416 మంది హాజరు..
నగరంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. ఈ నెల 21 నుంచి ఈ నెల 29 వరకు సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియకు సంబంధించి రిజిస్ట్రేషన్‌తోపాటు స్లాట్లు బుక్ చేసుకోవాలి. సర్టిఫికెట్ల పరీశీలన చేసుకునేందుకు ఈ నెల 26 వరకు ఉన్న స్లాట్లన్నీ బుక్ అయ్యాయి. ఉదయం 9 గంటల వరకే కేంద్రానికి అత్యధిక సంఖ్యలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వచ్చారు. విద్యార్థులు ఇచ్చిన స్లాట్ల ప్రకారం అధికారులు వారి ధ్రువపత్రాలను పరిశీలించారు. స్లాట్ బుకింగ్ ఫాం, హాల్‌టికెట్, ర్యాంక్ కార్డు, ఆధార్, టెన్త్, ఇంటర్, క్యాస్ట్, ఇన్కమ్, స్టడీ సర్టిఫికెట్లు, టీసీ ఒరిజినల్స్ పరీశీలిస్తున్నారు. జిరాక్స్‌లను మాత్రం అధికారులు తీసుకుంటున్నారు. పరిశీలన అనంతరం ఆప్షన్లు ఎలా నమోదు చేయాలో వివరిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగిన సర్టిఫికెట్ల పరిశీలనకు 430 మంది నమోదు చేసుకోగా 416 మంది హాజరైనట్లు కోఆర్డినేటర్ డాక్టర్ పులబాల రమేశ్ తెలిపారు. ఈ నెల 24, 25 తేదీల్లో 480మంది, ఈ నెల 26న 540 మంది స్లాట్లు బుక్ చేసుకున్నట్లు తెలిపారు. మొత్తం 4,200 మందికి గాను ఇప్పటికే 2,800 మంది స్లాట్‌బుక్ చేసుకున్నారు.
ఖమ్మం ఎడ్యుకేషన్, ఆగస్టు 23: ఉమ్మడి రాష్ట్రంలో డిసెంబర్ వచ్చిన ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రారంభమయ్యేది కాదు. కౌన్సెలింగ్‌లు నిర్వహించాలని న్యాయస్థానాలు మొట్టికాయలు వేస్తేనే స్పందన ఉండేది. తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే సరికి ర్యాంకుల ప్రకటనలు, కౌన్సెలింగ్ నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగిపోయాయి. విద్యార్థుల భవిష్యత్‌కు ఎలాంటి ఆటంకాలూ లేకుండా, ఇతర అవకాశాలు కోల్పోకుండా ఆగస్టులోనే కౌన్సెలింగ్‌ను పూర్తి చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఏదో హడావుడిగా కాకుండా పరిపూర్ణంగా కళాశాలలను తనిఖీ చేసి నాణ్యత పాటించే కళాశాలలకే అనుమతులు ఇస్తూ ప్రతి విద్యార్థి చదువుకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో స్పష్టం చేస్తూ మార్గదర్శకాలు విడుదల చేసి సీట్లు భర్తీ చేస్తోంది. ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌లో భాగంగా స్లాట్ బుకింగ్ ప్రక్రియ ఈ నెల 21న ప్రారంభం కాగా సర్టిఫికెట్ల పరిశీలన మంగళవారం నుంచి మొదలైంది.
వెబ్ ఆప్షన్లపై ప్రత్యేక నమూనా..
ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు వెబ్ విధానంపై అవగాహన ఉండదు. అవగాహన లేక తప్పులు జరగకూడదనే ఉద్దేశంతోనే కౌన్సెలింగ్ కేంద్రంలోనే సర్టిఫికెట్ పరిశీలన అనంతరం ఆప్షన్లు ఎలా ఎంచుకోవాలి? ఏ విధానంలో ఎంచుకోవాలి? అనే అంశాలపై ప్రత్యేక నమూనాను సైతం అందజేస్తున్నారు. విద్యార్థుల ర్యాంకుల ఆధారంగా ఏ కళాశాల వస్తుందనే సమాచారం వెబ్సైట్లో అందుబాటులో ఉన్నప్పటికీ నిరుటి సీట్లకు, ఈ ఏడాది సీట్లకు వ్యత్యాసాలు ఉంటోంది. దీనివల్ల సీట్లు తారుమారవుతాయి. విద్యార్థి తాను ఎంచుకున్న కోర్సుల మాదిరిగా ఎక్కువ కళాశాలలకు ప్రాధాన్యం ఇవ్వడం ఉత్తమం. నిర్ణయించిన ప్రకారంగా ఆప్షన్లు ఇచ్చుకోవడం ద్వారా విద్యార్థికి సీటు అలాట్ అవుతుంది. ఆప్షన్లు పెట్టుకోవడానికి ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ కంప్యూటర్లను మాత్రమే వినియోగించాలి. సెల్ఫోన్లలో ప్రయత్నిస్తే తప్పులు దొర్లే ప్రమాదం ఉంటుంది. సెప్టెంబర్ 6న సీటు అలాట్మెంట్ జరిగిన తర్వాత ఆన్లైన్లో ఫీజు చెల్లించాలి. దీనికోసం విద్యార్థి తమ సొంత బ్యాంక్ అకౌంట్ల నుంచి ఫీజు కట్టాలి. విద్యార్థులకు ఏమైనా ఫీజులు తిరిగివచ్చే అవకాశమున్నప్పుడు అదే బ్యాంక్ అకౌంట్‌కు జమ అవుతాయి.
