ఖమ్మం ఎడ్యుకేషన్, ఆగస్టు 20 : ఇంటర్ తర్వాత ఇంజినీరింగ్ కోర్సుల్లో విద్యార్థులు ఎంపిక చేసుకునే విభాగంపై వారి భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. ఇంజినీరింగ్ కళాశాలలను ఎంచుకోవడంలో తల్లిదండ్రులు, విద్యార్థులు పొరపాట్లు చేస్తే నాలుగేళ్లు ఇబ్బంది పడాలి. కళాశాలలో బోధన తీరు, ఆ కళాశాలలో మౌలిక సదుపాయాలు ఉన్నాయా! లేవా అనేది పరిశీలించాలి. జేఎన్టీయూహెచ్ పరిధిలో ఉందా లేదా! ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉందా లేదా తెలుసుకోవాలి. కోర్సు ఎంపికతోపాటు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కల్పిస్తున్న కళాశాలలకే ప్రాధాన్యమివ్వాలి. ఏ సంవత్సరంలో కళాశాల స్థాపించారు, ఏయే కంపెనీల నుంచి ఎంపికలు జరిగాయి, ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయనే అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్ విధానం, కోర్సులపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
కంప్యూటర్ సైన్స్.. కంప్యూటర్ సైన్స్.. ఇప్పుడు ఇంజినీరింగ్‌లో క్రేజీ కోర్సు అయింది. ఏ యూనివర్సిటీ, ఏ కళాశాల అయినా సీఎస్ఈ కోర్సుకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌కు మంచి అవకాశాలు ఉండడం.. తెలంగాణలో జిల్లా కేంద్రాలకు ఐటీ విస్తరించడంతో సీఎస్ఈ కోర్సుకు డిమాండ్ ఏర్పడింది. ఇంటర్ తర్వాత ఇంజినీరింగ్ కోర్సుల్లో విద్యార్థులు ఎంపిక చేసుకునే విభాగంపై వారి భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. ఇంజినీరింగ్ కళాశాలలను ఎంచుకోవడంలో తల్లిదండ్రులు, విద్యార్థులు పొరపాట్లు చేస్తే నాలుగేళ్లు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. నాసిరకం కళాశాలలో చేరి భవిష్యత్‌ను ఇరుకున పెట్టుకోవడం కంటే మంచి కళాశాలను ఎంపిక చేసుకుంటే మేలు. ఎంసెట్‌లో ఉత్తమ ర్యాంకు సాధించిన విద్యార్థులు కళాశాల ఎంపికలో అప్రమత్తంగా ఉండాలి. కళాశాలలో విద్యార్థుల విజయాలను తెలుసుకుని ఆప్షన్స్ పెట్టుకోవాలి. దగ్గర, దూరం కాకుండా విద్యార్థుల భవిష్యత్ ఆధారంగా కాలేజీని ఎంచుకోవాలి. ప్రకటనలను చూసి మోసపోకుండా ఉత్తమ కళాశాలను ఎంపిక చేసుకోవాలి. ఈ నెల 21వ తేదీన ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో కౌన్సిలింగ్, కోర్సులపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
ఢోకా ఉండదనే కంప్యూటర్ సైన్స్..
ఇంజినీరింగ్ కోర్సుల్లో కంప్యూటర్ సైన్స్‌తోపాటు సీఎస్ఈ ఏఐ ఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కోర్సులకే మక్కువ చూపిస్తున్నారు. ఈ కోర్సులు చదవడం ద్వారా భవిష్యత్‌కు ఢోకా ఉండదని అంచనా వేస్తున్నారు. అన్నిరంగాల్లో డిజిటలైజేషన్‌కు పెద్దపీట వేస్తుండడంతో అంచానాలకు మించి టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులొస్తున్నాయి. రంగానికి అనుగుణంగా స్మార్ట్ ఫీచర్స్ అభివృద్ధి చెందుతున్నాయి. వీటన్నింటిని అభివృద్ధి చేసే ప్రోగాం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో సాధ్యమని నిపుణులు పేర్కొంటున్నారు. పెద్ద మోతాదులో ఉన్న డేటాను తక్కువ సమయంలో శోధించి అనుకూల నిర్ణయాన్ని ఇవ్వగలిగిన బలాన్ని ఈ ప్రోగాం సొంతమవ్వడంతో క్రేజ్ ఏర్పడింది.
