ఖమ్మం, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నాడు : నీటి గోస పడిన రోజులెన్నో.. ఎన్ని బోర్లు వేసినా చుక్కనీరు రాక కన్నీళ్లు పెట్టుకున్న అన్నదాతలెందరో.. బావులన్నీ అడుగంటి పొలాలన్నీ నెర్రెలు వారిన పరిస్థితి. గుక్కెడు నీటికోసం అరిగోస పడిన రోజులున్నాయి. నేడు : తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నీటి వనరులను ఒడిసిపట్టింది. మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వవైభవం తీసుకొచ్చింది. చెక్‌డ్యాంలు నిర్మించి వృథా నీటికి అడ్డుకట్ట వేసింది. ఉపాధి పథకంలో భాగంగా కాలువల మరమ్మతులు చేపట్టింది. దీనికితోడు ఈ సారి పుష్కలంగా వర్షాలు కురవడంతో జలాశయాలు, చెరువులు, కుంటలకు జలకళ సంతరించుకున్నది. దీంతో భూగర్భజలాలు ఉబికి వస్తున్నాయి. 2016లో సగటున 9.07 మీటర్ల మేర బోరు వేస్తే తప్ప నీరు పడేది కాదు. ప్రస్తుతం కేవలం భూతలానికి 3.32 మీటర్లలోపే నీళ్లు పడుతుండడం విశేషం. గతేడాది జూలై కంటే ఈ ఏడాది జూలైలో ఖమ్మం జిల్లాలో 0.43 మీటర్ల పైకి జలాలు ఉబికొచ్చాయి.
మిషన్ భగీరథలో భాగంగా చెరువుల పునరుద్ధరణ.. జల వనరుల వద్ద వీలైన ప్రతిచోట చెక్ డ్యాంల నిర్మాణం.. ఉపాధి హామీ పథకంలో భాగంగా పంట కాలువలకు మరమ్మతులు.. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఇళ్లలో ఇంకుడు గుంతల నిర్మాణం.. వెరసి పుష్కలంగా జల వనరులు.. ఎవుసానికి దండిగా సాగు జలాలు.. ఇదంతా సీఎం కేసీఆర్ దార్శనికతకు నిదర్శనం. రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగ చేసి ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిపారు.. మరోవైపు ఏటా వర్షపాతం ఆశించిన దానికంంటే ఎక్కువగా నమోదవుతుండడంతో సాగుకు ఇబ్బందులు తప్పాయి. ఈ ఏడాది ఖమ్మం జిల్లాలో భారీగా వానలు కురిశాయి. ఇప్పటికే జలాశయాలు, చెరువులు, వాగులు, వంకలు జలకళను సంతరించుకున్నాయి. భూగర్భజలాలు ఉబికి వస్తున్నాయి. 2016లో సగటున 9.07 మీటర్ల మేర బోరు వేస్తే తప్ప నీరు పడేది కాదు. ప్రస్తుతం కేవలం భూతలానికి 3.32 మీటర్లలోపే నీళ్లు పడడం విశేషం.
గతంలో కంటే మెరుగు..
గతేడాది జూలై కంటే ఈ ఏడాది జూలైలో ఖమ్మం జిల్లాలో 0.43 మీటర్ల పైకి జలాలు ఉబికి వచ్చాయి. ఈ ఏడాది జూన్, జూలైలో జిల్లావ్యాప్తంగా 385.48 మి.మీ సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా అత్యధికంగా 521.70 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాలోని 15 మండలాల్లో అత్యధిక వర్షాపాతం నమోదు కాగా ఆరు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. తిరుమలాయపాలెం మండలంలోని తిప్పారెడ్డిగూడెంలో కేవలం ఒక అడుగు లోతులోనే భూగర్భజలాలు ఉండడం విశేషం. గతంలో ఇదే ప్రాంతంలో భూగర్భజలాలు బాగా లోతుకు పడిపోయేవి. ఏన్కూరు మండలంలోని ఆరికాయలపాడులో 14 మీటర్లు, సత్తుపల్లి మండలంలోని ప్రకాశ్‌నగర్‌లో 33 మీటర్ల లోతులో భూగర్భజలాలు ఉన్నాయి. నేల స్వభావాన్ని బట్టి జలాలు ఉంటాయని భూగర్భజల వనరులశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు.
వర్షపాతం ఇలా..
జూలై నెలలో ఖమ్మం అర్బన్ మండలంలో సగటున 0.73 మి.మీ వర్షపాతం, ఖమ్మంరూరల్ మండలం 1.98 మి.మీ, రఘునాథపాలెం 3.78 మి.మీ, వైరా 1.04 మి.మీ, తిరుమలాయపాలెం 0.697 మి.మీ, నేలకొండపల్లి 1.09 మి.మీ, బోనకల్లు 0.97 మి.మీ, చింతకాని 1.65 మి.మీ, ముదిగొండ 0.24 మి.మీ, కొణిజర్ల 1.60 మి.మీ, కూసుమంచి 3.8 మి.మీ, సింగరేణి 1.03 మి.మీ, కామేపల్లి 3.24 మి.మీ, మధిర 5.07 మి.మీ, ఎర్రుపాలెం 6.28 మి.మీ, తల్లాడ 1.69 మి.మీ, ఎర్రుపాలెం 6.28 మి.మీ, కల్లూరు 0.93 మి.మీ, సత్తుపల్లి 14.44మి.మీ, పెనుబల్లి 3.96 మి.మీ, ఏన్కూరు 4.40 మి.మీ, పెనుబల్లి 3.96 మి.మీ వర్షపాతం నమోదైంది. వానల కారణంగా బోర్లు, బావులు, చెరువులు, జలాశయాలు నిండాయి. దీంతో రైతాంగం ధీమాగా యాసంగి సాగుకు సన్నద్ధమవుతున్నారు. అధికారులు జిల్లావ్యాప్తంగా 66 చోట్ల స్పీడియో మీటర్లు పెట్టి భూగర్భజలాలు పుష్కలంగా ఉన్నాయని నిర్ధారించారు.