ఎన్నికల సమయంలో ‘నా ఓటు ఓటరు లిస్ట్‌లో కనిపించడం లేదు.. నా ఓటును వేరొకరు వేశారు.. ఓటర్ కార్డులో తప్పులు వచ్చాయి.. ఎవరో కావాలనే నా ఓటును జాబితా నుంచి తీసేశారు..’ అనే ఆరోపణలు వినిపిస్తూ ఉంటాయి.. వీటి కారణంగా ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటారు.. రాజకీయ పార్టీల మధ్య వివాదాలు చోటుచేసుకుంటాయి.. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటుకు ఆధార్ కార్డు లింక్ చేయాలని నిర్ణయించింది.. తద్వారా బోగస్ ఓట్లను తీసేయాలని సంకల్పించింది.. ఈ మేరకు అన్ని జిల్లాల్లో సర్వే చేపట్టి వలస వెళ్లిన వారు, మృతిచెందిన వారి ఓట్లను తీసేయాలని, కొత్త ఓటర్లు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.. దీనిపై ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. దీనిలో భాగంగా భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ బోగస్ ఓటర్లకు చెక్ పెట్టేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా పరిధిలోని 8,96,676 మంది ఓట్లను ఆధార్‌కు అనుసంధానం చేస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): వచ్చే ఎన్నికల నాటికి పక్కాగా ఓటర్ జాబితాను సిద్ధం చేసేందుకు ఎన్నికల కమిషన్ కార్యాచరణ అమలు చేస్తున్నది. ప్రతిసారి ఎన్నికల సమయంలో ‘నాకు ఓటు లేదు.. నాపేరులో తప్పులు వచ్చాయి..’ అనే ఆరోపణలు వస్తున్నాయి. వాటిన్నింటినీ నివారించేందుకు ఈసీ ఓటర్ కార్డుకు అధార్ అనుసంధానం చేస్తున్నది. దీనిపై ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. దీనిలో భాగంగా భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ బోగస్ ఓటర్లకు చెక్ పెట్టేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా పరిధిలోని 8,96,676 మంది ఓట్లను ఆధార్‌కు అనుసంధానం చేస్తున్నారు.
ప్రజాస్వామ్యంలో ఓటు పాత్ర చాలా కీలకం. ఈ నేపథ్యంలో బోగస్ ఓట్లు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపకుండా ఉండేందుకు వాటిని తొలగించాలని ఈసీ నిర్ణయించింది. జిల్లాలోని 1,092 పోలింగ్ కేంద్రాల పరిధిలోని ఓటర్ల జాబితాలో సిమిలర్ ఓట్లను బూత్ లెవల్ అధికారులు గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. రెండు, అంతకన్నా ఎక్కువ ఓటరు కార్డులపై ఒకే వ్యక్తి ఫొటోలు ఉన్నవాటిని కొత్త సాంకేతిక విధానంలో తొలగించనున్నారు. అంతేగాక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు, మరణించిన వారిని గుర్తించి తొలగిస్తున్నారు. 27 మండలాల్లో ఇప్పటివరకు 19.27శాతం సర్వే పూర్తయింది. పినపాక నియోజకవర్గంలో 15.06 శాతం, ఇల్లెందులో 17.47 శాతం, కొత్తగూడెంలో 22.15 శాతం, అశ్వారావుపేటలో 24.89 శాతం, భద్రాచలంలో 16.93 శాతం సర్వే పూర్తయింది. సర్వేకు అన్ని పార్టీల నాయకులు సహకరించాలని అధికారులు ఇప్పటికే సమావేశాల్లో కోరారు. అందరి సహకారంతో సర్వే పూర్తవుతున్నది.
ఓటర్ కార్డుతో ఆధార్ అనుసంధానించడంతో బోగస్ ఓట్లకు కళ్లెం పడనున్నది. 2019లోనే ఎన్నికల సంఘం ఆధార్ అనుసంధాన ప్రక్రియ ప్రారంభించినా సజావుగా లేదు. ప్రతి ఎన్నికలో బోగస్ ఓట్లపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆధార్ కార్డ్ అనుసంధానం ద్వారా చాలా వరకు నకిలీ ఓట్లకు అడ్డుకట్ట వేయవచ్చని ఈసీ ఈసారి భావిస్తున్నది. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ తిరుగుతూ సర్వే చేపడుతున్నారు. ఆధార్ వివరాలను ఎప్పటికప్పుడు వెబ్సైట్లో నమోదు చేస్తున్నారు. ఈ ప్రక్రియతో ఒక్కరికి ఒకచోట మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ కూడా సమాంతరంగా జరుగుతున్నది. 18 ఏళ్లు నిండిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియ జరుగుతున్నది.
జిల్లావ్యాప్తంగా 1,092 బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) పనిచేస్తున్నారు. పినపాక నియోజకవర్గంలోని 1,82,853 మంది ఓట్లు సర్వే చేసేందుకు 241 మంది బీఎల్వోలు, ఇల్లెందులో 2,04,324 మందికి 241 మంది, కొత్తగూడెంలో 2,23,804 మందికి 252 మంది, అశ్వారావుపేటలో 1,45,768 మంది ఓటర్లకు 184 మంది, భద్రాచలంలో 1,39,927 మందికి 174 మంది బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నారు. అంగన్వాడీ టీచర్లతో పాటు రెవెన్యూ సిబ్బంది సర్వేలో పాల్గొంటున్నారు. గత నెల 1న ఇది ప్రారంభమైంది.
2004 జనవరి 1 నుంచి 2004 డిసెంబర్ 31 మధ్య జన్మించిన వారు కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి అర్హులు. వారు ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మరణించిన వారి ఓట్లను సర్వేలో తొలగిస్తున్నాం. ఈనెల 11 నుంచి 16 వరకు గర్భిణులు, బాలింతలను ఓటర్ జాబితాలో చేర్చే ప్రక్రియ చేపడుతున్నాం. ఇప్పటివరకు అన్నపురెడ్డిపల్లి 75 పోలింగ్ స్టేషన్లో వందశాతం ఆధార్ నమోదు పూర్తయింది. సర్వే పక్కాగా చేపడుతున్నాం.
– అనుదీప్, భద్రాద్రి కలెక్టర్