రామవరం, జూలై 26:సింగరేణి సంస్థ ఉత్పత్తి గమ్యాన్ని, ఉత్పాదకత లక్ష్యాన్ని చేరుకుంటూనే దీనికి కారణభూతులైన కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు, పరిసర ప్రాంత ప్రజలకు ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఎకో పార్కుల నిర్మాణంలో భాగంగా సుమారు 2.5 కోట్ల వ్యయంతో సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని రుద్రంపూర్ ప్రగతివనం, దన్బాద్ చెరువు, గౌతంఖని ఓపెన్‌కాస్టు ప్రాంతాల్లో ఎకో పార్కు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ పనులు చేపట్టి ఈ ఏరియాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టింది. అందులో భాగంగా దన్బాద్ చెరువుకు మహర్దశ పట్టింది. చెరువు పూడిక పనులతోపాటు చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ నిర్మిస్తోంది. ట్యాంక్‌బండ్ పనులు చేపట్టి చెరువులో బోటింగ్ ఏర్పాట్లు వేగవంతంగా చేస్తున్నారు.
ఓపెన్ జిమ్, ఫుడ్ కోర్డు, యోగా సెంటర్లు..
టీఆర్ఎస్ అనుబంధ గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండీ రజాక్ అభ్యర్థన మేరకు సింగరేణి కొత్తగూడెం ఏరియా జీఎం సీహెచ్ నర్సింహారావు ప్రత్యేక చొరవతో కార్మికుల ఆరోగ్యం కోసం ప్రగతివనంలో ఓపెన్ జిమ్‌ను ఏర్పాటుచేశారు. మానసిక ఒత్తిడి దూరంచేసేందుకు మహిళలకు, పురుషులకు వేర్వేరు యోగా సెంటర్లను ఏర్పాటుచేస్తున్నారు. సందర్శకులకు ఉపయోగపడేలా క్యాంటీన్ ఏర్పాటుతోపాటు మరుగుదొడ్లు, వ్యూ పాయింట్, బోటు షికారు కోసం ఫెర్రీ వంటివి ఏర్పాటుచేస్తున్నారు. అగస్టు చివరినాటికల్లా పనులు పూర్తయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఏరియా సివిల్ ఏజీఎం టీ.సూర్యనారాయణ ప్రత్యేక చొరవ తీసుకొని గడువులోగా పనులు పూర్తయ్యేలా కార్యాచరణ చేపడుతున్నారు.

త్వరితగతిన పూర్తిచేయాలి..
త్వరితగతిన పనులు చేపట్టి అందుబాటులోకి తెచ్చేలా చొరవ తీసుకోవాలి. ఓపెన్ జిమ్‌లను పార్కులకే కాకుండా గ్రౌండ్లలో కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఓపెన్ జిమ్ అన్ని కాలాల్లో అందుబాటులో ఉండే విధంగా జిమ్‌పై షెడ్డు నిర్మిస్తే బాగుంటుంది. కార్మికుల ఆరోగ్యం పట్ల సింగరేణి యాజమాన్యం స్పందించి ఇలాంటి ఏర్పాట్లు చేయడం శుభపరిణామం. కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే ఉత్పత్తి, ఉత్పాదకత సాధ్యమవుతుంది.
-ఎండీ రజాక్, టీబీజీకేఎస్ ఏరియా వైస్ ప్రెసిడెంట్
ఆగస్టుకల్లా పనులు పూర్తిచేస్తాం..
కార్మికుల సంక్షేమం కోసం సింగరేణి యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఇందులో భాగంగానే పార్కుల ఆధునీకరణ, చెరువుల పునరుద్ధరణ పనులు చేపడుతోంది. సంస్థ డైరెక్టర్లు, ఏరియా జీఎం సహాయ సహకారాలతోనే అభివృద్ధి పనులు సాగుతున్నాయి. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ నిర్మిస్తున్నాం. సందర్శకుల కోసం ఫుడ్ కోర్టు, వ్యూ పాయింట్ నిర్మిస్తున్నాం. మరుగుదొడ్లు, ప్రహరీ నిర్మాణం సైతం చేపడుతున్నాం. ఆగస్టు చివరి నాటిక అభివృద్ధి పనులన్నీ పూర్తి చేస్తాం.
-టీ.సూర్యనారాయణ, సివిల్ ఏజీఎం