భద్రాద్రి కొత్తగూడెం, జూలై 30 (నమస్తే తెలంగాణ)/ భద్రాచలం: భద్రాద్రి జిల్లా బీజేపీలో ముసలం పుట్టింది. ఆడియో లీకుల ద్వారా నాయకుల మధ్య విభేదాలు బట్టయబయలయ్యాయి.. పార్టీలో లుక లుకలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణపై ఆ పార్టీ భద్రాచల నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి చర్లకు చెందిన ఓ కార్యకర్తతో జరిపిన ఫోన్ సంభాషణ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నది. ‘పార్టీ పరువు తీస్తున్నారు. ఒంటెద్దు పోకడలు పోతున్నారు.
పార్టీ అధిష్ఠానం వరద బాధితులకు అధిష్ఠానం నిత్యావసరాలు పంపిస్తే వాటిలో సగం కూడా బాధితులకు చేరలేదు. భద్రాచలం నియోజకవర్గంలో నాకు తెలియకుండానే సమావేశాలు పెడుతున్నారు. వారు తాగుబోతులు. జూదగాళ్లు. పార్టీ గురించి పట్టించుకోవడం లేదన్నారు. గవర్నర్ తమిళిసై భద్రాచలం పర్యటనకు వచ్చినపుడు కేడర్‌కు కనీస సమాచారం ఇవ్వలేదు.’ అంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ఆడియో లీక్‌తో పార్టీలో అంతర్గత పోరు తీవ్రతరమైనట్లు స్థానికంగా చర్చలు నడుస్తున్నాయి. ఆడియో లీక్ పై ‘నమస్తే’ ఆమెను వివరణ కోరగా.. పార్టీ విషయాలపై కార్యకర్తలతో మాట్లాడితే తప్పేమి లేదన్నారు. ప్రతి పార్టీలో ఇలాంటి అంతర్గత సమస్యలు ఉంటాయన్నారు.