ఖమ్మం, జూలై 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ;వరద కారణంగా నిరాశ్రయులైన పినపాక నియోజకవర్గంలోని ముంపువాసులకు టీఆర్ఎస్ వెన్నుదన్నుగా నిలుస్తున్నది. ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు వరద నష్టంపై రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డికి వివరించడంతో ఆయన స్పందించి ముంపువాసులను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. వారికి నిత్యావసర వస్తువులు అందించేందుకు రూ.కోటి ఆర్థికసాయం అందించారు. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు, లోక్‌సభ ఎంపీలు నామా, కవిత, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ మధు శనివారం పినపాక నియోజకవర్గంలో సుమారు 15వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. తొలుత పినపాక మండలం ఏడూళ్ల బయ్యారంలో వరద బాధితులకు నిత్యావసరాలు, బియ్యం, వంటసామగ్రి అందజేశారు. ఈ సందర్భంగా నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణలో వరద నష్టం జరిగినా కేంద్రంలోని బీజేపీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని దుయ్యబట్టారు. ప్రతిపక్షాల గొంతు నొక్కాలని ప్రయత్నిస్తుందని ధ్వజమెత్తారు.
వరద సృష్టించిన బీభత్సంతో నిరాశ్రయులైన పినపాక నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. బూర్గంపహాడ్, అశ్వాపురం, మణుగూరు, పినపాక మండలాల్లో వరద ఉధృతి కారణంగా అనేక గ్రామాలు నీటమునగడంతో అక్కడి పేదలు సర్వం కోల్పోయారు. గోదావరి ఉగ్రరూపం వల్ల జరిగిన నష్టాన్ని గురించి ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు.. రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డికి వివరించడంతో ముంపు బాధితులకు నిత్యావసర వస్తువులు అందించేందుకు ఆయన రూ.1,01,45,000ను ఆర్థికసాయంగా అందించారు. దీంతో నియోజకవర్గంలోని సుమారు 15 వేల కుటుంబాలకు ఆ మొత్తంలో సమకూర్చిన నిత్యావసర వస్తువులను అందజేయనున్నారు. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డితోపాటు ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కలిసి పినపాక నియోజకవర్గంలో శనివారం విస్తృతంగా పర్యటించారు. తొలుత పినపాక మండలం ఏడూళ్ల బయ్యారంలో వరద బాధితులకు నిత్యావసర వస్తువులు, బియ్యం, వంట సామగ్రిని అందజేశారు.
ఈ సందర్భంగా ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తెలంగాణలో వరద సృష్టించిన బీభత్సం వల్ల వేల కుటుంబాల వారు నిరాశ్రయులైనా కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. వరద బీభత్సంపై చర్చ జరగాలని, నష్టపరిహారం ప్రకటించాలని పది రోజులుగా లోక్‌సభ, రాజ్యసభల్లో టీఆర్ఎస్ ఎంపీలం ఆందోళన చేశామని అన్నారు. కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నామన్న కక్షతో ముగ్గురు ఎంపీలను సస్పెండ్ చేసిందని ఆరోపించారు. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్లప్పుడూ పేదలకు అండగా ఉంటారని స్పష్టం చేశారు. పార్టీ సూచన మేరకు రాజ్యసభ సభ్యుడు, వ్యాపారవేత్త బండి పార్థసారథిరెడ్డి రూ.కోటి ఆర్థికసాయం అందించడం ఆయన దాతృత్వానికి, సామాజిక సేవా దృక్పథానికి నిదర్శనమని అన్నారు. మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత మాట్లాడుతూ గోదావరి వరదల వల్ల తెలంగాణలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా, పంటలకు నష్టం జరుగుతున్నా కేంద్రానికి చీమకుట్టినట్లయినా లేదని విమర్శించారు. మణుగూరు – పినపాక మార్గాన్ని జాతీయ రహదారిగా గుర్తించాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కోరినట్లు చెప్పారు.
రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి మాట్లాడుతూ అడవి బిడ్డలకు అండగా ఉండే, సహాయం చేసే అవకాశం లభించడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఆదివాసీలు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించి బంగారు భవిష్యత్‌ను అందించాలని సూచించారు. మరో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష పూరిత వైఖరిని అవలంబిస్తోందని విమర్శించారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల సమయంలో టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, కందాళ ఉపేందర్‌రెడ్డి, రాములునాయక్, జడ్పీ చైర్మన్లు కోరం కనకయ్య, లింగాల కమల్‌రాజు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, గ్రంథాలయ సంస్థల చైర్మన్లు కొత్తూరు ఉమామహేశ్వరరావు, దిండిగల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అశ్వాపురం, బూర్గంపహాడ్, నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామాల్లో వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. బూర్గంపహాడ్ మండలంలో జరిగిన కార్యక్రమంలో ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బానోతు హరిసింగ్, బూర్గంపహాడ్ ఏఎంసీ చైర్మన్ పొడియం ముత్యాలమ్మ, కొత్తగూడెం మున్సిపల్ చైర్మన్ కాపు సీతాలక్ష్మి, జడ్పీటీసీ శ్రీలత రామకొండారెడ్డి, సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమణారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీశ్, యువజన విభాగం మండల అధ్యక్షుడు గోనెల నాని, సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.