ఖమ్మం కల్చరల్, ఆగస్టు 20;స్వతంత్ర భారత వజ్రోత్సవాల సంబురాల్లో భాగంగా ఊరూరా రంగవల్లులు విరిశాయి.. అవనిని ముద్దాడిన మువ్వన్నెలు కనువిందు చేశాయి.. జిల్లావ్యాప్తంగా జరిగిన ఈ వేడుకలతో సందడి నెలకొన్నది. ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో శనివారం ఎస్హెచ్జీలు, డీఆర్డీఏ, ఐసీడీఎస్, వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గులు, ఆటల పోటీలు జరిగాయి. వందలాది మంది పోటీల్లో పాల్గొని వజ్రోత్సవ స్ఫూర్తిని చాటి చెప్పారు. గౌతమి జిల్లా సమాఖ్య సభ్యులు ముగ్గుల పోటీలను పర్యవేక్షించారు. జిల్లా హార్టికల్చర్ అధికారి అనసూయ, కేఎంసీ అసిస్టెంట్ కమిషనర్ మల్లీశ్వరి, అడిషనల్ డీఆర్డీవో శిరీష న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. విజేతలకు అడిషనల్ కలెక్టర్ స్నేహలత మొగిలి బహుమతులు అందజేశారు. కార్యక్రమాల్లో డీఆర్డీవో విద్యాచందన, జిల్లా సంక్షేమ అధికారి సంధ్యారాణి, అడిషనల్ డీఆర్డీవో జయశ్రీ, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు అరుణ పాల్గొన్నారు.