నేను రానుబిడ్డో సర్కారు దవాఖానకు అనే నానుడి ఎప్పుడో పోయింది.. ప్రైవేట్ ‘కాసు’పత్రులకు వెళ్లి ప్రజలు ఆర్థికంగా నష్టపోకూడదని తెలంగాణ ప్రభుత్వం సర్కారు దవాఖానల్లో కార్పొరేట్ వైద్యం అందిస్తున్నది. రోగులకు 24 గంటలు వైద్యమందించేలా వైద్యులు, సిబ్బందిని అందుబాటులోకి తీసుకొచ్చింది. మందుల కొరత రాకుండా చర్యలు చేపడుతున్నది. దవాఖానల్లో సకల సౌకర్యాలు కల్పించేందుకు పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతున్నది. నూతన భవనాల నిర్మాణాలు, అత్యధునిక వైద్యపరికరాలు ఏర్పాటు చేస్తున్నది. అందులో భాగంగా సత్తుపల్లి నియోజకవర్గంలోని ప్రభుత్వ దవాఖానలకు భారీగా నిధులు మంజూరు చేసింది. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రత్యేక చొరవతో సత్తుపల్లి ఆసుపత్రికి రూ.35 కోట్లు, కల్లూరు ఆసుపత్రికి రూ.10.50 కోట్లు, పెనుబల్లి ఆసుపత్రికి రూ.7.50 కోట్ల నిధులు కలిపి మొత్తం రూ.53 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో దవాఖానలకు కొత్త భవనాలతోపాటు అన్ని రకాల అత్యాధునిక వైద్యసేవలు అందించేందుకు వైద్య పరికరాలు సమకూర్చనున్నది. సత్తుపల్లి ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవల కోసం పట్టణంలో ఆధునిక వసతులతో 100 బెడ్ల ఆసుపత్రిని నిర్మిస్తున్నది. – సత్తుపల్లి, ఆగస్టు 23
సత్తుపల్లి, ఆగస్టు 23:సత్తుపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ దవాఖానల దశ మారుతోంది. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రత్యేక చొరవతో రాష్ట్ర ప్రభుత్వం సత్తుపల్లి ఆసుపత్రికి రూ.35 కోట్లు, కల్లూరు ఆసుపత్రికి రూ.10.50 కోట్లు, పెనుబల్లి ఆసుపత్రికి రూ.7.50 కోట్ల నిధులు కలిపి మొత్తం రూ.53 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో దవాఖానలకు కొత్త భవనాలతోపాటు అన్ని రకాల అత్యాధునిక వైద్యసేవల నిమిత్తం వైద్య పరికరాలు సమకూర్చనున్నది. ప్రస్తుతం సత్తుపల్లి భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో నూతన భవన నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది.
ఇటీవల రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఈ నూతన దవాఖాన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. సత్తుపల్లి ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు పట్టణంలో ఆధునిక వసతులతో 100 బెడ్ల ఆసుపత్రిని రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. 1970లో నిర్మించిన పాత భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరడం, రోగుల సంఖ్య పెరగడం, ఆసుపత్రి అవసరాలు తీరకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గ కేంద్రమైన సత్తుపల్లిలో 100 బెడ్ల ఆసుపత్రిని మంజూరు చేసింది. గత ప్రభుత్వాలు ఈ ఆసుపత్రిపై దృష్టి పెట్టకపోవడంతో ఇక్కడి రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. మెరుగైన వైద్యం కోసం ఖమ్మం, విజయవాడ వంటి నగరాలకు వెళ్లేవారు. ఈ ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే ఇక్కడే మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి.
ఆధునిక వసతులతో..
ప్రభుత్వం విడుదల చేసిన రూ.35 కోట్ల నిధులతో అన్ని రకాల ఆధునిక వసతులతో 100 బెడ్ల ఆసుపత్రి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేసేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. అదేవిధంగా కల్లూరు మండల కేంద్రంలో 1977లో ప్రారంభమైన 10 బెడ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చొరవతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు 30 బెడ్లకు అప్‌గ్రేడ్ చేశారు. ఆసుపత్రి నూతన భవన నిర్మాణం, అత్యాధునిక పరికరాల కొనుగోలుకు రూ.10.50 కోట్లు మంజూరు చేశారు.
అలాగే పెనుబల్లి ఏరియా ఆసుపత్రికి కూడా నూతన భవన నిర్మాణం, అధునాతన పరికరాల కొనుగోలుకు మరో రూ.7.50 కోట్లు మంజూరు చేశారు. వేంసూరు మండలం బీరాపల్లిలో మరో నూతన పీహెచ్సీ ఏర్పాటుకు ఎమ్మెల్యే ప్రత్యేకంగా కృషిచేశారు. సత్తుపల్లి నియోజకవర్గంలో 25 బస్తీ, పల్లె దవాఖానలు మంజూరు కావడంతో నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అన్ని రకాల అత్యాధునిక వైద్య పరికరాలు, చిన్నారులకు ప్రత్యేక వార్డు, టీ డయాగ్నస్టిక్ సెంటర్, ఎక్స్‌రే, సీటీ స్కాన్లతో పాటు ఐసీయూ రూములు అందుబాటులోకి రానున్నాయి. 25 మందికి పైగా వైద్య నిపుణులు, 100 మందికిపైగా వైద్య సిబ్బంది నూతన ఆసుపత్రికి రానున్నారు. ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్, కిడ్నీ రోగులకు డయాలసిస్ యూనిట్లు అందుబాటులోకి రానున్నాయి.
కార్పొరేట్ దవాఖానలకు వెళ్లొద్దు..
సత్తుపల్లిలో 100 బెడ్ల ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.35 కోట్లు మంజూరు చేసింది. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ అధునాతన సౌకర్యాలు కల్పిస్తోంది. పేదలెవరూ వైద్యం కోసం అప్పులు చేసి ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లొద్దు. సత్తుపల్లిలో 100 బెడ్ల ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే అన్నిరకాల కార్పొరేట్ వైద్య సేవలు ఇక్కడే అందుబాటులోకి వస్తాయి.
-సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్యే, సత్తుపల్లి
24 గంటలూ వైద్య సేవలు..
సత్తుపల్లిలో 100 బెడ్ల ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే 24 గంటల పాటు రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. ఆధునిక వైద్య పరికరాలు, ప్రత్యేకమైన వైద్య నిపుణులతో రోగులకు వైద్య సేవలు అందనున్నాయి. ఆసుపత్రిలో 25 మందికి పైగా వైద్య నిపుణులు, 100 మందికి పైగా వైద్య సిబ్బంది రోగులకు సేవలు అందించనున్నారు.
-కే.వెంకటేశ్వర్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్, సత్తుపల్లి