ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పామాయిల్ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతున్నది. వివిధ సబ్సిడీలతో పాటు మొక్కలు, ఎరువులు, డ్రిప్ వంటివి ఉచితంగా అందిస్తుండడంతో రాష్ట్రంలోనూ సాగు మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగానే దమ్మపేట మండలంలోని పామాయిల్ క్షేత్రాలు, అందులో సాగవుతున్న అంతర పంటలను పరిశీలించేందుకు మంగళవారం కేరళ, కర్ణాటక శాస్త్రవేత్తలు వచ్చారు. అల్లిపల్లి, పాకలగూడెంలోని పామాయిల్ క్షేత్రాల్లో అంతర పంటలుగా సాగు చేసిన జాజికాయ, వక్క పంటలను పరిశీలించారు. ఈ సాగు విధానాన్ని తుమ్మల, ఆలపాటి, అధికారులను శాస్త్రవేత్తలు అడిగి తెలుసుకున్నారు. – దమ్మపేట, ఆగస్టు 23
దమ్మపేట, ఆగస్టు 23: ఏజెన్సీ ఏరియాలోని దమ్మపేట ప్రాంతంలో తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహంతో రైతులు సాగు చేస్తున్న పామాయిల్ తోటల్లో అంతర పంటల సాగూ అనుకూలంగా ఉంటోంది. దీంతో జాజికాయ, జాపత్రి వంటి పంటలను రైతులు సాగు చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పామాయిల్ సాగు ఏటికేడూ గణనీయంగా విస్తరిస్తోంది. వివిధ సబ్సిడీలతోపాటు మొక్కలు, ఎరువులు, డ్రిప్ వంటివి కూడా ఉచితంగా అందిస్తుండడంతో రాష్ట్రంలోనూ ఈ సాగు మరింతగా పెరుగుతోంది. అందులో భాగంగానే దమ్మపేట మండల రైతులు పామాయిల్ సాగును విరివిగా చేపట్టడంతోపాటు వాటిల్లో అంతరపంటల సాగు వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ ప్రాంతంలో అంతర పంటల క్రేజ్‌ను తెలుసుకునేందుకు కేరళ, కర్ణాటక శాస్త్రవేత్తలు మంగళవారం ఇక్కడికి వచ్చారు.
వారితో కలిసి రాష్ట్ర మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, డీడీహెచ్ ఎంవీ మధుసూదన్, కన్సలెంట్ ఎం.అనంతరావు, ఉమ్మడి జిల్లాల ఉద్యాన, పట్టుపరిశ్రమల అధికారులు ఎం.మాధవి, అనసూయ, మరియన్న మండలంలో పర్యటించారు. అల్లిపల్లిలో పామాయిల్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆలపాటి రామచంద్రప్రసాద్‌కు చెందిన పామాయిల్ క్షేత్రంతోపాటు పాకలగూడెంలోని తుమ్మల వ్యవసాయ క్షేత్రం, లింగాలపల్లి, మందలపల్లి గ్రామాల్లో రైతులు సాగుచేస్తున్న తోటల్లోనూ పర్యటించారు. ఈ సందర్భంగా పామాయిల్ క్షేత్రాల్లో అంతర పంటలుగా సాగు చేసిన జాజికాయ, వక్క పంటలను పరిశీలించారు.
ఈ సాగు విధానం గురించి తుమ్మల, ఆలపాటి, అధికారులను శాస్త్రవేత్తలు అడిగి తెలుసుకున్నారు. దీనికి వారు బదులిస్తూ.. 15 ఏళ్ల పామాయిల్ సాగులో అంతర పంటలకు మంచి డిమాండ్ ఉంటుందని, మొదటి మూడేళ్లు అరటి, బొప్పాయి, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, ఆరేళ్ల తర్వాత కోకో, వక్క తదితర పంటలు సాగు చేసుకొని అదనపు ఆదాయం పొందొచ్చని వివరించారు. ప్రస్తుతం జాజికాయ సాగును ప్రోత్సహించేందుకు ఆ శాస్త్రవేత్తలతో కలిసి జాజికాయ మొక్క నాటి సాగును ప్రారంభించారు. ఉద్యానశాఖ అధికారి సందీప్, ఆయిల్‌పామ్ అధికారులు ఉదయ్, బాలకృష్ణ, అప్పారావు, సతీష్, కృష్ణ, యుగందర్, నగేశ్, మీనాక్షి, రైతులు దొడ్డా ప్రసాద్, కందిమళ్ల కృష్ణారావు పాల్గొన్నారు.
