అశ్వారావుపేట టౌన్, అశ్వారావుపేట రూరల్, చండ్రుగొండ, దమ్మపేట, ఇల్లెందు, టేకులపల్లి, ఇల్లెందు రూరల్, సెప్టెంబర్ 4: పట్టణంలోని భగత్‌సింగ్ సెంటర్, కాళింగుల బజార్‌లోని వినాయక మండపాల వద్ద అన్నసంతర్పణ కార్యక్రమాలు నిర్వహించారు. చింతల బజార్ గణేశ్ ఉత్సవకమిటీ ఆధ్వర్యంలో 108 ప్రసాదాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. మద్దిరావమ్మ ఆలయ సన్నిధిలో ఏర్పాటు చేసిన గణేశ్ మండపం వద్ద కోలాట నృత్యం చూపరులను ఆకట్టుకున్నది. వినాయకపురం, మామిళ్లవారిగూడెం తదితర గ్రామాల్లో వినాయకుల ఉరేగింపు నిర్వహించారు.
అనంతరం గ్రామాల సమీపంలోని చెరువుల్లో నిమజ్జనం చేశారు. మండపాల వద్ద గణనాథులను ప్రత్యేక వాహనాల్లో పట్టణంలోని పలు ఊరేగింపుగా తీసుకెళ్లి పట్టణ సమీపంలోని వెంకమ్మ చెరువులో నిమజ్జనం చేశారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు. చండ్రుగొండలో అన్నదాన కార్యక్రమాన్ని సర్పంచ్ రన్య ప్రారంభించారు. కార్యక్రమంలో గానుగపాడు సొసైటీ వైస్ చైర్మన్ భూపతి ధనలక్ష్మి, టీఆర్ఎస్ నాయకులు భూపతి రమేశ్, కొదుమూరి జనార్ధన్‌రావు, భూపతి శ్రీనివాసరావు, అబ్బాస్ అలీ, గాలం రవి, కుక్కల రాములు, డోజర్ నర్సింహారావు, ఇమ్మడి ముక్తేశ్వరరావు, పోతురాజు వెంకటేశ్వర్లు, కూసాల లక్ష్మీపతి పాల్గొన్నారు. దమ్మపేట మండలంలో గణేశ్ ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలో అన్నదాన కార్యక్రమాలను మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కమిషనర్ అంకుషావలి, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. టేకులపల్లి సెంటర్లోని వినాయక మండపం వద్ద భక్తులు, పిల్లలు సరస్వతి పూజ చేశారు. ఆదివారం టేకులపల్లి మండలం కోయగూడెం, రావులపాడు గ్రామాల్లో ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని సర్పంచ్ కోరం ఉమా సురేందర్, ఎంపీటీసీ జాల సంధ్య ముఖ్య అతిథులుగా ప్రారంభించారు. ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇల్లెందు రూరల్ మండలం రొంపేడులో ఆశ్రమ పాఠశాలల విద్యార్థినులు వినాయక నిమజ్జనాన్ని నిర్వహించారు.