ఖమ్మం ఎడ్యుకేషన్, జూలై 30 : పాఠశాల విద్యలో ప్రాథమిక విద్యే ‘పునాది’ ప్రాథమిక స్థాయిలో సరైన మౌలిక భాషా గణిత సామర్థ్యాల సాధన జరిగితే విద్యార్థులు ఉన్నత స్థాయిలో సామర్థ్యాలను సాధిస్తారు. పాఠశాల విద్య పూర్తయ్యే సరికి విద్యార్థులందరూ ఆయా సబ్జెక్టుల్లో నిర్దేశించిన సామర్థ్యాలు, అభ్యసన ఫలితాలను సాధిస్తేనే విద్యా లక్ష్యాల సాధనకు మార్గం సుగమమవుతుంది. గడిచిన రెండేళ్లలో కరోనా దృష్ట్యా విద్యార్థులు కోల్పోయిన విద్యా సామర్థ్యాలను మెరుగు పరిచేందుకు తరగతుల వారీగా మౌలిక భాషా గణిత సామర్థ్యాల సాధనపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందుకోసం ‘తొలిమెట్టు’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సామర్థ్యాల సాధనకు ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తోంది.
కనీస స్థాయి నుంచి మొదలు..
విద్యార్థుల ప్రస్తుత విద్యా పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని 2022-23 విద్యాసంవత్సరంలో చదువుతున్న తరగతికి చెందిన సామర్థ్యాలు – అభ్యసన ఫలితాల సాధన కోసం అవసరమైన కనీస స్థాయి నుంచి సామర్థ్యాల సాధనపై దృష్టి పెట్టింది. 1 నుంచి 5 తరగతుల వరకు వార్షిక ప్రణాళిక, యూనిట్, పాఠ్య ప్రణాళిక, రోజువారీ పీరియడ్ ప్రణాళికలను రూపొందించారు. వీటి ఆధారంగా ఉపాధ్యాయులు ఆయా తరగతుల వారీగా బోధనాభ్యసన ప్రక్రియలను అర్థవంతంగా, పిల్లలు భాగస్వామ్యం చురుకుగా ఉండేలా నిర్వహించనున్నారు. మొదటి నాలుగు వారాలు (ఆగస్టు) వరకు కనీస సామర్థ్యాల కోసం ప్రణాళిక రూపొందించి నమూనా పాఠ్యప్రణాళికను అమలు పరుస్తారు. ఇలా 28 వారాలపాటు ప్రత్యేకంగా సామర్థ్యాలను పెంచేందుకు ప్రత్యేకంగా శ్రద్ధ వహించనున్నారు. తరగతుల వారీగా ఉపాధ్యాయులకు ఏయే వారంలో ఏయే పాఠాల బోధన అమలు చేయాలనే విషయంపై మార్గదర్శకాలు జారీ అయ్యాయి.
మూడు విడతలుగా శిక్షణ..
ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే రిసోర్సు పర్సన్లకు నగరంలోని రిక్కాబజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ నెల 26 నుంచి 28 వరకు శిక్షణ కల్పించారు. తెలుగు, ఇంగ్లిష్, గణితం, పరిసరాల విజ్ఞానం సబ్జెక్టుల్లో ఒక్కొక్కరూ చొప్పున నలుగురు రిసోర్సు పర్సన్లు శిక్షణలో పాల్గొన్నారు. శిక్షణ ప్రారంభం, ముగింపునకు డీఈవో యాదయ్య హాజరై పర్యవేక్షించారు. జిల్లాలో ఉన్న ఉపాధ్యాయులకు మూడు విడతలుగా శిక్షణ పూర్తి చేయనున్నారు. రెండు, మూడు మండలాల్లో మినహా అన్ని మండలాల్లోనూ రెండు విడతల్లో శిక్షణ పూర్తి కానుంది. తొలి విడతను ఈ నెల 30 నుంచి ఆగస్టు 2 వరకు, రెండో విడత ఆగస్టు 3 నుంచి 6 వరకు, మూడో విడతను ఆగస్టు 8 నుంచి 11 వరకు నిర్వహించనున్నారు.
నోడల్ ఆఫీసర్లుగా సీనియర్ హెచ్ఎంలు..
‘తొలిమెట్టు’ కార్యక్రమ పర్యవేక్షణతోపాటు విద్యా సంబంధిత అంశాల పర్యవేక్షణకు విద్యాశాఖ నోడల్ ఆఫీసర్లును నియమించనుంది. ఇందుకు సీనియర్ ప్రధానోపాధ్యాయుల వివరాలపై జిల్లా విద్యాశాఖాధికారులు కసరత్తు చేస్తున్నారు. మండలాల వారీగా ప్రధానోపాధ్యాయులు వివరాలను సేకరించారు. వీరిని నోడల్ ఆఫీసర్లుగా నియమించి పర్యవేక్షణ చేసి ఆయా పాఠశాలల్లో ఉన్న ప్రగతిని తెలుసుకోనున్నారు.
పర్యవేక్షణ ఇలా..మండల స్థాయిలో…
నోడల్ అధికారితోపాటు ఒక రిసోర్స్ టీచర్ కలిసి పాఠశాలలను సందర్శిస్తారు. ఒక వారంలో రెండు రోజులు పాఠశాలల సందర్శించాలి. రెండు నెలల సమయంలో మండలంలోని అన్ని పాఠశాలలనూ సందర్శించాలి. ఆ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలి.
క్లస్టర్ పరిధిలో..
కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులతోపాటు ఒక రిసోర్స్ టీచర్ కలిసి పాఠశాలలను సందర్శించాలి. ఒక వారంలో రెండు రోజులు సందర్శించాలి. నెలలో క్లస్టర్ పరిధిలో అన్ని పాఠశాలలనూ సందర్శించాలి.
రిసోర్స్ టీచర్లు..
ప్రతి కాంప్లెక్స్‌లో ఐదుగురు రిసోర్స్ టీచర్లను ఎంపిక చేస్తారు. ఒక రిసోర్స్ టీచర్, రొటేషన్ పద్ధతిలో నోడల్, కాంప్లెక్స్ అధికారులు కలిసి పాఠశాలలను సందర్శిస్తారు.
పకడ్బందీగా శిక్షణ ప్రక్రియ..
విద్యార్థుల సామర్థాలను పెంచేందుకు నిర్వహిస్తున్న శిక్షణను పకద్బందీగా నిర్వహిస్తున్నాం. ఇప్పటికే మూడు విడతల శిక్షణకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటించాం. శిక్షణ అనంతరం తొలిమెట్టు కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తాం. ఇందుకోసం నోడల్ ఆఫీసర్ల నియామకానికి కసరత్తు చేస్తున్నాం.
–డీఈవో యాదయ్య, ఖమ్మం