కొత్తగూడెం సింగరేణి, సెప్టెంబర్ 4: సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న 177 జూనియర్ అసిస్టెంట్ (ఎక్స్టర్నల్) పోస్టుల భర్తీకి ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది జిల్లాల్లో నిర్వహించిన రాత పరీక్ష ప్రశాంతంగా జరిగింది. మొత్తం 187 కేంద్రాల్లో మొత్తం 98,882 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 77,907 మంది పరీక్ష రాశారు. 79 శాతం హాజరు శాతం నమోదైంది. అత్యధికంగా మంచిర్యాల జిల్లాలో 89 శాతం హాజరు కాగా, అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో 64 శాతం హాజరయ్యారు. కరీంనగర్ పరీక్ష కేంద్రాలను డైరెక్టర్ (పర్సనల్, ఆపరేషన్స్) చంద్రశేఖర్ పరిశీలించారు. హైదరాబాద్లో జనరల్ మేనేజర్ ( కో-ఆర్డినేషన్) సూర్యనారాయణ పరీక్షా కే్రందాలను పరిశీలించారు. ఏరియా జీఎం కార్పొరేట్ జీఎంలు తమ పరిధిలోని పరీక్ష కేంద్రాలను సందర్శించారు. జీఎం (రిక్రూట్మెంట్) బసవయ్య హైదరాబాద్ కేంద్రంగా కంట్రోల్ రూం ద్వారా పరీక్షలను పర్యవేక్షించారు. ప్రతి సెంటర్కు కో-ఆర్డినేటర్లుగా వ్యవహరించి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించారు.
కరీంనగర్లోని 39 కేంద్రాల్లో 19,839 మందికి 16,286 మంది (88.62 శాతం) పరీక్షకు హాజరయ్యారు. హైదరాబాద్ -1 పరిధిలో 19 కేంద్రాల్లో 17,448 మంది, హైదరాబాద్ -2లో మొత్తం 14 కేంద్రాల్లో 11,569 మంది కలిపి మొత్తం 29,017 మందికి 12,672 మంది, కొత్తగూడెంలో 35 కేంద్రాల్లో 13,834 మందికి 12,079 (87.31 శాతం) మంది, ఖమ్మంలో 23 కేంద్రాల్లో 12,188 మందికి 9,915 (81.35శాతం) మంది, వరంగల్లో 18 కేంద్రాల్లో 10,899 మందికి 9,221 మంది (84.6 శాతం) మంది, మంచిర్యాలలో 28 కేంద్రాల్లో 8,886 మందికి 7875 (88.62శాతం) మంది, ఆదిలాబాద్ 11 కేంద్రాల్లో 4219 మందికి అత్యల్పంగా 2,718 (64.42 శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 187 కేంద్రాల్లో 98,882 మందికి 77,907 మంది (79 శాతం) హాజరయ్యారు. పరీక్షకు సంబంధించిన ఏ, బీ, సీ, డీ ప్రశ్నాపత్రాలకు సంబంధించిన కీ ని సోమవారం ఉదయం 11 గంటలకు సింగరేణి వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు డైరెక్టర్ (పర్సనల్, ఆపరేషన్స్) చంద్రశేఖర్ తెలిపారు. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే బుధవారం ఉదయం 11 గంటల్లోపు సింగరేణి వెబ్సైట్లోనే అభ్యంతరాలు సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు.