మంత్రిగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేక ఇంటర్వ్యూ
ఖమ్మం, సెప్టెంబరు 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘టీఆర్ఎస్ జెండా మోస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలను అమలు చేస్తున్న ప్రతి కార్యకర్త నాకు ఆత్మీయుడే. అందరితో కలిసి పనిచేస్తా. అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేసి ఉమ్మడి జిల్లాను అగ్రస్థానంలో నిలుపుతా. వచ్చే ఎన్నికల్లో వారితో కలిసి ఉమ్మడి జిల్లాలో పదికి పది నియోజకవర్గాలను కైవసం చేసుకుని కేసీఆర్‌కు కానుకగా ఇస్తా. సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయించి ఉభయ జిల్లాలను సస్యశ్యామలం చేస్తా. మూడేళ్లలో ఖమ్మం నగరాన్ని కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేశా. మున్ముందు మరిన్ని అభివృద్ధి పనులు చేపడతా’నని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. 2019 సెప్టెంబర్ 8న తాను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన ప్రగతి గురించి ‘నమస్తే’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు.
‘టీఆర్ఎస్ జెండా మోస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలను అమలు చేస్తున్న ప్రతి కార్యకర్త నాకు ఆత్మీయుడే. వచ్చే ఎన్నికల్లో వారితో కలిసి ఉమ్మడి జిల్లాలో పదికి పది నియోజకవర్గాలను కైవసం చేసుకుంటాం..’ అని రాష్ట్ర రవాణాశాఖామంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ధీమా వ్యక్తం చేశారు. 2019 సెప్టెంబరు 8న నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి తాను ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన ప్రగతిని‘నమస్తే’ ఇంటర్వ్యూలో వివరించారు. మంత్రిగా తాను పదవీ బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆయనతో ప్రత్యేక ఇంటర్వ్యూ.
నమస్తే: మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటి?
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో ప్రజాసంక్షేమం, అభివృద్ధిపై దృష్టి సారించా. నేను రవాణాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆర్టీసీ కార్మికుల సమ్మె జరిగింది. ఆంధ్రా ప్రాంతం కచ్చలూరు సమీపంలోని గోదావరిలో పడవ ప్రమాదం జరిగింది. రెండు సవాళ్లను ఏకకాలంలో ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆర్టీసీ కార్మికులకు నచ్చచెప్పి వారిని సమ్మెను విరమింపచేయడంలో కీలకపాత్ర పోషించా. పడవ ప్రమాదం జరిగిన స్థలాకి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాం. బాధితులకు అండగా నిలిచాం.
నమస్తే: ఉమ్మడి జిల్లాలో మూడేళ్లలో జరిగిన అభివృద్ధి ఏమిటి?
మంత్రి: ఉమ్మడి పాలనలో ప్రజలకు అన్యాయానికి గురయ్యారు. స్వరాష్ట్రం వచ్చిన తర్వాతే రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. ఖమ్మం నగరం రూపురేఖలు మారిపోయాయి. వందలాది కోట్లతో నగరాన్ని అభివృద్ధి చేశాం. ముఖ్యమంత్ర కేసీఆర్ సహకారంతో సీతారామ ప్రాజెక్ట్ పనులను చకాచకా పూర్తి చేయిస్తున్నాం. ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి జిల్లా సస్యశ్యామలమవుతుంది.
నమస్తే: మంత్రిగా ఏయే రంగాల అభి వృద్ధిపై ప్రధానంగా దృష్టి సారించారు?
మంత్రి: ఉమ్మడి జిల్లాలో గిరిజన ప్రాంతం ఎక్కువ. వారికి సంక్షేమ ఫలాలు అందిస్తూనే మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రణాళికలు రూపొందించాం. ఉమ్మడి జిల్లా ప్రజలకు వ్యవసాయమే ప్రధాన వృత్తి. రైతాంగానికి చేదోడు వాదోడుగా ఉంటూ వ్యవసాయ రంగంపై దృష్టి సారిస్తున్నాం.
నమస్తే: రెండు జిల్లాకేంద్రాల్లో రెండు వైద్య కళాశాలలు మంజూరయ్యాయి కదా.. వాటి ప్రారంభం ఎప్పుడు?
