సత్తుపల్లి, జూలై 31 : ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని కిష్టారం గ్రామపంచాయతీ కొత్త కాంతులీనుతోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామ రూపురేఖలే మారిపోయాయి. గ్రామ పంచాయతీలో పారిశుధ్య నిర్మూలన కోసం ఇంటింటికి చెత్తబుట్టలు పంపిణీ చేసి ప్రతి ఇంటికి ఇంకుడుగుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్లను నూరుశాతం పూర్తిచేశారు. గ్రామంలో మొత్తం 9వేల జనాభా ఉండగా రూ.10 లక్షలతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం, రూ.4 లక్షలతో కల్వర్టులు నిర్మించారు. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా రూ.4 లక్షలతో పల్లెప్రకృతి వనం, వైకుంఠధామం రూ.12 లక్షలు, రూ.2.50 లక్షలతో డంపింగ్‌యార్డు నిర్మాణాలను పూర్తిచేశారు. హరితహారంలో భాగంగా గ్రామంలో విస్తృతంగా మొక్కలు నాటించి వాటిని సంరక్షించే బాధ్యత పంచాయతీ చేపట్టింది. మరోవైపు ఇంటిపన్నులు వసూలు చేస్తూ లక్ష్యానికి దగ్గరైంది. సింగరేణి వల్ల కాలుష్యం పెరిగిపోతున్నా నివారణకు పెద్దఎత్తున హరితవనాలు ఏర్పాటు చేసి నాలుగు ఎకరాల్లో 17వేల మొక్కలను నాటించారు.
పచ్చదనాన్ని పంచుతున్న పల్లెప్రకృతి వనం
కిష్టారం పంచాయతీలో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనం పచ్చదనాన్ని పంచుతున్నది. ఈ పల్లెప్రకృతి వనంలో పూలు, పండ్లు వివిధ రకాల ఆహ్లాదాన్ని పంచే మొక్కలను నాటడంతోపాటు వాటి సంరక్షణకు వనమాలిని సైతం ఏర్పాటు చేశారు. హరితవనం కోసం నాలుగు ఎకరాల స్థలంలో మొక్కలు నాటించి హరితవనాలుగా తీర్చిదిద్దుతున్నారు. గ్రామనర్సరీలో భాగంగా 20వేల మొక్కలను పెంచి హరితహారం కోసం సిద్ధం చేస్తున్నారు.
చివరి మజిలీతో తీరిన చింత
కిష్టారంలో గతంలో వైకుంఠధామం లేకపోవడంతో దహన సంస్కారాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ వినూత్న ఆలోచనతో ప్రతి గ్రామంలో వైకుంఠధామం నిర్మించాలని శ్రీకారం చుట్టి ఒక్కో వైకుంఠధామానికి రూ.12 లక్షలు కేటాయించారు. దీంతో కిష్టారం సర్పంచ్ వైకుంఠధామాన్ని ఆధునిక హంగులతో తీర్చిదిద్దారు. గ్రామస్తులకు దహన సంస్కారాల సమస్య తీరినట్లయింది.
డంపింగ్‌యార్డులో కంపోస్టు ఎరువు తయారీ
ప్రతి గ్రామంలో పారిశుధ్యాన్ని మెరుగుపర్చేందుకు రూ.2.50 లక్షలు కేటాయించి డంపింగ్‌యార్డు ఏర్పాటు చేయడంతో ఇంటింటికి తడి, పొడి చెత్తను సేకరించి కంపోస్టు ఎరువుగా తయారు చేస్తున్నారు. దీంతో పంచాయతీలో పారిశుధ్యం మెరుగుపడి చెత్తాచెదారం లేకుండా స్వచ్ఛత వైపు పంచాయతీ ముందుకు సాగుతున్నది.
ప్రభుత్వ సహకారంతోనే సాధ్యం
కిష్టారం పంచాయతీ అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో సహకరిస్తున్నది. అధికారులు కూడా సహకరిస్తూ పంచాయతీ అభివృద్ధి నిధులను ఎప్పటికప్పుడు కేటాయిస్తుండటంతో గ్రామాభివృద్ధికి వినియోగిస్తున్నాం. పంచాయతీలో దాదాపు అభివృద్ధి కార్యక్రమాలను పూర్తిచేశాం. గ్రామస్తుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ముందుకెళుతున్నాం. ప్రజల సహకారం కూడా ఎల్లప్పుడూ ఉండడంతో గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నాం. ఇప్పటికే కిష్టారం పంచాయతీలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, అసిస్టెంట్ కలెక్టర్ మొగిలి స్నేహలత ఇప్పటికే అభినందించారు. ఇదేస్పూర్తిని మున్ముందు కొనసాగిస్తాం.
– శెట్టిమాల రేణుకా ఈశ్వర్, సర్పంచ్, కిష్టారం