ములకలపల్లి, జూలై 31: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పాత గుండాలపాడుకు చెందిన ఓ బాలిక నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నది. తల్లిదండ్రులు నిరుపేదలు కావడంతో ఆమెకు సరైన వైద్యం అందించలేకపోతున్నారు. దాతల సాయం కోసం నిస్సహాయంగా ఎదురుచూస్తున్నారు. తెలిసిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కారం వెంకటేశ్వర్లు, సావిత్రి దంపతులకు నలుగురు సంతానం. వీరిలో ఇద్దరు గతంలో లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతూ మృతిచెందారు. మిగిలింది కుమారుడు, కుమార్తె. కుమారుడు కిన్నెరసాని గురుకులంలో 7వ తరగతి చదువుతున్నాడు. కుమార్తె మానస కొత్తగూడెంలో ఉమెన్స్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. ఆమె చిన్ననాటి నుంచి చదువుతో పాటు ఆటపాటల్లో ఉండే చలాకీగా ఉండేది. ఇంతలోనే విధికి కన్ను కట్టిందో ఏమో 2018లో ఆమెకు అరుదైన నరాల వ్యాధి బారిన పడింది. వ్యాధి కారణంగా బాలిక ఎడమ కాలు వాచింది.
తల్లిదండ్రులు భద్రాచలం, కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్, ఏపీలోని విజయవాడతో పాటు తమిళనాడు, కేరళలోని పలు ఆస్పత్రుల్లో రూ.2.50 లక్షలు వెచ్చించి వైద్యం చేయించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. 2021లో భద్రాచలంలో శస్త్రచికిత్స చేయించారు. కాలు అంతకంతకు పచ్చిపుండులా మారింది. ఇటీవల బాలికను హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు పరీక్షించి లక్షల మందిలో ఒకరికి ఇలాంటి వ్యాధి వస్తుందన్నారు. రూ.4 లక్షలు తీసుకుని కాలికి శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం కాలికి రక్త సరఫరా కావడం లేదని మరో శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరం ఉందని, రూ.2 లక్షలు చికిత్సకు ఇవ్వాలని వైద్యులు చెప్పారు. ఇప్పటికే ఆస్తిపాస్తులు అమ్మి కుమార్తెకు వైద్యం చేయించామని, ఇక తమ వద్ద ఏమీ లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. దాతలు ముందుకు వచ్చి సాయం చేయాలని వేడుకుంటున్నారు. దాతలు 81066 52047, 99660 13586లో సంప్రదించాలని కోరారు.