భద్రాచలం, జూలై 30: తెలంగాణ ప్రజలను ఎలా కాపాడుకోవాలో సీఎం కేసీఆర్కు తెలుసునని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఇతర ఎమ్మెల్యేలతో కలిసి శనివారం భద్రాచలం వచ్చిన ఆయన.. వారితో కలిసి ఉదయం శ్రీసీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కనీవినీ ఎరుగని రీతిలో గోదావరి వరదలు వస్తే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైందని అన్నారు. యంత్రాంగం కూడా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టిన ప్రాణనష్టం జరుగకుండా చూసిందన్నారు.
ఇదే విషయంపై కేంద్రాన్ని ప్రశ్నిద్దామని పార్లమెంట్లో ఎంత ప్రయత్నించినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చర్చకు రానివ్వడం లేదని అన్నారు. రాబోయే రోజుల్లోనైనా ఈ విషయంపై తప్పకుండా చర్చ జరుపుతామన్నారు. కానీ.. వాతావరణం అనుకూలించకున్నా సీఎం కేసీఆర్ బయలుదేరారని, రోడ్డు మార్గంలో భద్రాచలం వచ్చి వరద బాధితులకు ధైర్యం చెప్పారని గుర్తుచేశారు. ప్రభుత్వపరంగా ప్రతి కుటుంబానికీ 25 కేజీల బియ్యం, 5 కేజీల కందిపప్పు, నూనె తదితర నిత్యావసర వస్తువులను, తక్షణ సాయం కింద రూ.10 వేలను అందజేస్తున్నారని అన్నారు.
ప్రభుత్వపరంగా అనేక సహాయ సహకారాలు అందజేసినప్పటికీ.. ఇంకా ఇబ్బందిపడే కుటుంబాలను కూడా ఆదుకునేందుకు ఉమ్మడి జిల్లాల్లోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో కలిసి పినపాక నియోజకవర్గానికి వచ్చామన్నారు. మొదటిసారిగా ఈరోజు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. రాజ్యసభ సభ్యుడు, హెటిరో డ్రగ్స్ అధినేత బండి పార్థసారథిరెడ్డి కూడా పెద్దమనసుతో ముందుకొచ్చారని అన్నారు. 15 వేల మంది ముంపు బాధితులకు రూ.కోటి విలువైన నిత్యావసర వస్తువులను అందించనున్నారని అన్నారు.