ఉపాధ్యాయుడే విద్యార్థులకు మార్గదర్శకుడు.. భవిష్యత్తు నిర్మాత.. సమాజ నిర్మాణంలో వీరిదే కీలకపాత్ర. అందుకే పెద్దలు ‘మాతృదేవోభవ.. పితృదేవోభవ.. ఆచార్య దేవోభవ..’ అంటారు. బ్రహ్మ, విష్ణువు, గురువు ప్రత్యక్షమైతే గురువుకే నమస్కరించాలంటారు.. తల్లిదండ్రుల తర్వాత మనలను విద్యావంతులుగా, గుణవంతులుగా తీర్చిదిద్దేది వారే.. వారికి సమాజంలో అంతటి విలువ ఉంది. నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వారిపై ప్రత్యేక కథనం.
ఖమ్మం ఎడ్యుకేషన్, సెప్టెంబర్ 4: తల్లిదండ్రులు జన్మనిస్తే.. గురువులు విద్యాబుద్ధులు నేర్పి జీవన గమనాన్ని చూపిస్తారు. అమ్మానాన్నలు బుడి బుడి అడుగులు నేర్పితే.. తప్పడగులు పడకుండా ఉపాధ్యాయు లు మంచి మార్గం పట్టిస్తారు. దేశ భవిష్యత్తును తరగతి గదుల్లో తీర్చిదిద్దుతున్న నిర్మాతలు వారు. అందుకే సమాజ నిర్మాణంలో వీరిదే కీలకపాత్ర. వారి దిశానిర్దేశంలో ఎందరో ఉన్నతస్థాయికి ఎదిగారు. సమాజంలో ‘గురువు’ పాత్రను ఎంత చెప్పుకున్నా తక్కువే. గురు, శిష్యుల మధ్య బంధం కొన్ని సంవత్సరాలే అయినా కొందరు శిష్యులు మాత్రం గురువులను మించిన శిష్యులవుతారు. కానీ విద్య నేర్పిన గురువులు మాత్రం అక్కడే ఆగిపోతారు. ‘మాతృదేవోభవ.. పితృదేవోభవ..ఆచార్య దేవోభవ’ అన్నారు పెద్దలు. తల్లిదండ్రులు పిల్లలను కనడం..పెంచడం వరకే బాధ్యత తీసుకుంటారు. కానీ గురువే విద్యాదాత. నేడు టీచర్స్ డే సందర్భంగా ‘నమస్తే’ ప్రత్యేక కథనం.
పుస్తకంలోని పాఠాలే కాదు జీవితంలో నేర్వాల్సిన పాఠాలు, గుణపాఠాలు తెలుసుకోవడం గురువుతోనే సాధ్యమవుతుంది. గురువు, దేవుడు ఎదురైతే నేను ముందుగా గురువుకే వందనం చేస్తానంటాడు ప్రఖ్యాత కవి కబీర్. గురువు గొప్పతనం అలాంటిది. గురువు లేని విద్య గుడ్డి విద్య.. అని భావించి ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి ప్రతిమను ఎదురుగా ఉంచి విలు విద్య సాధన చేశాడు. ఒక వైద్యుడు.. ఒక ఇంజినీర్.. ఒక న్యాయవాది నిర్లక్ష్యం వహిస్తే కొంత నష్టమే వాటిల్లుతుంది. కానీ ఓ ఉపాధ్యాయుడు అలా చేస్తే ఒక తరం నష్టపోతుంది. కాబట్టి గురువులెప్పుడూ పిల్లలకు ఆదర్శంగా నిలవాలి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్లా. మేధోపరమైన, జాతి పరమైన, సంస్కృతి పరమైన, శాస్త్ర సంబంధమైన వారసత్వాన్ని ఒక తరం నుంచి మరో తరానికి అందించే వాటిని విద్యాలయాలుగా భావించాలనేది ఆయన భావన. విద్యాలయాలు బండి అయితే వాటిని నడిపించే ఇరుసులు గురువులు. ఒక తరాన్ని ముందుకు నడిపించాలన్నా, ఉన్నత శిఖరాలు అధిరోహింపజేయాలన్నా కేవలం అది గురువులకే సాధ్యమవుతుంది. కంప్యూటర్లు, గ్యాడ్జెట్లు, మొబైల్స్, ఎల్సీడీలు, ప్రొజెక్టర్లు.. ఇలా ఎన్ని సాంకేతిక పరికరాలు ఉన్నా గురువుల ప్రాభవం తగ్గలేదంటే.. అదే గురువుల గొప్పదనం. గురువుల
దిశానిర్దేశం తప్పకుండా అవసరమే.
సర్వేపల్లి రాధాకృష్ణ 1888 సెప్టెంబర్ 5వ తేదీన తమిళనాడులో జన్మించాడు. సాధారణ కుటుంబం నుంచి ఆయన దేశ మొట్టమొదటి ఉప రాష్ట్రపతిగా ఎదిగారు. తర్వాత భారత రెండో రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. దేశ ప్రధానులకు మార్గనిర్దేశం చేశారు. దేశప్రజలకు ఎంతో సేవ చేశారు. 1962లో ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కొందరు శిష్యులు, మిత్రులు సెప్టెంబర్ 5న ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయన దగ్గరకు వెళ్లినప్పుడు ‘నా పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తే గర్విస్తాను..’అని తన మనసులో మాట బయటపెట్టారు. నాటి నుంచి ప్రభుత్వం అధికారికంగా ఏటా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహిస్తున్నది. విద్యార్థుల్లో దాగి ఉన్న అంతర్గతశక్తిని గురువులు మేల్కొల్పాలన్నారు సర్వేపల్లి రాధాకృష్ణన్. ఇదే స్ఫూర్తితో అందరు ఉపాధ్యాయులూ పనిచేస్తే ఇక లేనిదేముంది. ఆయన పుట్టినరోజు సందర్భంగా మనం ఉపాధ్యాయులను సత్కరించుకుం టాం. పురస్కారాలు అందిస్తాం.
జీవితంలో విజయం సాధించాలని కోరుకునే వారు ఉండరు. కానీ కొందరే విజయ తీరాన్ని చేరగలరు. అనుకున్న లక్ష్యం చేరడం సులవు కాదు. అలాగని అసాధ్యమూ కాదు. ఓ సామాన్యుడు విజేతగా మారిన ప్రతిఒక్కరి వెనుక ఓ గురువు ఉంటాడు. గురువు అంటే నడిపించే నాయకుడు. ప్రేరణగా నిలిచే మార్గదర్శకుడు. నరేంద్రుడు అనే సామాన్యుడు అనే యువకుడిని భారత జాతికే స్పూర్తిగా నిలిపిన వివేకనందుడిగా మలిచింది గురువు రామకృష్ణ పరహంసే. గురువు గొప్పతనం అలాంటింది.