మంత్రి: భద్రాద్రి జిల్లాలో గిరిజనులు, ఆదివాసీల వైద్య అవసరాలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా జిల్లాకు వైద్యకళాశాల మంజూరు చేశారు. యుద్ధప్రాతిపదికన వైద్యకళాశాల నిర్మాణం పూర్తయింది. కళాశాలను త్వరలో సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. ఖమ్మానికీ మెడికల్ కళాశాల మంజూరు చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరడంతో వెంటనే మంజూరు చేయించారు. వచ్చే విద్యాసంవత్సరంలో తరగతులు ప్రారంభమవుతాయి. ప్రస్తుత కలెక్టరేట్‌ను మెడికల్ కళాశాలకు కేటాయించి వసతుల కల్పనను విస్తృతం చేయనున్నాం. ఇప్పటికే పరిపాలన సంబంధిత ఉత్తర్వులు జారీ అయ్యాయి.
నమస్తే: జిల్లాలో జరిగిన అభివృద్ధి మాటేమిటి?
మంత్రి: నేను మంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సొబగులు అద్దాం. మూడేళ్లలో ఉమ్మడి ఖమ్మం జిల్లాను అభివృద్ధిపథం వైపు నడిపించగలిగాం. ఖమ్మం మునిసిపల్ కార్పోరేషన్‌ను రాష్ట్రస్థాయిలో గుర్తింపు తేవడంతో పాటు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో 3వ స్థానంలో నిలిపేలా కృషిచేశాం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మంతో పాటు ఏజెన్సీ ప్రాంతాలైన కొత్తగూడెం, భద్రాచలం పట్టణాలను వివిధ రంగాల్లో అభివృద్ధి చేసేందుకు మంత్రిగా శక్తివంచన లేకుండా కృషి చేశా.
నమస్తే: ఉభయ జిల్లాల్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఏమిటి ?
మంత్రి: ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే టీఆర్ఎస్ తిరుగులేని రాజకీయశక్తిగా ఎదిగింది. స్థానిక సంస్థల ఎన్నికలు, ఖమ్మం నగర కార్పొరేషన్, ఎంపీ, ఎమ్మెల్సీ, సహకార సంఘాల ఎన్నికల్లో టీఆర్ఎస్సే విజయ బావుటా ఎగురవేసింది. ఎన్నిక ఏదైనా గులాబీదే గెలుపు అనేంతగా పార్టీ బలోపేతమైంది. రానున్న సాధారణ ఎన్నికల్లోనూ 10 శాసనసభ స్థానాలకు పదింటినీ సాధిస్తాం. రెండు లోక్స్థాభ స్థానాలనూ కైవసం చేసుకుంటాం. ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటాం. అందరి సహకారంతో ఎన్నికల్లో విజయం సాధిస్తాం. ఖమ్మం ప్రజలు 75 ఏళ్లలో చూడని అభివృద్ధిని గడిచిన మూడేళ్లలోనే చూస్తున్నారు.
నమస్తే: ఉమ్మడి జిల్లా అభివృద్ధికి ప్రణాళికలేమిటి ?
మంత్రి: ఉమ్మడి జిల్లా సర్వతోముఖాభివృద్ధికి పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించాం. రానున్న కాలంలో అన్నిరంగాల అభివృద్ధిపై దృష్టి సారిస్తాం. జిల్లాలో జాతీయ రహదారి పనులు శరవేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. ఖమ్మం- సూర్యాపేట రోడ్డు ఇప్పటికే తుది దశకు చేరుకుంది. ఖమ్మం- కోదాడ రోడ్డు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి సహకారంతో అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేయిస్తాం.
నమస్తే: రానున్న ఎన్నికలను ఏయే అంశాలు ప్రభావితం చేయనున్నాయి?
మంత్రి: ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన చేసిన అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే మాకు శ్రీరామరక్ష. నేను కార్యకర్తలు, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే వ్యక్తిని. జిల్లాలో నెలకొన్న ప్రతి సమస్యపై నాకు అవగాహన ఉంది. అభివృద్ధే మా తారక మంత్రం. అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ప్రజలు మాకు పట్టం కడతారు.