నారాయణపురంలో..
సత్తుపల్లి, ఆగస్టు 22: సత్తుపల్లి మండలం నారాయణపురం, పాకలగూడెం గ్రామాల్లో సాగవుతున్న పామాయిల్ తోటలను కేరళ, కర్ణాటకకు చెందిన శాస్త్రవేత్తలు డాక్టర్ షరోన్ అరవింద్, మహమూద్ నిస్సార్ బృంద సభ్యులు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉద్యాన, పట్టుపరిశ్రమశాఖ డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన్, ఆయిల్‌ఫాం సూక్ష్మసేద్య సలహాదారు అనంతరావు, ఉద్యానశాఖ డైరెక్టర్ మాధవి, ఉద్యానవనశాఖ జిల్లా అధికారి అనసూయ, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి వారు ఆయా పంటల్లో క్షేత్ర సందర్శన చేశారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ తాము పామాయిల్ తోటల్లో అంతర పంటగా జాజికాయలను సాగుచేసేందుకు తెలంగాణ నేలలు, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అన్నారు. వీటిని పరిశీలించేందుకే తాము వచ్చినట్లు చెప్పారు. అధికారులు మీనాక్షి, నగేశ్, బాలకృష్ణ, కృష్ణారావు, రైతులు పాల్గొన్నారు.
అంతర పంటలతో ఎంతో లాభం..
తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగానూ పామాయిల్ సాగు అంతకంతకూ విస్తరిస్తోంది. రైతులు తమ పామాయిల్ సాగులో 15 ఏళ్ల తర్వాత అంతర పంటలుగా జాజికాయ, జాపత్రి, మిరియాలు, సుగంధ ద్రవ్యాల సాగును చేపట్టినట్లయితే పామాయిల్ సాగులో వచ్చే ఆదాయంతోపాటు ఈ అంతర పంటలతో మరింత ఆదాయం లభిస్తుంది. పామాయిల్‌ను 27 నుంచి 30 ఏళ్ల వరకు సాగు చేసుకోవచ్చు. ఈ సాగు విధానం గురించి తెలుసుకునేందుకు వచ్చిన శాస్త్రవేత్తలకు సమగ్ర వివరాలు అందించాం.
-తుమ్మల నాగేశ్వరరావు, మాజీ మంత్రి
తెలంగాణ నేలలు అనుకూలం..
ఉష్ణ ప్రదేశాల్లో సుగంధ ద్రవ్యాల మొక్కలు దిగుబడిని ఇవ్వడం కుదరదు. కానీ తెలంగాణ ప్రాంతంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తేమ శాతం తక్కువగా ఉన్న ప్రాం తాలను గుర్తించాం. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపుమేరకు ఇక్కడకు వచ్చి పామాయిల్ సాగులో అంతర పంటల విధానంపై అవగాహన పెంచుకున్నాం. ఈ ప్రాంతంలో పామాయిల్ సాగుకు ఎంత డిమాండ్ ఉందో అందులో అంతర పంటలకూ అంతే డిమాండ్ ఉంది. ఆ పంటల సాగుకు ఇక్కడ అనుకూల వాతారణం ఉన్నట్లు గుర్తించాం.
-డాక్టర్ షరోన్ అరవింద్, శాస్త్రవేత్త
త్వరలో డెమో ప్లాంటేషన్..
రాష్ట్ర మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపు మేరకు ఈ ప్రాంతంలోని పామాయిల్ సాగులో అంతరపంటల గురించి తెలుసుకునేందుకు వచ్చాం. అంతర పంటల సాగు విధానంపై త్వరలో సత్తుపల్లి ప్రాంతంలో డెమో ప్లాంటేషన్‌ను ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు చేస్తున్నాం. వీటి దిగుబడి కారణంగా ముందు తరం, భవిష్యత్‌లో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందనున్నాయి.
-వీఏ మహమూద్ నిస్సార్, శాస్త్రవేత్త