అశ్వారావుపేట టౌన్, జూలై 30: దశాబ్దాలుగా ఆర్థికంగా వెనకబడిన ఎస్సీ కుటుంబాలకు రూ.10 లక్షల విలువైన యూనిట్లు అందజేసి వారి ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తున్నది. లబ్ధిదారుల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నది. పథకం ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పేరాయిగూడెం పంచాయతీ పరిధిలోని మోడల్ కాలనీకి చెందిన తగరం వెంకటేశ్వరరావు లబ్ధిపొందాడు. డెయిరీ ఫాం ఏర్పాటు చేసి ఆర్థికంగా ఎదుగుతానంటున్నాడు. ఇద్దరు పిల్లలను చదివించుకుంటానంటున్నాడు. పథకం అందించినందుకు ప్రతిరోజు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి మొక్కుతున్నారు. దేవుడిలా కొలుస్తున్నారు. భార్యాభర్తలు వెంకటేశ్వరరావు, అన్నమ్మ మనోగతం ఇదీ..
మా పాలిట దేవుడు కేసీఆర్
మాది నిరుపేద కుటుంబం. కూలి పనులకు వెళ్లి పిల్లలను పోషించుకుంటున్నాం. పనికి వెళ్తేనే పూట గడుస్తుంది. మాకు రూపాయి దాచుకోవడమూ కష్టమే. మాకిద్దరు పిల్లలు. పెద్ద కుమార్తె మీనాక్షి డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నది. చిన్న కుమార్తె చంద్రిక ఎంసెట్‌కు ప్రిపేర్ అవుతున్నది. పిల్లలిద్దరూ ఆశ్రమ పాఠశాలలోనే చదివారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. పిల్లలను ఎలా చదివించాలని బాధపడేవాళ్లం. సీఎం కేసీఆర్ దేవుడిలా దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. అశ్వారావుపేట నియోజకవర్గం నుంచి మా కుటుంబం పథకాన్ని ఎంపికైంది. పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుకు ధన్యవాదాలు. ప్రభుత్వం ఇచ్చే రూ.10 లక్షలతో డెయిరీ ఫాం పెడతాం. పాడి గేదెలను సాకి పిల్లలను బాగా చదివించుకుంటాం. కూలీలమైన మమ్మల్ని ప్రభుత్వం డెయిరీ ఫాంకు యజమానులు చేస్తున్నది. దళితబంధు పథకంతో మాలాంటి ఎన్నో నిరుపేద కుటుంబాలు బాగు పడతాయి. ఇంత చక్కటి పతకాన్ని అమలు చేస్తున్న సీఎం కేసీఆర్‌ను దేవుడిలా కొలుస్తున్నాం. ఆయన చిత్రపటాన్ని మా పూజ గదిలో పెట్టుకున్నాం.
– తగరం వెంకటేశ్వరరావు, అన్నమ్మ దంపతులు