బోనకల్లు, సెప్టెంబర్ 3 : తెలంగాణ ప్రభుత్వ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజు అన్నారు. శనివారం మండలంలోని ముష్టికుంట్ల రైతువేదిక వద్ద సీఎం కేసీఆర్‌కు ఆసరా పింఛన్‌దారులు మంజూరు పత్రాలతో పాటు, గుర్తింపు కార్డులు, సీఎం కేసీఆర్ చిత్రపటాలతో కృతజ్ఞతలు తెలుపుతూ సంతోషాన్ని వెలిబుచ్చారు. అదేవిధంగా ఆయన చిత్రపటానికి జడ్పీ చైర్మన్ చేతుల మీదుగా క్షీరాభిషేకం చేయించారు. ఈ సందర్భంగా కమల్‌రాజు మాట్లాడుతూ.. దేశంలోనే ఏ రాష్ట్రంలో అమలు కాని సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు.
బీజేపీ పాలిత ప్రాంతాల్లో రూ.600 పింఛన్ ఇస్తున్నారని, ఒక్క తెలంగాణలోనే దివ్యాంగులకు రూ.3,016, వితంతువులు, వృద్ధులు, ఒంటరి మహిళలతో పాటు, గీత, చేనేత కార్మికులకు రూ.2,016 పింఛన్ అందిస్తున్నారన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఏదోఒక సంక్షేమ పథకం అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. కాంగ్రెస్, బీజేపీ ప్రజాప్రతినిధులు పని కట్టుకొని అసత్య ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారన్నారు. వారి మాటలను ప్రజలు నమ్మవద్దని, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమే తెలంగాణ ప్రభుత్వం అహర్నిషలు కృషి చేస్తున్నదన్నారు.
కార్యక్రమంలో సర్పంచ్ షేక్ బీజాన్బీ, మండల మాజీ అధ్యక్షుడు బంధం శ్రీనివాసరావు, మాజీ జడ్పీటీసీ బానోత్ కొండ, మండల కార్మికశాఖ అధ్యక్షుడు బంధం నాగేశ్వరరావు, మధిర మార్కెట్ కమిటీ సభ్యుడు షేక్ జానీ, మైనార్టీ సంఘం అధ్యక్షుడు షేక్ ఇబ్రహీం, సొసైటీ ఉపాధ్యక్షుడు నాగేశ్వరరావు, గ్రామ రైతుబంధు సమితి కన్వీనర్ పండగ సీతారాములు, మహిళా సంఘం మండల కార్యదర్శి బోయినపల్లి వెంకటరాజ్యం, షేక్ నజీర్, దొప్పా కృష్ణ, షేక్ రఫీ, యార్లగడ్డ రాఘవ, షేక్ హుస్సేన్, రాజారావు తదితరులు పాల్గొన్నారు.