భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): అల్లర్లు, అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా భక్తి శ్రద్ధలతో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించాలని భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. గణేశ్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివిధ శాఖల అధికారులు, వినాయక చవితి ఉత్సవ కమిటీల నిర్వాహకులతో కలెక్టర్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
మండపాల వద్ద పరిశుభ్రతను పాటించాలని, ప్లాస్టిక్ రహిత వస్తువులనే వినియోగించాలని, మట్టి విగ్రహాలను మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి మండపానికి విద్యుత్ సౌకర్యం కోసం అనుమతి తీసుకోవాలని సూచించారు. అలాగే విద్యుత్ శాఖ అధికారులు, మున్సిపాలిటీల కమిషనర్లు, తహసీల్దార్లు, కార్యదర్శులు తప్పనిసరిగా గణేశ్ మండపాలను తనిఖీ చేయాలని ఆదేశించారు. ప్రజారక్షణ ముఖ్యమని, శాంతికి భంగం కలిగించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
గుర్తించిన నిమజ్జన ప్రాంతాల్లో బారీకేడ్లు ఏర్పాటు చేయాలని, ఇతర జిల్లాల నుంచి నిమజ్జనానికి విగ్రహాలు వచ్చే అవకాశం ఉన్నందున నిర్దేశిత ప్రాంతాల్లో వాహనాలను నిలుపుదల చేసి నిమజ్జనం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. గోదావరిలో విగ్రహాలను నిమజ్జనం చేసే చోట భక్తులు భారీగా వెళ్లకుండా బారీకేడ్లు, ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని, గజ ఈతగాళ్లు, పడవలు, అగ్నిమాపక వాహనాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
మండపాల్లో కమిటీల సభ్యులు చేయకూడని అంశాలపై తయారు చేసిన మినిట్స్ ప్రతులను ఉత్సవ కమిటీలకు అందజేయాలని అధికారులకు సూచించారు. అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీపీవో రమాకాంత్, డీఆర్వో ఆశోక్ చక్రవర్తి, ఆర్డీవో స్వర్ణలత, ఎస్సైజ్ ఈఎన్ జానయ్య, డీఈవో సోమశేఖర్ శర్మ, ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షుడు కంచర్ల చంద్రశేఖర్, అధ్యక్షుడు వందనపు శ్రీధర్, దారా రమేశ్, లక్ష్మణ్, కూరా శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.