ఖమ్మం ఎడ్యుకేషన్, ఆగస్టు 20: గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఒక్కో ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా సూమారు రూ.50 వేల వరకు సమగ్ర శిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) గ్రాంట్ విడుదలైంది. ఈ నిధులతో ప్రధానోపాధ్యాయులు సైన్స్ పరికరాలు, క్రీడా పరికరాలు, ఫోన్ బిల్స్‌తో పాటు ఇతర అభివృద్ధి పనులకు వినియోగించారు. ఖర్చులు పోగా మిగిలిన నిధుల వివరాలను ఏటా యాజమాన్యాలు తిరిగి ప్రభుత్వానికి లెక్క చెప్పాల్సి ఉంది. దీనిలో భాగంగా యాజమాన్యాలు డీఈవో కార్యాలయంలో ఖర్చులకు సంబంధించిన నివేదికలు అందించాయి. నిధుల వినియోగంపై జిల్లాకేంద్రంలో రెండు రోజుల పాటు జరిగిన ఆడిట్ శుక్రవారంతో ముగిసింది.
నిధుల విడుదల ఇలా..
గత విద్యాసంవత్సరానికి జిల్లావ్యాప్తంగా ఉన్న 1,198 స్కూల్స్‌కు గ్రాంట్స్ విడుదలయ్యాయి. వీటిలో 14 కేజీబీవీలు, రెండు మోడల్ స్కూల్స్, ఒక యూఆర్ఎస్, 20 ఎమ్మార్సీ, 80 కాంప్లెక్సులు ఉన్నాయి. ఎస్ఎస్ఏ కార్యాలయానికి రూ.49.51లక్షలు, పాఠశాలలకు రూ. 5.51 కోట్లు విడుదలయ్యాయి. నిధుల వినియోగంపై ఆర్బీ అసోసియేట్స్ సంస్థ ఆడిట్ పూర్తి చేసింది. 18న ఖమ్మం నగరంలోని రిక్కాబజార్ పాఠశాలలో 11 మండలాలకు చెందిన పాఠశాలలకు విడుదలైన గ్రాంట్‌పై ఆడిట్ జరిగింది. సింగరేణి, కామేపల్లి, రఘునాథపాలెం, ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి, ముదిగొండ, చింతకాని, ఖమ్మం అర్బన్, కొణిజర్ల మండలాలకు చెందిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఆడిటింగ్‌లో పాల్గొన్నారు. 19న జరిగిన ఆడిటింగ్‌లో ఏన్కూరు ఎమ్మార్సీ, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూరు, వైరా, తల్లాడ, వైరా, మధిర, ఎర్రుపాలెం, బోనకల్లు ఎమ్మార్సీ తదితర మండలాలకు చెందిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
29 స్కూల్స్ యాజమాన్యాలు గైర్హాజరు
నిధుల వినియోగంపై ఆడిట్ అధికారులు యూటిలైజేషన్ సర్టిఫికెట్ల(యూసీలు)ను పరిశీలించారు. బిల్లులను నిశితంగా పరిశీలించి వ్యత్యాసాలున్న వాటిని ఉన్నతాధికారులకు నివేదించారు. ఆడిటింగ్‌కు 21 ఎమ్మార్సీలు, 14 కేజీబీవీలు, ఒక యూఆర్ఎస్, 78 సీఆర్సీలు, 1,168 ఎస్ఎంసీలు హాజరు కాగా, మూడు కాంప్లెక్స్ రిసోర్స్ సెంటర్లు (సీఆర్సీ), 29 ఎస్ఎంసీలు (స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు) హాజరు కాలేదు.
మరో అవకాశం కల్పిస్తాం
ఆడిటింగ్‌లో పాల్గొనని యాజమాన్యాలకు మరో అవకాశం కల్పిస్తాం. అప్పటికీ హాజ రై ఆడిటింగ్ చేయించకపోతే శాఖపరమైన చర్యలు తీసుకుంటాం. భద్రాద్రి జిల్లాలో ఈ నెల 22 నుంచి 24 వరకు ఆడిటింగ్ జరుగనున్నది. అక్కడ ఆడిట్ పూర్తి కాగానే ఖమ్మంలో మరోసారి ప్రక్రియ జరుగుతుంది.
– యాదయ్య, డీఈవో, ఖమ్మం