ఎలక్ట్రానిక్స్‌లోనూ అవకాశాలు..
ప్రతి కళాశాలలోనూ కొన్ని కోర్సులుంటాయి. వీటిల్లో డిమాండ్ ఆధారంగా కొన్ని కోర్సుల మధ్య పోటీ ఉంటుంది. ఒక సంవత్సరం కంప్యూటర్స్ అంటే, మరో సంవత్సరం ఎలక్ట్రానిక్స్ అంటుంటారు. క్రేజ్ ఉన్న కోర్సుతో సంబంధం లేకుండా భవిష్యత్‌ను నిర్దేశించుకుని కళాశాలను, కోర్సుని ఎంపిక చేసుకోవాలి. బీటెక్ అనంతరం సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ ఏ రంగంలో రాణించాలనుకుంటున్నామో నిర్ణయించుకుని కోర్సులకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇంజినీరింగ్ విభాగంలో కోర్, నాన్‌కోర్ విభాగాలున్నాయి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ తదితర కోర్సులను కోర్ గ్రూప్లంటారు. నాన్కోర్లో సమయం, మార్కెట్ అవసరాలను బట్టి ఉపాధి, ఉద్యోగాల ఆధారంగా డిమాండ్ ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ కోర్సులో చేరేందుకు విద్యార్థులు ఉత్సాహం చూపుతున్నారు. ఈసీఈ ద్వారా సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ రెండింటిలో అవకాశాలుండడంతో రెండూ ప్రాధాన్య కోర్సులుగా మారాయి.
కళాశాల.. కోర్సు..
ఎంపిక చేసుకుందామనుకున్న కళాశాలను చూసి అక్కడున్న పరిస్ధితులను అంచనా వేయాలి. అక్కడి విద్యార్థులతో మాట్లాడితే ఆయా కళాశాలకు సంబంధించిన ఎక్కువ వివరాలు తెలుస్తాయి. ఆ కళాశాలలో ఏ బ్రాంచ్‌లో చేరితే బాగుంటుందనే అంశాలపై సూచనలు చేస్తారు. కళాశాలను ఎంపిక చేసుకునే క్రమంలో ఆ కళాశాలలో మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేవా అనేది పరిశీలించాలి. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని ఆ కళాశాల జేఎన్టీయూహెచ్ పరిధిలో ఉందా, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉందా! తెలుసుకోవాలి. కేవలం కళాశాలల హంగులు ఆర్భాటాలు చూసి కలర్‌పుల్ బ్రోచర్లతో మోసపోకుండా జాగ్రత్తగా పరిశీలించాలి. కళాశాల, కోర్సు ఎంపికతోపాటు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కల్పిస్తున్న కళాశాలలకే ప్రాధాన్యం ఇవ్వాలి. ఏ సంవత్సరంలో కళాశాల స్థాపించారు. ఏయే కంపెనీల ద్వారా ఎందరు విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చాయి.. అనే వాటిని నిశితంగా పరిశీలించాలి.
సీఎస్ఈ తీసుకోవాలని సలహా ఇచ్చారు..
ఎంసెట్‌లో 10 వేల ర్యాంకు వచ్చింది. ఇంజినీరింగ్ ఏ కోర్సు బాగుంటుందని మా బంధువులతోపాటు అధ్యాపకులను అడిగిన. తొలి ప్రాధాన్యం కంప్యూటర్ సైన్స్ తీసుకోవాలని చెప్పారు. ఏ కళాశాలలో చేరాలనే దానిపై ఇప్పటికే వివరాలు సేకరించాను.
– చావా రోషిణి, విద్యార్థిని