వైరా/ వైరాటౌన్, సెప్టెంబర్ 10: సీతారామ సాగర్ ఆయకట్టు కాల్వల నిర్మాణానికి రూ.620.88 కోట్లు మంజూరయ్యాయని, దీంతో 52,914 ఎకరాలకు సాగునీటి సరఫరా జరుగుతుందని ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ తెలిపారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ దృష్టి పెట్టి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సాగు, తాగునీరు అందించేందుకు సీతారామ ప్రాజెక్ట్‌ను చేపట్టారన్నారు. ఈ పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు జీవో నెంబర్.281 ప్రకారం ప్యాకేజీ 8, 13, 14 ప్రకారం నిధులు కేటాయించారని పేర్కొన్నారు. టెండర్ ప్రక్రియ ద్వారా ఆయా పనులను జూన్ మాసం నాటికి పూర్తయ్యే విధంగా పర్యవేక్షిస్తామని తెలిపారు.
ఈ ప్రాజెక్ట్ ద్వారా వైరా నియోజకవర్గ పరిధిలో సుమారు 52వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని, నియోజకవర్గ పరిధిలో 28.82 కిలోమీటర్ల మేర సీతారామ ప్రాజెక్టును ప్రజలకు అంకితం చేస్తామని తెలిపారు. సమావేశంలో వైరా ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈఈ శ్రీనివాసాచార్యులు, కొత్తగూడెం ఈఈ అర్జున్, కొత్తగూడెం డీఈ చంద్రశేఖర్‌రావు, సింగరేణి డీఈ వెంకన్న, మార్క్‌ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ బీడీకే రత్నం, రైతు బంధు సమితి కన్వీనర్ మిట్టపల్లి నాగి, ఏన్కూరు రైతు బంధు సమితి కన్వీనర్ ధర్మా, మత్స్యశాఖ చైర్మన్ షేక్ రహీం, నాయకులు దారా రాజశేఖర్, మోటపోతుల సురేశ్, శివాజీ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.