల్లి నుంచి 6రేకుల ద్వారా బొగ్గు రవాణ జరుగుతున్నదని చెప్పారు. అదేవిధంగా సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని పద్మావతి గని, ఇతర డిపార్ట్మెంట్లో కారుణ్యం ద్వారా ఉద్యోగాలు పొందిన యువకులు కనీసం 100 మస్టర్లు కూడా చేయడం లేదని, ఉద్యోగాన్ని నిలుపుకోవాలని సూచించారు. సమావేశంలో ఎస్వోటూ జీఎం రమేశ్, ఏరియా ఇంజినీర్ రఘురామరెడ్డి, ఏజీఎం సివిల్ సూర్యనారాయణ, డీజీఎం పర్సనల్ శామ్యూల్ సుధాకర్, డీజీఎం ఐఈ యోహాన్, ఆర్సీహెచ్ డీజీఎం వెంకటేశ్వర్లు, మేనేజర్ పాలడుగు శ్రీనివాస్, వర్క్‌షాపు శ్రీకాంత్, పర్సనల్ మేనేజర్ జి.బుచ్చయ్య, జీకేవోసీ సీనియర్పీవో శ్రావణ్‌కుమార్, సింగరేణి సేవా సమితి కో-ఆర్డినేటర్ సాగర్ పాల్గొన్నారు.