గ్రామీణ విద్యార్థులకు ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు అందుబాటులో లేకపోతే పొరుగు గ్రామాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఆటోలు, వ్యాన్లలో బడికి వెళ్లాలంటే వారికి భారంగా మారింది. దీంతో వారి తల్లిదండ్రులు పిల్లల చదువు మాన్పిస్తున్నారు. దీనివల్ల డ్రాపౌట్స్ పెరుగుతున్నాయి. అయితే, డ్రాపౌట్స్ తగ్గించడంతోపాటు నిరుపేద విద్యార్థులకు రవాణా ఖర్చులు భారం తగ్గించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఒక్కో విద్యార్థికి నెలకు రూ.600 చొప్పున భత్యం చెల్లించేందుకు ముందుకొచ్చింది. విద్యార్థి ఇంటికి ప్రాథమిక పాఠశాల కిలోమీటరు దూరం, ప్రాథమికోన్నత పాఠశాల 3 కిలోమీటర్లు, ఉన్నత పాఠశాల 5 కిలోమీటర్ల దూరంలో ఉంటే రవాణా భత్యం వర్తింపజేస్తున్నది. ఖమ్మం జిల్లావ్యాప్తంగా 2,400 మంది దూరప్రాంతాల నుంచి బడికి వెళ్తున్నట్లు విద్యాశాఖ అధికారులు గుర్తించారు. ఇప్పటికే సెక్టోరియల్ అధికారులు విద్యార్థుల బ్యాంకు ఖాతా వివరాలను సేకరిస్తున్నారు. ఇప్పటికే 1,800 మంది వివరాలు ఆన్లైన్ చేసినట్లు సమాచారం. మిగిలిన విద్యార్థుల వివరాలు ఆన్లైన్ చేస్తే ఉన్నతాధికారులకు అందుతాయి.
ఖమ్మం, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రభుత్వ పాఠశాలలకు రోజు వెళ్లి చదువుకుంటున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. వారికి రవాణా ఖర్చుల నిమిత్తం నెలకు రూ.600 చొప్పున భత్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అర్హుల జాబితా రూపొందించింది. పథకం కింద ఒక్కోవిద్యార్థికి గరిష్ఠంగా సంవత్సరానికి రూ.3 వేలు అందనున్నాయి. గ్రామీణ ప్రాంతాలకు చెందిన పిల్లలు స్థానిక ప్రాథమిక పాఠశాలలో విద్యనభ్యసిస్తారు. ప్రాథమికోన్నత విద్య, హైస్కూల్ విద్యకు పొరుగు గ్రామాలకు వెళ్లాల్సి ఉంటుంది. నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఇది ఆర్థిక భారం. పిల్లలు ఆటోలు, వ్యాన్లలో బడికి వెళ్లాల్సిన పరిస్థితి. దీంతో వారి తల్లిదండ్రులు పిల్లల చదువు మాన్పిస్తున్నారు. దీంతో డ్రాపౌట్స్ పెరుగుతున్నాయి. డ్రాపౌట్స్పై దృష్టి సారించిన సర్కార్ వారికి విద్యను చేరువ చేయాలని మూడేళ్ల క్రితం సంకల్పించింది. ఒక్కో విద్యార్థికి కొన్నినెలల పాటు రూ.600 చొప్పున రవాణా భత్యం అందించింది. రెండేళ్ల క్రితం కరోనా కారణంగా భత్యం నిలిచిపోయింది. ఇప్పుడు కరోనా భయం లేదు. దీంతో సర్కార్ తిరిగి భత్యం అందివ్వనున్నది.
విద్యాహక్కు చట్టం ప్రకారం విద్యార్థి ఇంటికి ప్రాథమిక పాఠశాల కిలోమీటరు దూరం, ప్రాథమికోన్నత పాఠశౠల 3 కిలోమీటర్లు, ఉన్నత పాఠశాల 5 కిలోమీటర్ల దూరంలో ఉంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు రవాణా భత్యాన్ని వర్తింపజేస్తారు. నిబంధనల ప్రకారం ఖమ్మంజిల్లావ్యాప్తంగా 2,400 మంది దూర ప్రాంతాల నుంచి బడికి వెళ్తున్నట్లు విద్యాశాఖ అధికారులు గుర్తించారు. ఇప్పటికే సెక్టోరియల్ అధికారులు విద్యార్థుల బ్యాంకు ఖాతా వివరాలను సేకరిస్తున్నారు. ఇప్పటికే 1,800 మంది వివరాలు ఆన్లైన్ చేసినట్లు సమాచారం. మిగిలిన విద్యార్థుల వివరాలు ఆన్లైన్ చేస్తే వివరాలు ఉన్నతాధికారులకు అందుతాయి.
దూర ప్రాంతంలోని బడులకు వెళ్లి చదువుకునే విద్యార్థులకు నెలకు రూ.600 చొప్పున రవాణా భత్యం అందనున్నది. ఒక్కో విద్యార్థి బ్యాంకు ఖాతాలో ఏడాదికి రూ.3 వేల చొప్పున జమ కానున్నది. ప్రస్తుతం అర్హుల జాబితాను ఆన్లైన్ చేస్తున్నాం. భత్యం అందితే డ్రాపౌట్స్ తగ్గుతాయి. బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరగుతున్నది.
– యాదయ్య, జిల్లా విద్యాశాఖాధికారి, కొత్తగూడెం
మా చదువుల ఆగకుండా ఏడాదికి రూ.3 వేల చొప్పున రవాణా భత్యం అందిస్తున్న సీఎం కేసీఆర్ సార్కు కృతజ్ఞతలు. నేను తిరుమలాపురం నుంచి నాగులవంచ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వెళ్లి చదువుకుంటా. ప్రతిరోజు ఐదు కిలోమీటర్ల ప్రయాణం కష్టతరంగా ఉంది. రవాణా భత్యం వస్తే ఇక వాహనాల్లో బడికి చేరుకుంటా.
– మడుపల్లి కార్తీక, 8వతరగతి విద్యార్థిని, తిరుమలాపురం
మాది తిరుమలాపురం. నేను ప్రతిరోజూ మా గ్రామం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగులవంచ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి చదువుకుంటా. రవాణా భత్యం అందితే నాలాంటి ఎందరో విద్యార్థులు పాఠశాలలకు వాహనాలపై వెళ్తారు. నడిచివెళ్లే వారి ఇబ్బందులు తప్పుతాయి. బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది.
– మడుపల్లి నివేదిత, విద్యార్థిని, 8వ తరగతి