భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ) :ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పని చేస్తే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ పేర్కొన్నారు. కొత్తగూడెం కలెక్టరేట్లో బుధవారం జరిగిన విద్య, వైద్యం, శిశు సంక్షేమం, ఎస్టీ, ఎస్సీ, బీసీ, పంచాయతీరాజ్ శాఖల సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని శాఖల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని, ప్రతి నెలా 5లోగా హాజరు వివరాలను తనకు అందజేయాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరంతరం పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టాలని, ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. ప్రసవాలపై ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆడిట్ నిర్వహించాలన్నారు. రోగుల కేస్ షీట్‌ను కూడా పరిశీలించాలన్నారు.
గర్భిణుల ఏఎన్సీ నమోదు ప్రక్రియ గురించి అడిగి తెలుసుకున్నారు. వందశాతం పూర్తి చేసిన వైద్యులను అభినందించారు. మాతాశిశు మరణాలపై సమగ్ర నివేదికలు అందించాలన్నారు. రక్తహీనతతో ఉన్న బాలికలను గుర్తించి వారికి న్యూట్రీ కిట్లు అందించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో న్యూట్రీ గార్డెన్‌ను వందశాతం పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మణరావు, పర్యవేక్షకులు డాక్టర్ కుమారస్వామి, డీఎంహెచ్ఓ డాక్టర్ దయానందస్వామి, డీడబ్ల్యూవో వరలక్ష్మి, డీసీహెచ్ఎస్ డాక్టర్ ముక్కంటేశ్వరరావు, డీపీవో రమాకాంత్, డీఈవో సోమశేఖరశర్మ, డీడీ రమాదేవి, ఎస్సీ అభివృద్ధి అధికారి అనసూర్య, జిల్లా పోషణ్ అభియాన్ ఆఫీసర్బాబు, సీడీపీవోలు లెనీనా, మంగతార, ప్రమీల, నిర్మలాజ్యోతి, లక్ష్మీప్రసన్న, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.