ఖమ్మం, జూలై 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణలో వరద బీభత్సంతో ఎన్నో గ్రామాలు ముంపునకు గురై ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని టీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన వారికి చట్టసభలో ప్రశ్నించే బాధ్యత లేదా అని ఆయన ప్రశ్నించారు. మణుగూరులో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భద్రాచలం మండలం నుంచి విడదీసి ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన ఐదు విలీన గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.
బీజేపీ నేతలు ఢిల్లీలో ఒక మాట, గల్లీలో మరో మాట మాట్లాడుతున్నారని ఆరోపించారు. కేంద్రం పట్టించుకోకపోయినా సీఎం కేసీఆర్ భద్రాచలం నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా చూసి రూ.1000 కోట్లు సాయం అందిస్తామన్నారని గుర్తుచేశారు. కేంద్రం మాత్రం ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి నుంచి సాయం చేసే అవకాశం ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. మహబూబాబాద్ ఎంపీ కవిత మాట్లాడుతూ.. భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లోని ఆదివాసీలకు జరిగిన వరద నష్టానికి కేంద్రం తక్షణ సాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు.