ఖమ్మం, ఫిబ్రవరి 28: ఖమ్మం నగరపాలక సంస్థలో ఇప్పుడు పన్ను వసూలు మేళా జరుగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించిన పన్ను వసూలు లక్ష్యాలను అధిగమించేందుకు నగరపాలక సంస్థ అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి రంగంలోకి దిగారు. ఈ నెల 31 వరకు బిల్ కలెక్టర్లకు ఇప్పటికే సెలవులు రద్దు చేశారు. వసూళ్లలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఉన్నతాధికారులు హెచ్చరించారు. సెలవు దినాల్లోనూ పన్ను వసూలు చేయాలని ఆదేశించారు. నగరంలోని అన్ని డివిజన్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. మైకుల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
ఇంటి, నల్లా పన్ను బకాయిలు రూ.34.80 కోట్లు..
2021-22లో పన్ను వసూళ్లపై నగరపాలకసంస్థ ప్రత్యేక దృష్టి సారించింది. మార్చి 31 లోపు ఆస్తి పన్ను, నల్లా బిల్లులు చెల్లించిన వారికి ఎలాంటి అపరాధ రుసుము ఉండదని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నగరపాలక సంస్థ పరిధిలో ఇల్లు, నల్లా బిల్లులు మొత్తం రూ.34.80 కోట్లు వసూలు కావాల్సి ఉంది. నగర పాలక సంస్థ పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు మొత్తం 75,520 గృహాలు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు రూ. 25.80 కోట్ల ఇంటి పన్ను వసూలు కావాల్సి ఉంది. దీనిలో ఇప్పటివరకు రూ.15.45 కోట్లు వసూలైంది. పన్ను వసూలుశాతం 59.18గా నమోదైంది. మరో రూ.10.66 కోట్లు వసూలు చేయా ల్సి ఉంది. నగరంలో నల్లా కనెక్షన్లు 34 వేలు ఉండగా పన్ను లు రూ.9 కోట్లు వసూలు చేయా ల్సి ఉంది. ఇప్పటివరకు రూ.3 కోట్లు వసూలైంది. మిగిలిన రూ.6 కోట్లు వసూలు చేయాల్సి ఉంది.
ఇంటి వద్ద నుంచే పన్నులు చెల్లించవచ్చు..
గతంలో ఆస్తి పన్నులు, నల్లా బిల్లులు చెల్లించాలంటే మీ సేవా కేంద్రం, నగరపాలక సంస్థ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. లేదా నగరంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాంపుల్లో పన్నులు చెల్లింపులు జరిగేవి. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సాంకేతికతకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇంటి వద్ద నుంచే ఆస్తి పన్నులు, నల్లా బిల్లులు చెల్లించుకునే వెసులుబాటు కల్పించారు. చేతిలో డెబిట్‌కార్డు, స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు. పీడీఎంఏ వెబ్సైట్ ద్వారా ఇంటి వద్ద నుంచే పన్నులు చెల్లించవచ్చు. లేదా బిల్ కలెక్టర్‌కు చెల్లించవచ్చు. ప్రజల సౌకర్యార్థం మున్సిపల్ అధికారులు ఇప్పటికే డివిజన్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు.
ఇప్పటికే రెడ్ నోటీసులు..
సుదీర్ఘకాలం పాటు పన్నులు చెల్లించన వారిలో నగరపాలక సంస్థ అధికారులు ఇప్పటికే 550 మందికి రెడ్ నోటీసులు జారీ చేశారు. 32 మంది ఇంటి నల్లా కనెక్షన్లను తొలగించారు.
మొండి బకాయిదారుల ఆస్తుల జప్తు..
ఆస్తి పన్నులు, నల్లా బిల్లుల వసూళ్లలో అధికారులు ఇప్పటికే రూ.50 శాతం లక్ష్యాన్ని సాధించారు. మిగిలిన లక్ష్యాన్ని అధిగమించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. నగర మేయర్ పునుకొల్లు నీరజ, నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి పర్యవేక్షణలో రెవెన్యూ విభాగ అధికారులు, బిల్ కలెక్టర్లు పక్కా ప్రణాళికను రూపొందించారు. ముగ్గురు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, 14 మంది బిల్‌కలెక్టర్లతో ఏర్పాటైన ఏడు బృందాలు ఉదయం 7 గంటల నుంచే 60 డివిజన్లలో ఇంటింటికీ వెళ్తున్నారు. అవసరమైన చోట నీటి సరఫరా విభాగానికి చెందిన లైన్మెన్ సహకారం తీసుకుంటున్నారు. నల్లా బిల్లులు చెల్లించని వారి ఇంటికి కనెక్షన్లు తొలగిస్తున్నారు. రెండు సంవత్సరాల నుంచి పన్నులు కట్టని వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. మార్చి 31లోపు అన్ని రకాల పన్నుల లక్ష్యాన్ని అధిగమిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి తెలిపారు.
నగరాభివృద్ధికి సహకరించండి..
రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఖమ్మం ఒకటి. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చొరవతో నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది. నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది. నగర పౌరులు సకాలంలో ఇంటి పన్నులు, నల్లా పన్నులు చెల్లిస్తే నగరాభివృద్ధికి బాటలు వేసిన వారవుతారు. ప్రజలు చెల్లించే ప్రతి రూపాయిని ప్రజల కోసమే ఖర్చు చేస్తాం.
– పునుకొల్లు నీరజ, ఖమ్మం నగర మేయర్
పన్నులు చెల్లించడం ప్రజల బాధ్యత..
నగర అభివృద్ధికి నిధులు సమకూరాలంటే నగరపౌరులు సకాలంలో ఆస్తి పన్నులు చెల్లించాలి. ప్రతిఒక్కరూ బాధ్యతగా భావించాలి. ప్రజలు చెల్లిస్తున్న ప్రతి రూపాయిని అభివృద్ధి కోసమే ఖర్చు చేస్తాం. నగరంలోని మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తాం. ఇప్పటికే 50శాతం పన్నులు వసూలు చేశాం. మిగిలిన లక్ష్యాన్ని అధిగమిస్తాం. మొండి బకాయిదారులపై కఠిన వైఖరి ప్రదర్శిస్తాం. మార్చి తర్వాత ఆస్తులను జప్తు చేస్తాం. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది. స్మార్ట్‌ఫోన్ ద్వారా ప్రభుత్వం రూపొందించిన వెబ్సైట్ నుంచి పన్నులు చెల్లించవచ్చు.
– ఆదర్శ్ సురభి, ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్