మామిళ్లగూడెం/ రఘునాథపాలెం, ఆగస్టు 2: జిల్లాలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్ల కాలనీల్లో అదనపు మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులకు సూచించారు. ఆయా శాఖల అధికారులతో కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన కలెక్టర్ సమీక్షలో ఆయన మాట్లాడారు. డబుల్ బెడ్ రూం కాలనీల్లో అదనపు మౌలిక వసతుల కల్పనకు ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు. జిల్లాలోని 56 కాలనీల్లో విద్యుద్దీకరణ పనులు పూర్తయ్యాయని, మరో 45 చోట్ల పూర్తి కావాల్సి ఉందని అన్నారు. తాగునీటి పనులను 20 కాలనీల్లో పూర్తి చేశామని, ఇంకా 81 చోట్ల పూర్తి చేయాల్సి ఉందని తెలిపారు.
సెప్టిక్ ట్యాంక్, సీవరేజ్ పనులు 10 చోట్ల పూర్తి చేశామని, మరో 91 చోట్ల ఇంకా పెండింగ్లో ఉన్నాయని వివరించారు. నిర్మాణ పనులు పూర్తయి లబ్ధిదారులకు అందించడానికి సిద్ధంగా ఉన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనులు చివరి దశలో ఉన్న చోట మిగులు పనులతోపాటు సదుపాయాల కల్పనకు సమాంతరంగా చర్యలు చేపట్టాలని సూచించారు. అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, డీఆర్వో శిరీష, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
‘డబుల్’ పనులు వేగవంతం చేయాలి
జిల్లాలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. ఖమ్మం కార్పోరేషన్ పరిధిలో చేపడుతున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాల పురోగతిని మంగళవారం క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. వైఎస్ఆర్ నగర్లో 4 బ్లాకుల్లో జీ ప్లస్-2లో చేపడుతున్న 96 ఇళ్లను పరిశీలించారు. 2 బ్లాకుల్లో 48 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే దశలో ఉన్నందున మిగిలిన చిన్న పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని సూచించారు.
అనంతరం కేసీఆర్ కాలనీలో నిర్మాణాలు పూర్తయి లబ్ధిదారులకు అందజేసిన గృహసముదాయాలను పరిశీలించారు. సౌకర్యాలపై లబ్ధిదారురాలు షేక్ బియానీని అడుగగా.. మంచిగా ఉన్నాయంటూ అమె సంతోషంగా సమాధానమిచ్చింది. అనంతరం అల్లిపురం, మల్లెమడుగు ప్రాంతాల్లో చేపడుతున్న డబుల్ ఇళ్లను నిర్మాణ పనులను కూడా ఆయన పరిశీలించారు. పనులు పూర్తయిన ప్రాంతాల్లో డ్రైనేజీలు, విద్యుత్ సౌకర్యం, శానిటేషన్ వంటి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. డీఆర్వో శిరీష, ఆర్అండ్బీ ఈఈ శ్యాంప్రసాద్, గిరిజన సంక్షేమ శాఖ ఈఈ తానాజీ, డీఈ రాజు, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ శైలజ తదితరులు పాల్గొన్నారు.