సత్తుపల్లి టౌన్, జూలై 31 : విపత్తుల సమయంలో బాధితులను ఆదుకోవడంలో సత్తుపల్లి ప్రాంతవాసులు ముందువరుసలో ఉంటారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మిత్ర ఫౌండేషన్, పాల నరసారెడ్డి ట్రస్టు, కొండపల్లి రమేశ్‌రెడ్డి సహకారంతో మంత్రి కేటీఆర్ ఇచ్చిన గిఫ్ట్ ఏ స్మైల్ పిలుపులో భాగంగా వేలేరుపాడు, కుక్కునూరు మండలాల గోదావరి వరద బాధితుల సహాయార్థం రూ.5 లక్షల సామగ్రిని పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా ఆదివారం సత్తుపల్లి క్యాంపు కార్యాలయంలో వ్యాన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే సండ్ర విలేకరులతో మాట్లాడారు. విపత్తుల సమయంలో బాధితులను ఆదుకుంటున్న సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలను ప్రశంసించారు. గడిచిన రెండేళ్లలో కరోనా విపత్తు సమయంలో కూడా సత్తుపల్లి ప్రాంతంలోని అనేక సంస్థలు ఆశాఖాన్, లయన్స్‌క్లబ్, వాసవీక్లబ్, నవచైతన్య సేవాసంస్థ, యువభారత్ శక్తి ఫౌండేషన్ తదితర సంస్థలు బాధితులకు పేదలకు సాయం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించాయని కొనియాడారు.
నియోజకవర్గ రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కరోనా సమయంలో, గోదావరి ముంపు ప్రాంతాల్లో మూగ జీవాలను ఆదుకోవాలనే సంకల్పంతో వందలాది ట్రాక్టర్ల పశుగ్రాసాన్ని ఖమ్మం, భద్రాచలం ప్రాంతంలోని గోశాలలకు అందించి తమ ధాతృత్వాన్ని చాటుకున్నారని పేర్కొన్నారు. గోదావరి ముంపు ప్రాంతాలకు అందించాల్సిన అన్నిరకాల సహాయ, సహకారాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందేలా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ముంపు ప్రాంతాలను పరిశీలించి భద్రాచలానికి తక్షణమే రూ.1000 కోట్లు ప్రకటించారని, 10మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను, 4500 మంది సిబ్బందిని భద్రాచలం ముంపు ప్రాంతంలో ఉంచి పరిస్థితిని చక్కదిద్దే విషయంలో పెద్దన్నపాత్ర పోషించారని కొనియాడారు. ముంపు బాధిత కుటుంబాలకు నేటి నుంచి నేరుగా వారి అకౌంట్లలో రూ.10 వేలు జమ చేయనున్నారని చెప్పారు. అనంతరం సత్తుపల్లి పట్టణంలో అమ్మ ఆశాఖాన్ ఆధ్వర్యంలో పట్టణంలో సేకరించిన విరాళాలను దుమ్ముగూడెం ప్రాంతంలో వరద ముంపునకు గురైన 500 కుటుంబాలకు నిత్యావసర సరుకులు, దుస్తులు పంపిణీ చేసేందుకు బయలుదేరిన వాహనానికి సండ్ర జెండా ఊపి ప్రారంభించారు.
గోదావరి వరదల కారణంగా కొండ ప్రాంతంలో పునరావాసం ఉంటున్న ఆదివాసీలకు ఎమ్మెల్యే సండ్ర నిత్యావసర సరుకులు, దుస్తులు, దుప్పట్లు పంపిణీ చేశారు. కొండ ప్రాంతంలో నడిచివెళ్లి మరీ ఆదివాసీ కుటుంబాలకు వాటిని అందించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, ఆత్మ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, దాతలు కొండపల్లి రమేశ్‌రెడ్డి, పాల వెంకటరెడ్డి, వేంసూరు జడ్పీటీసీ పగుట్ల వెంకటేశ్వరరావు, నాయకులు మేడా రమేశ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రఫీ, మున్సిపల్ కౌన్సిలర్లు మట్టా ప్రసాద్, చాంద్‌పాషా, మల్లూరు అంకమరాజు, బాలాజీరెడ్డి, వల్లభనేని పవన్, ఆశాఖాన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆశాలాల్ ఖాన్, మిషన్ నీడ్ సంస్థ సాహెల్ తదితరులు పాల్గొన్నారు.