ఖమ్మం వ్యవసాయం, జూలై 31: తల్లిపాలు అమృత తుల్యమైనవి.. బిడ్డ ఆరోగ్యానికి తల్లిపాలే శ్రీరామరక్ష. కానీ కొందరు మహిళలు అందం, ఆకృతి అంటూ పాలివ్వకుండా బిడ్డల అనారోగ్యానికి కారణమవుతున్నారు. డబ్బాపాలు తాగిస్తున్నారు. ఏడాదిలో సగటున ప్రతి వెయ్యిమంది జనాభాకు 25 మంది శిశువులు జన్మిస్తుంటే వీరిలో ముగ్గురు నుంచి నలుగురు శిశువులు తల్లిపాలకు దూరమవుతున్నారని ఒక అంచనా. బిడ్డకు సుమారు రెండేళ్ల పాటు పాలు ఇవ్వాల్సి ఉండగా ఎక్కువ మంది తల్లులు కేవలం ఏడాది మాత్రమే ఇస్తున్నారని వైద్యారోగ్యశాఖ అధ్యయనంలో తేలింది. తల్లిపాల విశిష్టతను గర్భిణులు, బాలింతలకు వివరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి వారం రోజుల పాటు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నది. స్త్రీ శిశు సంక్షేమశాఖ ప్రత్యేక ప్రణాళిక రూపొందించి వారం రోజుల పాటు అమలు చేయనున్నది.
పోతపాలతో ప్రమాదం..
పోతపాలు, పాల పౌడర్ కల్తీ అయ్యే అవకాశం ఉన్నందున పిల్లల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంది. కొందరు మహిళలు అందం, శరీర ఆకృతి చెదిరిపోతుందని బిడ్డకు పాలివ్వడం లేదు. వీరిలో ప్రధానంగా సంపన్న వర్గానికి చెందిన వారే ఎక్కువ ఉన్నట్లు అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మరికొందరు ఒక్కసారి బిడ్డకు ఇవ్వడానికి ప్రయత్నించి తర్వాత పాలు రావడం లేదని వదిలేస్తారు. వైద్యుల సలహా తీసుకుంటే సమస్యకు వారి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మెడిసిన్ ద్వారా 30శాతం మాత్రమే ఫలితం వచ్చే అవకాశం ఉంది. డబ్బాపాలు తాగిస్తే బిడ్డ కడుపునిండుతుందే కానీ పోషకాలు అందవు.
ముర్రుపాలు అమృతంతో సమానం..
ప్రసవించిన తర్వాత తల్లి బిడ్డకు ఇచ్చే ముర్రుపాలు అమృతం లాంటిది. బిడ్డకు ఆ పాలు యాంటీ బయాటిక్స్లా ఉపయోగపడతాయి. మూడు రోజుల పాటు పసుపురంగులో వచ్చే ఈ పాలలో బిడ్డ ఎదుగుదలకు కావాల్సిన పోషకాలు ఉంటాయి. పుట్టిన ప్రతిబిడ్డకు కామెర్లు ఉంటాయి. ఈ పాలు తాగిస్తే 90శాతం తగ్గుతాయి. తల్లిపాలతో పిల్లల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీంతో మేధోసంపత్తి పెరిగే అవకాశం ఉంది. రెండేళ్ల వరకు అదనపు ఆహారంతో పాటు తల్లిపాలు పట్టాలి. తల్లిపాలతో బిడ్డ పేగులో నుంచి విసర్జకాలు తొలగిపోతాయి. ఎలర్జీలు రావు. ధీర్ఘకాల వ్యాధులు ఉన్న తల్లులు వైద్యుల సలహా మేరకు శిశువులకు పాలివ్వాలి.
తల్లికీ ఆరోగ్యదాయకమే..
పాలివ్వడం వల్ల బిడ్డకు మాత్రమే కాదు తల్లికీ లాభమే. గర్భం సమయంలో తల్లి పెరిగిన శరీర బరువు తగ్గుతుంది. శరీరంలో కొవ్వు తగ్గుతుంది. ప్రసవం తర్వాత గర్భం సంచి పరిమాణం పెద్దగా ఉంటుంది. పిల్లలకు పాలు ఇస్తే ఆరువారాల్లో సాధారణ స్థాయికి వస్తుంది. పాలు ఇవ్వడం మొదలు పెడితే తల్లీబిడ్డ మధ్య బంధం (ఎమోషనల్ బాండింగ్) బలపడుతుంది. తల్లులకు రక్తస్రావం, రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, ఎముకల బలహీనత తదితర జబ్బుల నుంచి తల్లికి రక్షణ కలుగుతుంది.
బహుళ ప్రయోజనాలు..
తల్లిపాలతో బిడ్డకు బహుళ ప్రయోజనాలున్నాయి. వంద మిల్లీ లీటర్ల తల్లిపాలలో ప్రోటీన్లు -1.1 గ్రాములు, కొవ్వు – 4.2 గ్రాములతో పాటు కాల్షియం, సోడియం, పోటాషియం, పాస్ఫరస్ వంటి కార్బొ హైడ్రేట్లు ఉంటాయి. మొదటి ఆరు నెలల్లో తల్లి పాలలో ఎనిమిది రకాల ఎమినో యాసిడ్స్ ఉంటాయి. వీటి ద్వారా బిడ్డకు మలేరియా, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, డయేరియా, క్యాన్సర్, చెవి సంబంధిత సమస్యల నుంచి రక్షణ ఉంటుంది. తల్లిపాల ద్వారానే 50శాతం మేర పిల్లల ఎదుగుదల ఉంటుంది. ప్రధానంగా మెదడు, కళ్ల ఎదుగుదల బాగుంటుంది. అంటువ్యాధులు దరిచేరవు.
తల్లిపాల విశిష్టతపై విస్తృత ప్రచారం..
బిడ్డ పదికాలాల పాటు ఆరోగ్యంగా జీవించాలంటే తల్లిపాలే తాగించాలి. కృత్రిమ పాలు తాగిస్తే కలిగే దుష్ప్రయోజనాలపై అంగన్వాడీ టీచర్లు గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించాలి. కార్యక్రమంలో మానిటరింగ్ సభ్యులు, ఏఎన్ఎంలు, కిషోర బాలికలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులను భాగస్వాములను చేయాలి.
– సీహెచ్ సంధ్యారాణి, జిల్లా సంక్షేమశాఖ అధికారి, ఖమ్మం