ఖమ్మం కల్చరల్, ఆగస్టు19 : బోసినవ్వులతో చిట్టి కన్నయ్యలు కనువిందు చేశారు. చిన్ని కృష్ణుడి పాదముద్రలు వాకిళ్లలోకి కృష్ణభగవానుడిని ఆహ్వానించాయి. శ్రావణ బహుళ రోహిణి నక్షత్ర యుక్త అష్టమి తిథి శుక్రవారం శ్రీకృష్ణుడి జన్మదినాన్ని భక్తులు జిల్లావ్యాప్తంగా ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. కృష్ణ నామస్మరణ, విశేష పూజలు, తులసీ దళార్చనలు, పంచామృతాభిషేకాలు, శ్రీకృష్ణ వ్రతాలతో అంతటా కృష్ణతత్వం ఉట్టిపడింది. భక్తులు తెల్లవారుజామునే పవిత్రస్నానాలు ఆచరించి, గృహాలను మామిడి తోరణాలతో శోభాయమానంగా అలంకరించుకున్నారు.
మండపం లో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశారు. అష్టోత్తర, శత, సహస్ర నామ పూజలు చేసి తరించా రు. సకల శుభాలు తెచ్చిపెట్టే శ్రీకృష్ణ వ్రతాన్ని నిష్టతో ఆచరించారు. సర్వాంగ సుందరంగా ముస్తాబైన కృష్ణ మందిరాలు, వైష్ణవాలయాల్లో భక్తులు కిటకిటలాడారు. తమ ఇలవేల్పు, ఇష్టదైవమైన శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడికి పూజలు చేసి స్వామి అనుగ్రహానికి పాత్రులయ్యారు. వెన్నదొంగకు ప్రీతిపాత్రమైన పలు రకాల పిండి వంటకాలు, స్వీట్లను నైవేద్యంగా సమర్పించారు.
ఉట్టిపడిన కృష్ణతత్వం..
ఖమ్మం గుట్టలబజార్లోని శ్రీమురళీకృష్ణ మందిరంలో రెండు రోజులుగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం మందిరంలో ప్రత్యేక అలంకారంలో కొలువైన స్వామికి 106 కలశాలతో పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం తులసిదళాలతో భక్తులు అర్చనలు చేశారు. మందిరం ఆవరణలో హోమాలు, వ్రతాలను వైభవంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం, హిందుధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో టేకులపల్లి గోశాలలో పూజలు నిర్వహించి, శ్రీకృష్ణ వ్రతాలను ఆచరించారు. మామిళ్లగూడెం వేంకటేశ్వరస్వామి ఆలయం, రామాలయం, మామిళ్లగూడెం వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో కృష్ణాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను జరుపుకోనున్నారు.
ఉట్ల ఉత్సాహం..
పిల్లనగ్రోవి, తలపై నెమలి ఫించం, కిరీటం, సంప్రదాయ పంచెకట్టు, మెడలో ముత్యాల దండతో బోసినవ్వులు విరబోస్తూ బుడిబుడి అడుగులతో కన్నయ్యలు సందడి చేశారు. చిట్టి కన్నయ్యలకు తోడు గోపికలు సంప్రదాయ వేషధారణతో ఆకట్టుకున్నారు. పలుచోట్ల యువకులు ఉట్లు కొట్టి కేరింతలతో ఆటవిడుపు చేశారు. కోలాటాలు, నృత్యాలతో శ్రీకృష్ణ భగవానుడిని ప్రసన్నం చేసుకున్నారు.