దమ్మపేట రూరల్, జూలై 30 : క్రూడ్ పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని(అగ్రి సెస్) 5.5 శాతానికి తగ్గించి కేంద్రం ఆయిల్‌పాం రైతుల నడ్డి విరుస్తున్నది. ఆయిల్‌పాం గెలల ధర నానాటికీ పతనమవుతున్నది. ఈ నెలలో టన్ను గెలల ధర జూన్ కంటే రూ.3,200 తగ్గి రూ.20,267కి పడి పోయింది. ఆగస్టులో ధరలు మరింత పతనం కానున్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ రైతులకు రాయితీలు, ప్రోత్సాహకాలు ఇచ్చి సాగును ప్రోత్సహిస్తుంటే కేంద్రం అవి ఇవ్వకపోగా సాగు దిగుమతి సుంకాన్ని తగ్గించి సాగుపై వేటు వేస్తున్నది. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేస్తున్న రైతులకు అన్యాయం చేస్తున్నది. దేశంలో ఆయిల్‌పాం సాగును దేశవ్యాప్తంగా విస్తరించాలని కేంద్రం అనామక ప్రకటనలు చేస్తున్నదే తప్ప సాగుపై రైతులకు ఎలాంటి రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటించలేదు. నేషనల్ ఎడిబుల్ ఆయిల్ మిషన్ ఏర్పాటు చేసి సాగుపై అధ్యయనం చేస్తున్నామని ఆర్భాటాలు చేయడమే తప్ప రైతులకు చేసిందేమీ లేదు.
సాగు విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు..
రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్‌పాం సాగును ప్రోత్సహిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల ఎకరాల్లో సాగును విస్తరించాలని భారీ లక్ష్యం పెట్టుకుంది. టీఎస్ ఆయిల్‌ఫెడ్ 2022-23 ఆర్థిక సంవత్సరంలో 70 వేల ఎకరాల్లో సాగు చేపట్టేందుకు రైతులకు మొక్కలు అందజేస్తున్నది. రైతులకు ప్రోత్సాహకంగా ఒక హెక్టారులో మొక్కలు నాటేందుకు రూ.20 వేలు, నాలుగు సంవత్సరాల పాటు ఎరువులకు రూ.21 వేలు, డ్రిప్‌కు రూ.49 వేలు, నాలుగేళ్లపాటు అంతర పంటల సాగుకు రూ.21 వేల రాయితీలు ఇస్తున్నది. ఇప్పటికే జిల్లాలోని అప్పారావుపేట, అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీల ద్వారా గెలలు సేకరిస్తుండగా కొత్తగా ఖమ్మం జిల్లాలోని వేంసూరు, సిద్దిపేట జిల్లాకేంద్రం, గద్వాల జిల్లాలోని బీచుపల్లి, మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరులో ఫ్యాక్టరీలు నిర్మించనున్నది. నిర్మాణానికి ఇప్పటికే స్థలాల సేకరణ పూర్తయింది. సిద్దిపేటలో శంకుస్థాపన సైతం పూర్తయింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం కేవలం 7,230 హెక్టార్లకు 60 శాతం మాత్రమే నిధులు సమకూర్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో నిధుల కేటాయింపుపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు.
పడిపోతున్న విదేశీ మారక ద్రవ్యాలు..
శ్రీలంకలో విదేశీ మారక ద్రవ్యాలు లేక అక్కడి ఆర్థిక వ్యవస్థ దివాలా తీసింది. దీని నుంచి ప్రపంచ దేశాలన్నీ గుణపాఠం నేర్చుకుంటున్న వేళ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడం లేదని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 13 నుంచి సెప్టెంబర్ వరకు దిగుమతి చేసుకునే క్రూడ్ పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని 5.5 శాతానికి పరిమితం చేసింది. దీంతో ఇండోనేషియా, మలేషియా నుంచి దిగుమతులు పెరగడంతో వంట నూనెల ధరలు తగ్గుముఖం పట్టాయి. టన్ను గెలల ధర ఒక్క జూలైకే రూ.3,200 పడిపోయిందంటే మున్ముందు ధరలు ఎలా ఉంటాయో ఊహించవచ్చు.
తెలుగు రాష్ర్టాల్లో భారీగా క్రూడ్ ఆయిల్..
తెలుగు రాష్ర్టాల్లో ఆయిల్‌పాం తోటలు సాగు విస్తారంగా ఉంది. ఏటా తెలంగాణ నుంచి రూ.450 కోట్లు, ఆంధ్రా నుంచి రూ.2,700 కోట్ల్ల విలువైన క్రూడ్ పామాయిల్ ఉత్పత్తి జరుగుతున్నది. దీంతో పాటు రెండు రాష్ర్టాలు కలిపి రూ.550 కోట్ల విలువైన పామాయిల్ గింజల ఆయిల్ ఉత్పత్తి అవుతున్నది. ఇదంతా రైతులు ఆదా చేస్తున్న విదేశీ మారక ద్రవ్యమే. ఇంత విలువైన సంపదను కాపాడుతున్న ఆయిల్‌పాం రైతులకు కేంద్రం ఎలాంటి ప్రోత్సాహకాలు, రాయితీలు ఇవ్వడం లేదు. వారికి ప్రోత్సాహకాలు, రాయితీలు అందిస్తే ఆయిల్‌పాం సాగు విస్తీర్ణం మరింత వేగంగా పెరిగే అవకాశాలు మెరుగు పడతాయి.