ఖమ్మం కల్చరల్, ఫిబ్రవరి 28: ముక్కంటి పరమశివుడు జ్యోతిర్లింగంగా ఆవిర్భవించిన పరమ పవిత్ర పర్వదినమే మహాశివరాత్రి. సృష్టి, స్థితి కారకుల్లో గొప్పవాడెవరో వాదులాడుకునే సమయంలో లయకారుడైన శివుడు ఆద్యంతాలు లేని తేజోలింగ రూపంలో ఉద్భవించి వివాదానికి తెరదించాడు. లింగోద్భవం జరిగిన ఈ పవిత్రమైన రోజే మాఘ బహుళ చతుర్దశి. లింగోద్భవ పుణ్యకాలంలో భక్త కోటి శివరాత్రి పర్వదినం జరుపుకొంటారు. అర్చకులు శివయ్యకు పంచామృతాలతో అభిషేకాలు, పూలు, దళాలతో అర్చన చేస్తారు. సాయంత్రం ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరుల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. మంగళవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా భక్తులు శివరాత్రి పూజలకు సిద్ధమయ్యారు. ఆలయ కమిటీ సభ్యులు ఇప్పటికే ఆలయాలను ముస్తాబు చేశారు. విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పూజలు..
ఖమ్మం రూరల్ మండలంలోని తీర్థాల సంగమేశ్వరాలయం, కూసుమంచి గణపేశ్వరాలయం, మోతెగడ్డ, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి శివాలయాలు, ఖమ్మం గుంటు మల్లేశ్వరస్వామి ఆలయం, కారేపల్లి కోటిలింగేశ్వరుడు, మధిర మృత్యుంజయస్వామి, పెనుబల్లి నీలాదీశ్వరస్వామి, స్నానాల లక్ష్మీపురంలోని శ్రీరామలింగేశ్వరస్వామితో పాటు శైవాలయ్యాలన్నీ శివరాత్రికి ముస్తాబయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే శివరాత్రి ఉత్సవాల్లో భక్తులు ప్రతిరోజు భజనలు, కీర్తనలు ఆలపించనున్నారు.
జాగరణ విశిష్టత ఇదీ..
క్షీరసాగర మథనంలో వెలువడిన విషాన్ని శివుడు తన కంఠంలో దాచుకున్నాడు. అది జీర్ణం కావడానికి 14 జాములు పట్టింది. అంతసేపు శివుడు నిద్రించలేదు. ఆయనతో పాటు ప్రమద గణాలన్నీ నిద్రించకుండా జాగరణ చేశాయి. ఆ విధంగా మహాశివరాత్రి నాడు రాత్రంతా జాగరణ చేసి భక్తులు తమ శివభక్తిని చాటుకుంటారు.
శుభంకరుడు.. మల్లికార్జునుడు
అన్నపురెడ్డిపల్లిలోని భ్రమరాంబ సమేత శ్రీమల్లికార్జునస్వామి ఆలయం మహాశివరాత్రికి ముస్తాబైంది. ఆలయ కమిటీ సభ్యులు ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. మంగళవారం నిర్వహించనున్న శివపార్వతుల కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయ ఈవో వేణుగోపాల్ గుప్తా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ సత్తుపల్లి, తిరువూరు, కొత్తగూడెం, పాల్వంచ నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేసింది.
ఆలయ ప్రత్యేకతలివీ..
108 శివ లింగాలతో పెద్ద శివలింగం ఆకారంలో శివాలయం రూపుదిద్దుకున్నది. ఆలయం ఎదురుగా ఏర్పాటు చేసిన నందీశ్వరుడి విగ్రహం, శ్రీస్వామి కల్యాణ మండపం, పుష్కరణి, శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నవగ్రహాలు, కాల భైరవ స్వామి విగ్రహాలు ఆలయానికి ప్రత్యేకతను తీసుకువచ్చాయి. ఆలయ పునః నిర్మాణం కోసం దేవాదాయ, ధర్మదాయ శాఖ సీజీఎఫ్ నిధుల నుంచి రూ.13 లక్షలు మంజూరు చేసింది. ప్రముఖ విద్యావేత్త మారగాని శ్రీనివాసరావు ఆలయ పునః నిర్మాణానికి భూరీ విరాళం ఇచ్చారు.
నీలాద్రిలో ముస్తాబైన ఆలయం
దట్టమైన అటవీప్రాంతంలో ఉన్న నీలాద్రీశ్వర ఆలయం మహశివరాత్రి వేడుకలకు ముస్తాబైంది. నెలరోజుల నుంచి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో నిర్మించిన ఆలయగోపురాన్ని మంగళవారం ప్రారంభించనున్నారు. ఇక్కడికి లక్షకుపైగా భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో బారికేడ్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్నదానం కోసం ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసినట్లు ఆలయకమిటీ ఛైర్మన్ పసుమర్తి వెంకటేశ్వరరావు అన్నారు. సత్తుపల్లి, కొత్తగూడెం, తిరువూరు డిపోల బస్సులను నడపనున్నారు. ఆలయ ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. జాతరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రూరల్ సీఐ కరుణాకర్ తెలిపారు. సోమవారం ఆయన నీలాద్రిలో ఏర్పాట్లను పరిశీలించారు.
తీర్థాల జాతరకు పకడ్బందీగా ఏర్పాట్లు
తీర్థాలలోని సంగమేశ్వరాలయ సన్నిధిలో మూడు రోజుల పాటు జరిగే జాతరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఎంపీపీ బెల్లం ఉమ, జడ్పీటీసీ వరప్రసపాద్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్‌తో కలిసి జాతర ఏర్పాట్లను పరిశీలించారు. సంగమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. అధికారులు సమన్వయం పాటించి భక్తులకు సేవలు అందిస్తారన్నారు. ఆలయ ప్రాంగణంలో బారికేడ్లు ఏర్పాటు చేశామన్నారు. జాతరకు వచ్చే వచ్చే వాహనాల కోసం పార్కింగ్ వసతి కల్పించామన్నారు. ఖమ్మం నుంచి వచ్చే భక్తులు కామంచికల్ బ్రిడ్డి వైపు నుంచి వచ్చి సులభంగా ఆలయానికి చేరుకోవచ్చన్నారు. ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం కాకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ మినీ సర్వీసులు ఏర్పాటు చేసిందన్నారు. అనంతరం మదర్ థెరిసా హెల్త్‌క్యాంపును ప్రారంభించారు. సమావేశంలో సుడా డైరెక్టర్ గూడా సంజీవరెడ్డి, సర్పంచ్ బాలునాయక్, పాలకమండలి చైర్పర్సన్ శాంత, ఏసీపీ బస్వారెడ్డి, తహసీల్దార్ సుమ, ఎంపీడీవో అశోక్, సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్పై శకంర్రావు , ఈవో భీమవరపు సూర్యప్రకాశ్‌రావు తదితరులు పాల్గొన్నారు.