భద్రాద్రి జిల్లా సమీకృత కలెక్టరేట్ సిద్ధమైంది. త్వరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభానికి ముస్తాబైంది. కొత్తగూడెం, పాల్వంచ మధ్య రూ.44.98 కోట్ల నిధులతో 1.50 లక్షల చదరపు అడుగుల వైశాల్యం (26 ఎకరాలు)లో కలెక్టరేట్ నిర్మించారు. ఒకే వేదికపై 250 మంది సమావేశమయ్యేలా మందిరాలు ఏర్పాటు చేశారు. కలెక్టర్, అదనపు కలెక్టర్లతోపాటు అధికారులందరూ ఒకే సముదాయంలో ఉండేలా రూపొందించారు. కార్పొరేట్ కార్యాలయాల్లో ఎలాంటి సౌకర్యాలు ఉంటాయో అంతకు మించిన సౌకర్యాలతో కలెక్టరేట్ రూపుదిద్దుకున్నది. సముదాయం చుట్టూ వాకింగ్ ట్రాక్, క్రీడాప్రాంగణం అందుబాటులోకి వచ్చాయి. 46 మంది అధికారులు తమ చాంబర్లలో విధులు నిర్వహించనున్నారు. దివ్యాంగులు సులభంగా కార్యాలయాల్లోకి వేళ్లే విధంగా ట్రాక్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. భవనం మొత్తం జీ ప్లస్- 2 మూడు బ్లాకులుగా ఉంటుంది. సీఎం కేసీఆర్ కలెక్టరేట్‌ను ప్రారంభించిన మరుసటి రోజు నుంచే అధికారులు ఇక్కడ విధులు నిర్వర్తించనున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): ఆలోచన గొప్పదై దానిని ఆచరణలో చూపిస్తే ఎలా ఉంటుందో చేసి చూపిస్తున్నారు సీఎం కేసీఆర్. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నారు. అలాంటి కోవకు చెందిందే కలెక్టరేట్ల నిర్మాణ ఆలోచన. కలెక్టర్, అదనపు కలెక్టర్లతో పాటు అధికారులతో అందరూ ఒకే సముదాయంలో ఉండాలనే ఉద్దేశంతో వాటిని నిర్మిస్తున్నారు. ఇదే విధంగా కొత్తగూడెం, పాల్వంచ మధ్య 44.98 కోట్ల నిధులతో 1.50 లక్షల చదరపు అడుగుల వైశాల్యం (26 ఎకరాలు)లో కలెక్టరేట్ నిర్మాణం పూర్తయింది. 250 మంది ఒకే వేదికపై సమావేశమయ్యే విధంగా సమావేశ మందిరాలు ఏర్పాటయ్యాయి. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, కలెక్టర్ అనుదీప్ నిరంతరం పనులను పర్యవేక్షించారు. ఎప్పటికప్పుడు కాంట్రాక్టర్లు, ఆర్‌అండ్‌బీశాఖ అధికారులు అప్రమత్తం చేసి కలెక్టరేట్‌ను పూర్తి చేయించారు. ఈనెలలోనే సీఎం కేసీఆర్ కలెక్టరేట్‌ను ప్రారంభించనున్నారు. అధికారులు పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు.
చాంబర్లకు అనుగుణంగా ఫర్నీచర్..
కలెక్టరేట్లో అధికారులకు చాంబర్లు కేటాయించేందుకు కలెక్టర్ చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వారికి చాంబర్లను అప్పగించారు. మూడు రోజుల్లో ఆయా చాంబర్లలో బ్లాక్‌లు, ఫర్నీచర్ అందుబాటులోకి రానున్నది. సీఎం కేసీఆర్ కలెక్టరేట్‌ను ప్రారంభించిన మరుసటి రోజు నుంచే అధికారులు ఇక్కడ విధులు నిర్వర్తించనున్నారు. కేవలం కొన్నిశాఖల అధికారులు మాత్రమే బయటి కార్యాలయాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తారు. జిల్లా పరిషత్, ఆర్డీవో కార్యాలయాలు కొత్తగూడెంలోనే కొనసాగుతాయి.
నిరంతరం నిఘా..
కలెక్టర్‌తో పాటు ఇద్దరు అదనపు కలెక్టర్లకు సముదాయంలోనే నివాసాలు అందుబాటులోకి వచ్చాయి. సముదాయం వెనుక వైపు నివాస సముదాయాలు ఉంటాయి. కలెక్టరేట్‌పై నిరంతరం నిఘా ఉంటుంది. సీసీ కెమెరాల పర్యవేక్షణ, పక్కాగా భద్రతా సిబ్బంది ఉంటుంది. ప్రాంగణంలోనే పార్కింగ్ స్థలం ఉంటుంది. ఆర్అండ్బీ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని పనులను పూర్తి చేయించారు.
కార్పొరేట్‌ను మించిన హంగులు..
కార్పొరేట్ కార్యాలయాల్లో ఎలాంటి సౌకర్యాలు ఉంటాయో అంతకు మించిన సౌకర్యాలతో కలెక్టరేట్ అందుబాటులోకి వచ్చింది. సముదాయం చుట్టూ వాకింగ్ ట్రాక్, క్రీడాప్రాంగణాలు అందుబాటులోకి వచ్చాయి. 46 మంది అధికారులు తమ చాంబర్లలో విధులు నిర్వహించనున్నారు. ఏబీసీడీఈఎఫ్ ఆరు బ్లాకులతో పాటు మరో మీటింగ్ హాల్స్ రూపుదిద్దుకున్నాయి. దివ్యాంగులు సులభంగా కార్యాలయాల్లోకి వచ్చే విధంగా ట్రాక్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది. భవనం మొత్తం జీ ప్లస్- 2 మూడు బ్లాకులుగా ఉంటుంది.
సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తాం..
సకాలంలో సమీకృత కలెక్టరేట్ పూర్తి చేశాం. 46 మంది అధికారులకు సముదాయంలోనే చాంబర్లు కేటాయించాం. సువిశాల ప్రాంగణంలో భవనం అందుబాటులోకి వచ్చింది. ఈ నెలలోనే సీఎం కేసీఆర్ కలెక్టరేట్‌ను ప్రారంభిస్తారు. కలెక్టరేట్ ప్రారంభం తర్వాత అధికారులందరూ ఒకే చోట ఉంటారు. దీంతో ప్రజలకు మెరుగైన పాలన అందనున్నది.
– దురిశెట్టి అనుదీప్, భద్రాద్రి కలెక్టర్