వైరా/ వైరా టౌన్, సెప్టెంబర్ 5: ఎస్సీల ఆర్థిక పరిపుష్టి కోసమే సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నట్లు వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం.. యావత్ దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచిందని స్పష్టం చేశారు. స్థానిక పాత లంబాడీ తండా వద్ద ఉన్న రైతువేదికలో సోమవారం జరిగిన దళితబంధు యూనిట్ల పంపిణీలో ఆయన మాట్లాడారు. వైరా నియోజకవర్గానికి తొలి విడతగా 100 యూనిట్లు మంజూరు కాగా, 83 యూనిట్లు పంపిణీ చేశారు. దళితుల ఉన్నతి కోసం పాటుపడుతున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని మూడోసారీ గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉందన్నారు. లబ్ధిదారులు కూడా దళితబంధు పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
అనంతరం ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ.. ఎంతోమంది సంఘ సంస్కర్తలు సంఘం కోసం పాటుపడ్డారని, కానీ దళితుల ఆర్థిక ఉన్నతి కోసం పాటుపడింది కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. అందుకే సీఎం కేసీఆర్ ఎస్సీల ఆరాధ్యుడయ్యారని అన్నారు. 65 ఏళ్లు దేశాన్ని పాలించిన వారు.. ఎస్సీల అభ్యున్నతి కోసం ఎలాంటి చర్యలూ తీసుకోలేదని విమర్శించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు బొర్రా రాజశేఖర్, ఏలూరి శ్రీనివాసరావు, సూతకాని జైపాల్, నంబూరి కనకదుర్గ, పోట్ల కవిత, పావని, ప్రమీల, బీడీకే రత్నం, కట్టా కృష్ణార్జున్‌రావు, రవి తదితరులు పాల్గొన్నారు.