అశ్వారావుపేట, సెప్టెంబర్ 8: ఆయిల్‌పాం గెలల ధరల విషయంలో రైతులు ఎలాంటి అపోహలకు గురికావొద్దని, అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్‌కు అనుగుణంగా ధరలు నిర్ణయిస్తారని ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. మండలంలోని నారంవారిగూడెం ఆయిల్‌ఫెడ్ డివిజనల్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా గెలలు టన్ను ధర రూ.23 వేలకు పైగా పెరిగిందని, ఇప్పుడు నూనె దిగుమతులు ప్రారంభం కావడంతో గెలల ధర కాస్త తగ్గిందన్నారు. ధర స్థిరీకరణ కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 22 నర్సరీల నుంచి 55 లక్షల మొక్కలను రైతులకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేశామన్నారు. 75 వేల ఎకరాలకు ఇప్పటికే 18 వేల ఎకరాల్లో సాగు విస్తరణ పూర్తయిందన్నారు. నిర్ణీత లక్ష్యాన్ని సాధిస్తామన్నారు. 2024 నుంచి కొత్త ఫ్యాక్టరీల నిర్మాణం ప్రారంభిస్తామన్నారు
. ఆంధ్రా ప్రాంతం నుంచి గెలల రవాణాను అనుమతించడం లేదన్నారు. కొందరు ఆంధ్రాకు చెందిన రైతులు రాష్ట్రంలో కౌలు ఒప్పందం పేరుతో తీసుకున్న సుమారు 480 ఎఫ్-కోడ్ కార్డులను తొలిగించామని స్పష్టం చేశారు. ఆయిల్‌ఫెడ్ నర్సరీల ద్వారా రైతులకు ఒక్కో మొక్కను రూ.250కు విక్రయిస్తామన్నారు. నకిలీ మొక్కలు కొని నష్టపోవద్దని హెచ్చరించారు. నకిలీ ఆయిల్‌పాం మొక్కల విక్రయంపై ఇప్పటికే కలెక్టర్ అనుదీప్ ఏడుగురు సభ్యులతో కమిటీని నియమించారన్నారు. విచారణలో వివరాలు బయటకు వస్తాయన్నారు. సమావేశంలో ఆయిల్‌ఫెడ్ డివిజనల్ ఆఫీసర్ వలపర్ల ఉదయ్‌కుమార్, ఫ్యాక్టరీ మేనేజర్ బాలకృష్ణ పాల్గొన్నారు.