భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ);‘రైతు ఏ కారణంతో మరణించినా అతడి కుటుంబం రోడ్డున పడకూడదు.. ఆర్థిక ఇబ్బందులతో సతమతం కాకూడదు.. పిల్లల చదువులు ఆగిపోకూడదు..’ అనే సంకల్పంతో సీఎం కేసీఆర్ రైతుబీమా పథకాన్ని అమలు చేస్తున్నారు.. రైతు మృతిచెందిన కొద్దిరోజుల్లోనే కుటుంబ సభ్యుల ఖాతాల్లో రూ.5 లక్షల చొప్పున బీమా పరిహారం జమ చేస్తున్నారు.. భద్రాద్రి జిల్లావ్యాప్తంగా 4,35,125 మంది రైతులకు ఏటా ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తున్నది.. ఇప్పటి వరకు 2 వేల మందికి పైగా కుటుంబాలకు పరిహారం అందింది.. సర్కార్ భరోసాకు బాధిత కుటుంబాలు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాయి.. ఈ ఏడాది ప్రభుత్వం కొత్తగా 93,194 మంది రైతులకు ప్రీమియం చెల్లించింది..
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): సాగుక్షేత్రంలో ఎన్నో ఆటుపోట్లతో వ్యవసాయం చేస్తున్నారు అన్నదాతలు. ఈ క్రమంలో ఏదైనా ప్రమాదం జరిగితే రైతు కుటుంబం దిక్కులేనిదవుతోంది. ఈ విషయాన్ని గమనించిన టీఆర్ఎస్ ప్రభుత్వం కర్షకుల కుటుంబాలకు పెద్ద దిక్కుగా నిలుస్తోంది. ఇందుకోసమే సీఎం కేసీఆర్ రైతుబీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. రైతు తరఫున కూడా రాష్ట్ర ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రూ.5 లక్షల బీమాతో భరోసా కల్పిస్తోంది. ఐదేళ్ల క్రితం సీఎం కేసీఆర్ ప్రారంభించిన రైతుబీమా పథకం ప్రమాదవశాత్తూ మరణించిన ఎంతోమంది రైతులకు వర్తించింది. ఈ ఐదేళ్లలో భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 4,35,125 మంది రైతులకు ప్రభుత్వం ప్రీమి యం చెల్లించింది.
ఇందులో ఇప్పటి వరకు 2,384 మంది రైతులు చనిపోగా వారి కుటుంబాలకు రూ.119.20 కోట్ల పరిహారం అందించింది. ఏటా ఆగస్టు నెలలో రైతుల వివరాలను సేకరించి వారి తరఫున జీవిత బ బీమా సంస్థకు ప్రీమియం చెల్లిస్తోంది టీఆర్ఎస్ ప్రభుత్వం. రైతుబీమా పథకం వర్తించాలంటే రైతు తన వాటాధంగా నయా పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ మొత్తాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వమే బీమా సంస్థకు చెల్లిస్తోంది. ఒక్కో రైతుకు రూ.2,250 ప్రీమియం చెల్లించి రైతుబీమా పథకాన్ని వర్తింపజేస్తోంది. దీంతో ప్రమాదాల వల్లగానీ లేదా ఇతర ఏ కారణాల వల్లగానీ రైతులు చనిపోతే ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందుతోంది. ఇలా భద్రాద్రి జిల్లా వ్యా ప్తంగా ఐదేళ్లలో 4,35,125 మంది రైతులకు ప్రభుత్వం ప్రీమియం చెల్లించింది. ఈ ఏడాది 93,194 మంది రైతులకు ఇప్పటికే ప్రీమియం చెల్లించగా అందులో ఇప్పటికే 30 మంది రైతులు చనిపోయారు. వారికి పరిహారం అందిస్తోంది.
సీఎం కేసీఆర్ మా పాలిట దేవుడు..
సీఎం కేసీఆర్ ఉన్నంతకాలం వ్యవసాయానికి గ్యారంటీ ఉన్నట్లే. పంట వేయడానికి రైతుబంధు సాయం అందిస్తున్నారు. భూమాతను నమ్ముకొని సాగు చేస్తున్న వాళ్లు ఎప్పుడూ నష్టపోరు. పొలంలో ఎప్పడూ నష్టం రాలేదు. బాగా వర్షాలు వస్తే తిండి గింజలైనా పండేవి. ఉన్నట్టుండి ఒక రోజు నా భర్త చనిపోయాడు. అప్పటికే రైతుబీమా ఉండడంతో పరిహారం అందింది. ఆయన చనిపోయాడనే బాధ ఉన్నా.. ఆర్థికంగా కొంత భరోసా కలిగింది. పిల్లలను చదివించుకుంటున్నాను.
–ధరావత్ జ్యోతి, తిప్పనపల్లి, చండ్రుగొండ
ఎకరా భూమి ఉన్నా బీమా వర్తించింది..
మాకు ఎకరా భూమి ఉంది. దానిని సాగు చేసుకుంటూ జీవిస్తున్నాం. ఆ మధ్య నా భర్తకు కిడ్నీ జబ్బు వచ్చింది. ఆసుపత్రుల్లో చాలా డబ్బులు ఖర్చు చేశాం. అయినా ఫలితం లేదు. ఒక రోజు చనిపోయాడు. ఇక మా కుటుంబం వీధిన పడుతుందేమో అనుకొని భయపడ్డాం. కానీ రైతుబీమా పథకం కింద అందిన పరిహారం మా కుటుంబాన్ని నిలబెట్టింది. అదే రాకపోతే పొలం అమ్ముకొని కూలీ పనులకు వెళ్లేవాళ్లం.
–ధరావత్ లక్ష్మి, తిప్పనపల్లి, చండ్రుగొండ