– నల్లగొండలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ‘జెన్-జీ సెమినార్’
రామగిరి, సెప్టెంబర్ 02 : దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న పేపర్ లీక్‌లు, విద్యారంగ ప్రైవేటీకరణ, స్కాలర్‌షిప్‌ల కోతలు, ప్రభుత్వ విద్యకు నిధుల తగ్గింపు వంటి సమస్యలపై యువతరం ఇకపై మౌనంగా ఉండకూడదని ఎస్ఎఫ్ఐ జాతీయ సహాయ కార్యదర్శి ఐషే ఘోష్ పిలుపునిచ్చారు. నల్లగొండ పట్టణంలో బుధవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ‘జెన్-జీ సెమినార్’ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐషే ఘోష్ విద్యార్థులు, యువతను ఉద్దేశించి తీవ్రస్థాయిలో ప్రసంగించారు. విద్య, ఉపాధి, సామాజిక న్యాయం కోసం యువత సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
పరీక్షలకు ఆలస్యంగా వస్తే నిబంధనల పేరుతో విద్యార్థులను అనుమతించని ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం.. ప్రభుత్వ వ్యవస్థల వైఫల్యం వల్ల పేపర్ లీక్‌లు జరిగినప్పుడు ఎందుకు జవాబుదారీ వహించవని ఐషే ఘోష్ నిలదీశారు. నీట్ పేపర్ లీక్‌ల కారణంగా గత కొద్ది సంవత్సరాలలో దేశవ్యాప్తంగా పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుని బలవన్మరణాలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి కష్టపడి చదివే విద్యార్థులపై పడుతున్న తీవ్రమైన మానసిక ఒత్తిడికి ప్రభుత్వాలు, అధికారులే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కేవలం రీ-ఎగ్జామినేషన్ నిర్వహిస్తామని చేతులు దులుపుకోవడం సరికాదన్నారు.
విద్యా రంగానికి బడ్జెట్లో నిధులు కోత కోయడం వల్ల ప్రభుత్వ విద్య క్షీణిస్తోందని ఐషే ఘోష్ విమర్శించారు. పెరుగుతున్న ప్రైవేటీకరణ కారణంగా శ్రామిక, మధ్యతరగతి, పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందని ద్రాక్షలా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల విద్యార్థులు చిన్న వయసులోనే చదువు మానేసి, తక్కువ వేతనాల ఉద్యోగాలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందన్నారు. రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాలు, కార్లు, ఫ్లెక్సీల కోసం కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు.. నాణ్యమైన విద్య, పాఠశాలలు, గ్రంథాలయాల కోసం ఆ స్థాయిలో ఎందుకు నిధులు కేటాయించడం లేదని ప్రశ్నించారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఎనిమిది దశాబడులు పూర్తవుతున్నా కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు పశువుల పాకల్లో కొనసాగడం, మూతపడడం బాధాకరమన్నారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో విద్యార్థులే స్వయంగా తమ పాఠశాలల సమస్యలను సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి తెస్తున్నారని తెలిపారు. జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్‌లపై ప్రశ్నించిన విద్యార్థులపై లాఠీచార్జి చేయడం, అణచివేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు. భగత్‌సింగ్, అంబేద్కర్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న యువత ఈ అణచివేతను సహించదని స్పష్టం చేశారు.
ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకునేందుకు ఎస్ఎఫ్ఐ ప్రతిష్టాత్మకంగా ‘సేవ్ స్కూల్స్ క్యాంపెయిన్ – స్కూల్ బచావో ఆందోళన’ను ప్రారంభించిందని ఐషే ఘోష్ వెల్లడించారు. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, తాగునీరు, మరుగుదొడ్లు, ఉపాధ్యాయుల కొరత వంటి అంశాలపై సర్వే నిర్వహించి ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు, అధ్యక్షుడు రజనీకాంత్, రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మమత, ఉపాధ్యక్షుడు కిరణ్, నల్లగొండ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్, జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేష్, తదితర నాయకులు పాల్గొన్నారు.