తల్లాడ, ఆగస్టు 23: సత్తుపల్లి నియోజకవర్గానికి కొత్తగా 11,028 ఆసరా పింఛన్లు మంజూరయ్యాయని బుధవారం నుంచి వాటిని లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నామని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. తల్లాడ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్తగా తల్లాడ మండలానికి 2,422, కల్లూరు 2,405, పెనుబల్లి 1,887, సత్తుపల్లి 1,517, వేంసూరుకు 1,797, సత్తుపల్లి మున్సిపాలిటీకి 1,000 చొప్పున మొత్తం 11,028 ఆసరా పింఛన్లు మంజూరైనట్లు వివరించారు. ఇప్పటికే సత్తుపల్లి నియోజకవర్గంలో 29,414 మంది లబ్ధిదారులు ఆసరా పింఛన్లు పొందుతున్నారని, ఇప్పుడు కొత్తగా 11,028 పింఛన్లు మంజూరయ్యాయని, ప్రస్తుతం నియోజకవర్గంలో మొత్తం 40,442 మంది లబ్ధిదారులు ఆసరా పింఛన్ల ద్వారా ప్రయోజనం పొందనున్నారని వివరించారు.
కొత్తగా మంజూరైన పింఛన్లను నియోజకవర్గంలో రెండు విడతలుగా నేరుగా లబ్ధిదారులను కలిసి పంపిణీ చేస్తామన్నారు. ఈ మేరకు బుధవారం సత్తుపల్లి మండలంలోని రామనగరం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. 25న వేంసూరు, 26న పెనుబల్లి, 27న తల్లాడ, 28న కల్లూరు, 29న సత్తుపల్లి మున్సిపాలిటీల్లో లబ్ధిదారులకు ఆసరా మంజూరు పత్రాలను అందజేస్తామని వివరించారు. షెడ్యూల్ వారీగా ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు విజయవంతం చేయాలని కోరారు. దేశంలోనే సంక్షేమ పథకాలు అందించడంలో తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని, ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనని అన్నారు.
ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సొంత రాష్ట్రమైన గుజరాత్ కంటే మిన్నగా వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, బీడీ, చేనేత కార్మికులకు ప్రతినెలా ఆసరా పింఛన్లు అందుతున్నాయని గుర్తుచేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు రాయల వెంకటశేషగిరిరావు, దొడ్డా శ్రీనివాసరావు, రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, దుగ్గిదేవర వెంకట్‌లాల్, దూ పాటి భద్రరాజు, శీలం కోటారెడ్డి, తూము శ్రీనివాసరావు, కేతినేని చలపతి, దిరిశాల దాసురావు, బద్ధం కోటిరెడ్డి, దగ్గుల శ్రీనివాసరెడ్డి, గరిడేపల్లి వెంకటేశ్వర్లు, గుండ్ల నాగయ్య పాల్గొన్నారు.
రూ.10 లక్షల పరిహారం చెక్కు అందజేత..
ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్‌తో తల్లి, కొడుకు మృతిచెందడంతో విద్యుత్ శాఖ నుంచి మంజూరైన రూ.10 లక్షల పరిహారం చెక్కులను మృతుల కుటుంబ సభ్యులకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మంగళవారం అందజేశారు. మండలంలోని బిల్లుపాడులో ఇటీవల ఒకే కుటుంబానికి చెందిన తల్లి నస్రీన్, కుమారుడు సైదా ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్‌కు గురై మరణించారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చొరవ తీసుకొని ట్రాన్స్‌కో అధికారులతో చర్చించి రూ.10 లక్షల పరిహారం మంజూరు చేసేందుకు కృషిచేశారు. తల్లి, కుమారుడికి టీఆర్ఎస్ సభ్యత్వం ఉండడంతో ఒక్కొక్కరికీ రూ.2 లక్షల చొప్పున రూ.4 లక్షల ప్రమాదబీమా బీమా కూడా మంజూరైంది. ఆ చెక్కులను కూడా నెలరోజుల క్రితమే మృతుల కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎమ్మెల్యే కూడా స్వతహాగా కొంత ఆర్థికసాయం అందించి కుటుంబాన్ని ఆదుకున్నారు. రుద్రాక్షల బ్రహ్మం, ఇంజం కృష్ణార్జునరావు, మేడా నరసింహారావు పాల్గొన్నారు.