పది వేల ర్యాంకులోపు పది మందే..
జిల్లాలో ఎంసెట్ ప్రవేశ పరీక్షలో ఇంజినీరింగ్‌కు ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు పోటీ పడ్డారు. సుమారు 7 వేల మంది పరీక్షకు హజరయ్యారు. గడిచిన సంవత్సరాలతో పోలిస్తే ఈ సారి పోటీ ఎక్కువే. ప్రవేశ పరీక్షలోనూ ఈ సారి ఉత్తీర్ణత శాతం పెరిగింది. ఎంసెట్ ఫలితాల్లో జిల్లాకు ఉత్తమ ర్యాంకులు లభించాయి. జిల్లాలో మంగళవారం జరిగిన కౌన్సెలింగ్‌లో పది వేల లోపు ర్యాంకులు కలిగిన వారిలో సుమారు 10 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడంతో వారు ఐఐటీ, ఎన్‌ఐటీలకే మొగ్గుచూపినట్లు స్పష్టమవుతోంది. ఉత్తమ ఫలితాలు సాధించినప్పటికీ విద్యార్థులు ప్రతిష్ఠాత్మక కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించడంతో ఆయా విద్యాసంస్థల్లో చేరాలనే ఉద్దేశంతోనే వారు ఎంసెట్ కౌన్సెలింగ్‌కు హాజరుకానట్లు స్పష్టమవుతోంది.
ఖమ్మంలో 8.. కొత్తగూడెంలో 4 కాలేజీలు..
ఖమ్మం జిల్లాలో 8, భద్రాద్రి జిల్లాలో 4 కళాశాలలకు జేఎన్టీయూహెచ్ అనుమతులిచ్చింది. కొత్తగూడెం జిల్లాలో 4 కళాశాలల్లో మూడు ప్రైవేట్ కళాశాలలు కాగా ఒకటి కేయూ పరిధిలోని ప్రభుత్వ కళాశాల. ఖమ్మం జిల్లాలోని 8 కళాశాలలూ ప్రైవేటువే. ఖమ్మంలో సీఎస్ఈ 399, సీఎస్ఎం 231, ఎలక్ట్రికల్ 252, ఎలక్ట్రానిక్స్ 305, సివిల్ 105, మెకానికల్ 105, సీఎస్డీ 42, మైనింగ్‌లో 42 సీట్లు ఉన్నాయి. మొత్తం ఖమ్మం జిల్లాలో 1,481 సీట్లు కౌన్సెలింగ్‌లో అందుబాటులో ఉండనున్నాయి. మంగళవారం కళాశాలలకు సీట్లను కేటాయిస్తూ జేఎన్టీయూహెచ్ అనుమతులు మంజూరు చేసింది.
మంచి కళాశాలను ఎంపిక చేసుకుంటా..
ఎంసెట్‌లో 5,533వ ర్యాంకు వచ్చింది. కంప్యూటర్ సైన్స్ కోర్సు చేయాలనేది నా కోరిక. సీఎస్ఈ కోర్సులో మంచి కళాశాలను ఎంపిక చేసుకుంటా. టాప్ కళాశాలలో నేను కోరుకున్న సీటు వస్తుంది.
-శ్రీకావ్య, విద్యార్థిని, ఖమ్మం
కంప్యూటర్ సైన్సే కావాలి..
కంప్యూటర్ సైన్స్ కోర్సు లేదా సీఎస్ఈ మెషిన్ లెర్నింగ్ కోర్సులో జాయిన్ అవుతా. ఇంజినీరింగ్ అనంతరం కొత్త అప్లికేషన్స్ తయారుచేస్తా. మంచి కళాశాలను ఎంపిక చేసుకుంటా.
-సాయి చరణ్, విద్యార్థి, ఖమ్మం రూరల్