భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ) ;భద్రాద్రి జిల్లాలో పచ్చందాలు కనువిందు చేస్తున్నాయి. హరితహారంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదం పంచుతున్నాయి. ఎటుచూసినా పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పార్కులు, కోటి వృక్షార్చన పార్కులతో కళకళలాడుతున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 384 కిలోమీటర్ల పొడవునా జాతీయ రహదారుల్లో పచ్చందాలు పరుచుకున్నాయి. అవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా కేవలం జాతీయ రహదారుల్లో 2,30,400 మొక్కలు నాటారు. దీనికి తోడు పంచాయతీ పరిధిలోని రహదారులకు రెండువైపులా మొక్కలు నాటి రాష్ట్రస్థాయిలో జిల్లా టాప్‌లో నిలిచింది. 22 మండలాల్లో 1,128 కిలోమీటర్లలో 4,51,560 మొక్కలు నాటారు. ఏ దారిలో వెళ్లినా ప్రకృతికి పచ్చని కోక కట్టినట్లు పచ్చదనం పరిఢవిల్లుతున్నది.
పనిచేస్తే అది పక్కాగా ఉండాలి. మొక్క వేస్తే అది బతికి నిలబడాలి. గాలికి, ఎండకు తట్టుకునే మొక్కలను ఎంచుకున్న భద్రాద్రి జిల్లా అధికారులు జాతీయ రహదారుల్లో మొక్కలు నాటించి రాష్ట్రస్థాయి అధికారుల ప్రశంసలు అందుకున్నారు. జాతీయ రహదారి, అంతర్గత రహదారుల్లో అవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా మొక్కలు నాటి జిల్లాకు మంచిపేరు తెచ్చి పెట్టారు. నాణ్యత, సైజులో ఎత్తు, గాలికి విరిగిపోకుండా వేసిన మొక్కలు ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాష్ట్రంలో టాప్ స్థానంలో నిలిచింది.
1,128 కిలోమీటర్లలో అంతర్గతంగా..
జిల్లావ్యాప్తంగా ఉన్న గ్రామపంచాయతీల పరిధిలో ఉన్న అంతర్గతదారుల్లో అవెన్యూ ప్లాంటేషన్ పచ్చందాలు పరుచుకున్నాయి. ఎటుచూసినా పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె పార్కులు, కోటి వృక్షార్చన పార్కులతో కళకళలాడుతున్నాయి. దీనికి తోడు పంచాయతీ పరిధిలో ఉన్న రహదారులకు రెండువైపులా మొక్కలు నాటి రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. 22 మండలాల్లో 1,128 కిలోమీటర్లలో 4,51,560 మొక్కలు నాటారు. ఇప్పటికీ అక్కడక్కడా మొక్కలు నాటుతూనే ఉన్నారు. ఇదేకాక వజ్రోత్సవాల్లో భాగంగా భారీ సంఖ్యలో మొక్కలు నాటారు.
మొక్కల సంరక్షణలో ప్రత్యేక చర్యలు
నాటిన ప్రతి మొక్క బతకాలి.. అదే కలెక్టర్ అనుదీప్ లక్ష్యం. అందుకే నిరంతం మొక్కల పర్యవేక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. పొడవాటి మొ క్కలు నాటించి ప్రతిరోజూ వాటికి నీరు పోయించేలా అధికారులను కిందిస్థాయి సిబ్బందిని టీసీల ద్వారా అప్రమత్తం చేయడంతో మొక్కలు పెరగడానికి పంచాయతీ సిబ్బంది సఫలీకృతమయ్యారు. ప్రతి కిలోమీటరుకు ఒక వాచర్‌ను పెట్టి మొ క్కల సంరక్షణపై శ్రద్ధ తీసుకునే ప్రయత్నం చేశారు. జిల్లా అధికారులను మండల ప్రత్యేక అధికారులుగా నియమించడంతో ప్రతిరోజూ కార్యాలయానికి వచ్చే ముందు మొక్కలను చూసి రావడం విధుల్లో భాగంగా చేసుకున్నారు. ఇటీవల పీఆర్ ఆర్డీ సెక్రటరీ సందీప్ సుల్తానియా జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు పెరుగుతున్న మొక్కలను చూసి కితాబు ఇచ్చారు. దీంతోపాటు ఇక్కడికి వచ్చిన సీనియర్ ఐఏఎస్‌లు సైతం మొ క్కల సంరక్షణ చర్యలను చూసి కలెక్టర్‌ను అభినందించారు.
జిల్లాను ముందువరుసలో నిలుపుదాం
నాటిన ప్రతి మొక్కనూ బతికించాలి.. ఇదే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. రాష్ట్రంలో భద్రాద్రి జిల్లా రోల్‌మోడల్‌గా ఉండాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఆ దిశగా పనిచేస్తున్నాం. ప్రతి మండలానికి ఒకరిని ప్రత్యేక అధికారిగా నియమించడం వల్ల మొక్కలను సంరక్షిస్తున్నారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో అవెన్యూ ప్లాంటేషన్‌లో మనమే టాప్‌లో ఉన్నాం. జిల్లాను ముందువరుసలో నిలిపేందుకు సిబ్బంది నిరంతరం పనిచేస్తున్నారు.
– దురిశెట్టి అనుదీప్, కలెక్టర్