వజ్రోత్సవాల వేళ క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని చాటారు. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గురువారం యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటల పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు ఖమ్మం, భద్రాద్రి కలెక్టర్లు వీపీ గౌతమ్, అనుదీప్ బహుమతులు ప్రదానం చేశారు. ఎంత ఒత్తిడి ఉన్నా.. క్రీడలకు సమయం కేటాయిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. -నమస్తే నెట్వర్క్,
ఖమ్మం సిటీ, ఆగస్టు 18: స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పర్యవేక్షణలో, ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు ఎస్ వారియర్ సారథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు, పోలీసు శాఖల వారికి జిల్లా క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫ్రీడం కప్ ఆటల పోటీలు ముగిశాయి. గురువారం ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహించిన పలు క్రీడల ఫైనల్స్ ఆద్యంతం ఆసక్తికరంగా, ఉత్సాహభరితంగా సాగాయి. పురుషులు, మహిళలకు వేర్వేరుగా నిర్వహించిన పోటీలు రాత్రి వరకు కొనసాగటం విశేషం. ప్రధానంగా టగ్ ఆఫ్ వార్ క్రీడ ఆసక్టిని పెంచింది.
పురుషులు, మహిళలు కలిసి ఆడుతున్న క్రమంలో ఇరువైపులకు చెందిన ఉద్యోగులు వేసిన అరుపులు, ఈలలు, చప్పట్లతో పటేల్ స్టేడియం దద్దరిల్లిపోయింది. అదేవిధంగా వృత్తిపరంగా నిత్యం ఎంతో బిజీగా ఉండే ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు ఎస్ వారియర్ సైతం ఆటల్లో భాగస్వాములయ్యారు. క్రికెట్, వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్, టగ్ ఆఫ్ వార్ తదితర క్రీడల్లో పాల్గొని ఫ్రీడం కఫ్ పోటీలకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రతిరోజూ ఆడుతున్న క్రీడాకారులనే తలదన్నే రీతిలో ఇద్దరూ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ‘సరిలేరు మాకెవ్వరు..’ అని నిరూపించుకున్నారు.
అనంతరం జిల్లా, మండల స్థాయిల్లో వేర్వేరుగా ఆటలు జరుగగా అథ్లెటిక్స్‌లో భాగంగా పురుషులు, మహిళలకు వంద మీటర్ల పరుగు, షాట్ పుట్, క్రికెట్, కబడ్డీ, షటిల్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నీస్, టగ్ ఆఫ్ వార్, లెమన్ స్పూన్, మ్యూజికల్ చైర్, టెన్నీకాయిట్ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారత స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటేందుకే ఆటల పోటీలు నిర్వహించినట్లు చెప్పారు. అంతకుముందు మేయర్ పునుకొల్లు నీరజ ఆటల పోటీలను సందర్శించి ఉద్యోగులను పరిచయం చేసుకుని వెళ్లారు. కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి ఎం.పరంధామరెడ్డి, కార్పొరేటర్ కమర్తపు మురళి, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్కే అఫ్జల్‌హసన్, ఆర్వీఎస్ సాగర్, పలువురు కోచ్‌లు పాల్గొన్నారు.